KCR National Party : జాతీయ పార్టీకి ముహుర్తం ఫిక్స్ ? సరైన టైమ్ సెట్ చేసుకున్న కేసీఆర్ !
కేసీఆర్ జాతీయ రాజకీయాల్లోకి వెళ్తున్నానని చాలా కాలంగా ప్రకటిస్తారు. కానీ ఎప్పుడు. ఎలా అనేది మాత్రం సస్పెన్స్ గానే ఉంది.
KCR National Party : జాతీయ రాజకీయాల్లోకి వెళ్తున్నాం... ఢిల్లీలో జెండా పాతేయబోతున్నామని టీఆర్ఎస్ పార్టీ నేతలకు కేసీఆర్ గట్టి భరోసా ఇచ్చారు. మీలో చాలా మంది నేతలు కేంద్ర మంత్రులవుతారని కూడా ఆశలు కల్పించారు. పదిహేడు పార్లమెంట్ నియోజకవర్గాలున్న తెలంగాణలో ఉన్న టీఆర్ఎస్ .. ఢిల్లీలో ప్రభుత్వాన్ని ఎలా ఏర్పాటు చేస్తుందనేది చాలా మందికి అర్థం కాని విషయం. కానీ కేసీఆర్ మాత్రం పక్కా వ్యూహంతో ఉన్నారు. జాతీయ పార్టీని పెట్టాలని.. రైతు ఎజెండాతో తెలంగాణ తరహా ఉద్యమం తీసుకు రావాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.
కేసీఆర్ జాతీయ రాజకీయాల అడుగు ఎప్పుడు ?
బీజేపీకి వ్యతిరేకంగా ఆయన జాతీయ స్థాయిలో పోరాటానికి సొంత పార్టీ పెట్టాలనే ఆలోచన కేసీఆర్ చేశారు. దాదాపుగా అన్నీ సిద్ధం చేసుకున్నారు. అన్ని విధాలుగా అధ్యయనం చేసిన తర్వాత కేసీఆర్ రైతు ఎజెండాతో జాతీయ పార్టీ పెట్టాలని నిర్ణయించుకున్నారు. తన పార్టీ నేతలుగా కేవలం రైతు నేతలనే పరిచయం చేస్తారని చెబుతున్నారు. అందుకే తన పార్టీ పేరును కూడా భారత రైతు సమితిగా ఖరారు చేస్తున్నట్లుగా తెలుస్తోంది. ఇప్పటి వరకూ భారత రాష్ట్ర సమితి... బీఆర్ఎస్ ను ప్రారంభిస్తున్నారని అనుకున్నారు. కానీ ఆయన రైతు సమితికే మొగ్గు చూపుతున్నారు. జాతీయ రాజకీయాల్లోకి వెళ్తున్నానని రైతు ఎజెండాగా ముందుకు వెళ్తున్నామని కేసీఆర్ ఇప్పటికే పలుమార్లు ప్రకటించారు. కేసీఆర్ ఇతర పార్టీలను కలుపుకోవడం కన్నా.. సొంతంగా జాతీయ పార్టీ పెట్టడానికే ప్రాధాన్యం ఇస్తున్నారు. రైతులందర్నీ ఏకం చేస్తే కేంద్రాన్ని ఎదిరించవచ్చని కేసీఆర్ గట్టి నమ్మకంతో ఉన్నారు.
ముందు రాష్ట్రంలో గెలవడం ముఖ్యం !
కేసీఆర్ చాలా కాలంగా జాతీయ రాజకీయాలపై సీరియస్‌గా వర్కవుట్ చేస్తున్నారు. అయితే అదే సమయంలో రాష్ట్రంలో పట్టు కోల్పోతే దేశంలో ఎవరూ పట్టించుకోరన్న కారణంగా ముందు సొంత ఇంటిని చక్క దిద్దుకోవాలన్న ఆలోచన చేస్తున్నట్లుగా తెలుస్తోంది. ఎంత ధీమాగా ఉన్నా.. టీఆర్ఎస్ పరిస్థితి మరీ అంత మెరుగ్గా ఏమీ లేదని.. చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుందని.. కేసీఆర్ భావిస్తున్నట్లుగా తెలుస్తోంది. బీజేపీ, కాంగ్రెస్ మధ్య ఓట్లు చీలిపోయి తాము గెలుస్తామని టీఆర్ఎస్ వర్గాలు ఇప్పటి వరకూ అంచనా వేస్తున్నాయి. కానీ ప్రజలు మార్పును డిసైడ్ అయితే ఏదో ఓ పార్టీకి గుంపగుత్తగా వేస్తారని ప్రస్తుతం పొలిటికల్ ట్రెండ్స్ చెబుతున్నాయి. వీటన్నింటినీ పరిగణనలోకి తీసుకున్న కేసీఆర్ ముందుగా.. అధికారాన్ని నిలబెట్టుకోవడంపై దృష్టి సారించాలని నిర్ణయించినట్లుగా తెలుస్తోంది.
అసెంబ్లీలో గెలిచిన తర్వాతే జాతీయ పార్టీ !
అయితే కేసీఆర్ ఢిల్లీని గురి పెట్టే ముందు గల్లీని దాటాల్సి ఉంది. పార్లమెంట్ ఎన్నికల కంటే అసెంబ్లీ ఎన్నికలు ముందు రానున్నాయి. అసెంబ్లీలోనే గెలిస్తేనే ఢిల్లీ వైపు పెట్టేగురికి బలం ఉంటుంది. లేకపోతే ఉండదు. అయితే గతంలోలా పరిస్థితులు లేవు. కాంగ్రెస్, బీజేపీల నుంచి తీవ్రమైన ప్రతిఘటన ఎదురవుతోంది. రెండు సార్ల ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత కనిపిస్తోంది. ప్రజలకు చేసిన మేళ్లను కేసీఆర్ ఏకరవు పెడుతున్నారు. ముందు కేసీఆర్ లక్ష్యం అసెంబ్లీని గెలవడమే. ఆ వ్యూహంతోనే జాతీయ రాజకీయాల ప్రకటనలు కేసీఆర్ చేస్తున్నట్లుగా భావిస్తున్నారు.
ముందస్తుకు వెళ్తే వచ్చే జనవరిలోనే ఎన్నికలు ?
ముందుగా తెలంగాణలో మూడో సారి పార్టీని అధికారంలోకి తేవాలని కేసీఆర్ నిర్ణయించుకున్నారు. దానికి బీజేపీని సానుగా చూపుతారా.. టీడీపీనా అన్నది ఆయన రాజకీయ వ్యూహం. ఎన్నికలు పూర్తయిన తర్వాతనే ఆయన జాతీయ పార్టీ గురించి కార్యాచరణలోకి దిగుతారని అంటున్నారు ఈ జాతీయ పార్టీ అంశమే.. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో హైలెట్ అయ్యే అవకాశం ఉంది. మరో ఏడాదిలో ఎన్నికలు జరగాల్సి ఉంది. ఈ సారి ఆరు నెలల ముందస్తుకు వెళ్తే జనవరిలోనే జరిగే అవకాశాలుంటాయి. ఆ తర్వాత కేసీఆర్ పూర్తి స్థాయిలో జాతీయ రాజకీయాలపై దృష్టి పెట్టే అవకాశం ఉంటుంది.