KCR National Plans : ఉత్తరాది కాదు ముందు సరిహద్దు రాష్ట్రాలపైనే బీఆర్ఎస్ గురి - కేసీఆర్ రోడ్ మ్యాప్ రెడీ చేసుకున్నట్లేనా ?
సరిహద్దు రాష్ట్రాల్లో బీఆర్ఎస్ విస్తరణకు కేసీఆర్ రోడ్ మ్యాప్ రెడీ చేసుకున్నారు. మహారాష్ట్రతో పాటు త్వరలో ఏపీ, ఒడిషాల్లో బహిరంగసభలు నిర్వహించే అవకాశం ఉంది.
KCR National Plans : తెలంగాణ సీఎం కేసీఆర్ భారత్ రాష్ట్ర సమితిని ఇతర రాష్ట్రాలకు ఎలా విస్తరించాలన్నదానిపై ఓ రోడ్ మ్యాప్ రెడీ చేసుకున్నట్లుగా తెలుస్తోంది. నేరుగా ఆయన ఉత్తరాది రాష్ట్రాలకు వెళ్లకుండా.. ముందుగా పొరుగు రాష్ట్రాల్లో విస్తరించాలనుకుంటున్నారు. అందులో భాగంగానే వచ్చేనెల 5న మహారాష్ట్రలోని నాందేడ్ జిల్లా కేంద్రంగా భారీ బహిరంగ సభను నిర్వహించి బీఆర్‌ఎస్ బలాన్ని చాటుకునే దిశగా చర్యలు ప్రారంభించారు. తెలంగాణ సరిహద్దు ప్రాంతం కావడంతో జన సమీకరణ సమస్య లేకుండా ఉంటుందని, అలాగే తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న అనేక సంక్షేమ పథకాల ఫలాలు తమకూ కావాలంటూ అనేక సందర్భాల్లో అక్కడి ప్రజల నుంచి వచ్చిన డిమాండ్‌ను దృష్టిలో పెట్టుకుని నాం దేడ్‌ను ఎంపిక చేసినట్లు తెలుస్తోంది.
తెలంగాణలో మరో జాతీయస్థాయి బహిరంగసభ
ఫిబ్రవరి 17న ప్రతిష్టాత్మక సచివాలయ ప్రారంభోత్సవానికి మూడు రాష్ట్రాల నుంచి ప్రముఖులు వస్తున్నందున అదే రోజు పరేడ్ గ్రౌండ్‌లో బహిరంగ సభకు ప్లాన్ చేశారు. ఈ రెండు సభలను ఖమ్మం తరహాలోనే విజయవంతం చేసి ఇక పొరుగు రాష్ట్రాల్లో అడుగు పెట్టాలన్నది సీఎం కేసీఆర్ వ్యూహంగా భావిస్తున్నారు. ప్రతిరోజూ ఆయన ఎక్కువ సమయం బీఆర్‌ఎస్ విస్తరణ కోసమే కేటాయిస్తూ, మద్దతు కూడగట్టుకునే క్రమంలో అనేకమంది నేతలకు స్వయంగా ఫోన్ చేస్తున్నారని బీఆర్ఎస్ వర్గాలు చెబుతున్నాయి. దక్షిణాది రాష్ట్రాల్లో వరుస పర్యటనలు, సమావేశాలతో మద్దతు కూడగట్టుకోబోతున్నారు. నాందేడ్ తెలంగాణ సరిహద్దు ప్రాంతం కావడంతో నిజాబామాద్, ఆదిలాబాద్ జిల్లాల నుంచి జనాన్ని తరలించే ఏర్పాట్లకు సన్నాహాలు మొదలయ్యాయి. ఇప్పటికే నాందేడ్ సభ ఏర్పాట్ల కోసం మంత్రి ఇంద్రకిరణ్ రెడ్డిని ఇన్‌ఛార్జిగా కేసీఆర్ నియమించారు.
కాంగ్రెస్ తో పొత్తులో ఉన్న పార్టీల నేతలకూ ఆహ్వానం !
ఖమ్మంలో నిర్వహించిన బీఆర్‌ఎస్ పార్టీ ఆవిర్భావ సభలో కూడా మూడు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, జాతీయ నాయకులు పాల్గొన్నారు. అప్పుడు కాంగ్రెసేతర ముఖ్యమంత్రులను ఆహ్వానించిన సీఎం కేసీఆర్, ఫిబ్రవరి 17న జరగబోతున్న సచివాలయ ప్రారంభోత్సవానికి కాంగ్రెస్ పార్టీతో భాగస్వాములుగా ఉన్న ముఖ్యమంత్రులు, ఉపముఖ్యమంత్రులను ఆహ్వానించడం చర్చనీయాంశంగా మారింది. సీఎం కేసీఆర్ జన్మదినమైన ఫిబ్రవరి 17న నూతనంగా నిర్మించిన సచివాలయ భవన ప్రారంభోత్సవానికి తమిళనాడు ముఖ్యమంత్రి, డీఎంకే అధ్యక్షుడు స్టాలిన్, ఝార్కండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్, బీహార్ ఉప ముఖ్యమంత్రి తేజస్వియాదవ్, బీహార్ ముఖ్యమంత్రి నితీశ్‌కుమార్ తరఫున ఆయన ప్రతినిధి, జేడీయూ జాతీయ అధ్యక్షుడు లలన్‌సింగ్ హాజరవుతున్నారు. వీరంతా కాంగ్రెస్ కూటమిలో ఉన్న వారే.
తర్వాత ఏపీ, ఒడిషాల్లో బహిరంగసభలు!'
కేసీఆర్ ఏపీ బీఆర్ఎస్ అధ్యక్షుడ్ని ఖరారు చేశారు. విశాఖలో బహిరంగసభ పెట్టాలని నిర్ణయించారు. త్వరలో తేదీని ఖరారు చేయనున్నారు. ఒడిషా బీఆర్ఎస్ అధ్యక్షుడ్ని కూడా దాదాపుగా ఖరారు చేశారు. మాజీ సీఎం గిరిధర్ గమాంగ్.. బీఆర్ఎస్ ఒడిషా అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టబోతున్నారు. ఆ తర్వాత ఒడిషాలోనూ బహిరంగశభ నిర్వహించనున్నారు. ఇప్పటికే కేరళ సీఎం పినరయి విజయన్, కర్ణాటక మాజీ సీఎం కుమారస్వామి బీఆర్‌ఎస్‌కు మద్ధతుగానే ఉన్నారు. తమిళనాడు సీఎం స్టాలిన్ కూడా బీఆర్‌ఎస్ రెండో సభకు హాజరుకానుండడంతో దాదాపు దక్షిణాదిలోని రాష్రాలన్నింటిలో బీఆర్‌ఎస్‌కు బలం ఉన్నట్లేనని పార్టీ సీనియర్లు భావిస్తున్నారు. ఉత్తరాదిలో కూడా బీఆర్‌ఎస్‌కు మద్ధతు ఖచ్చితంగా ఉంటుందన్నది కేసీఆర్ మదిలో ఉన్న బలమైన నమ్మకం.