KCR Election Plan : ముందస్తు ఆలోచనను కేసీఆర్ విరమించుకున్నట్లేనా ? కారణాలు ఇవేనా ?
ముందస్తు ఎన్నికల ఆలోచన విరమించుకున్న కేసీఆర్ ఢిల్లీ లిక్కర్ స్కామే కారణమా ? ఇప్పుడు అసెంబ్లీ రద్దు చేసినా వెంటనే ఎన్నికలు పెట్టరని ఆగిపోయారా ?ఇక ఏడాది చివరిలోనే ఎన్నికలా ?
KCR Election Plan : తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ముందస్తు ఎన్నికలు అంటూ ఉండవని షెడ్యూల్ ప్రకారమే ఎన్నికలు జరుగుతాయని ప్రకటించారు. ఒక రోజు కేబినెట్ భేటీ .. మరో వైపు బీఆర్ఎస్ కార్యవర్గ సమావేశాన్ని ఏర్పాటు చేయడంతో కేసీఆర్ ముందస్తు ఎన్నికలకు రంగం సిద్ధం చేసుకున్నారని అందరూ అనుకున్నారు. అంతకు ముందే అభ్యర్థులపై కసరత్తు పూర్తి చేశారని కూడా ప్రచారం జరిగింది. ఆరు నెలలు ముందుగానే ఎన్నికలకు వెళ్లాలనుకుని ఇప్పుడు వెనక్కి తగ్గారని బీఆర్ఎస్ నేతలు అుకుంటున్నారు. కేసీఆర్ నిర్ణయానికి కారణం ఏమిటి? బీజేపీ వ్యూహాలు అంతు చిక్కకనే వెనక్కి తగ్గారా ?
కీలక దశలో లిక్కర్ స్కాం విచారణ - కవిత చుట్టూ రాజకీయం !
ఢిల్లీ లిక్కర్ స్కాంలో ఎమ్మెల్సీ కవితపై తీవ్రమైన ఆరోపణలు చేస్తున్నాయి కేంద్ర దర్యాప్తు సంస్థలు. అధికార పార్టీగా ఉంటే కవితకు అండగా ఉండే విషయంలో కొంత అడ్వాంటేజ్ ఉంటుంది. ఆ అధికారాన్ని వదులుకుంటే.. కవితకూ అండగా ఉండలేని పరిస్థితి వస్తుందన్న అంచనా ఉంది. ఓ రకంగా ఇప్పుడు సీఎం కేసీఆర్‌కు అధికారం చాలా అవసరమే కాదు.. ఎంతో ముఖ్యం కూడా. ఇలాంటి సమయంలో ఆయన అధికారాన్ని చేజేతులా వదులుకుని అసెంబ్లీని రద్దు చేసి ఎన్నికలకు వెళ్లడం మంచిది కాదని భావించారంటున్నారు. ముందస్తుకు వెళ్తే గెలుపు ఖాయం అయినప్పటికీ.. ఇప్పటికిప్పుడు అధికారం వదులుకుంటే కవితకు కాపాడుకునేందుకు ఉన్న అవకాశాలు కూడా చేజేతులా వదిలేసినట్లవుతుందని బీఆర్ఎస్ వర్గాలు చెబుతున్నాయి.
అసెంబ్లీ రద్దు చేసినా కర్ణాటకతో పాటు ఎన్నికలు పెట్టే చాన్స్ లేనట్లే !
ఇప్పుడు బీజేపీ ఎలా వ్యవహరిస్తుందో చెప్పడం కష్టం. ఇప్పుడు అసెంబ్లీని రద్దు చేసినా ఎన్నికలు నిర్వహిస్తారన్న గ్యారంటీ లేదు. కర్ణాటకలో ఎన్నికల నిర్వహణకు ఈసీ ఇప్పటికే సన్నాహాలు ప్రారంభించింది. మరో నెల రోజుల్లో ఎప్పుడైనా షెడ్యూల్ రిలీజ్ చేయవచ్చు. ఇలాంటి సమయంలో కేసీఆర్ తెలంగాణ అసెంబ్లీని రద్దు చేస్తే ఈసీ కూడా ఆసక్తి చూపించదని భావిస్తున్నారు. అదే సమయంలో రాష్ట్రపతి పాలన విధించడానికి కూడా వెనుకాడకపోవచ్చు. అందుకే ఇంతా చేసి బీజేపీ చేతిలో అధికారం పెట్టి ఎన్నికలకు వెళ్లడం కన్నా... సమయం వరకూ వేచి చూసి.. తామే అధికార పార్టీగా ఎన్నికలకు వెళ్లడం మంచిదన్న ఉద్దేశానికి కేసీఆర్ వచ్చినట్లుగా తెలుస్తోంది.
పాదయాత్రల పవర్ గుర్తించిన కేసీఆర్ !
ముందస్తు లేదని తేల్చడంతో కేసీఆర్ పార్టీ నేతలకు ఇతర టాస్కులు ఇచ్చారు. పాదయాత్రలు చేయాలని సూచించారు. పాదయాత్రలకు అంత సీన్ లేదని చెబుతూ వస్తున్న కేసీఆర్.. పార్టీ నేతలందరూ అదే చేయాలని చెప్పడం ఆయన ఆలోచనల్లో వస్తున్న మార్పునకు సంకేతాలని బీఆర్ఎస్ వర్గాలంటున్నాయి. ప్రస్తుతం విపక్ష పార్టీల్లో పాదయాత్రలు చేయని వారు లేరు. కాంగ్రెస్ నేతలంతా చేస్తున్నారు. బీజేపీ నేతలు చేశారు. మళ్లీ చేస్తమంటున్నారు. షర్మిల కూడా చేసింది. ఇలా అందరూ పాదయాత్రలతో ప్రజల్ని కలుస్తున్నారు. ప్రజల్ని కలవనిది బీఆర్ఎస్ మాత్రమే అందుకే కేసీఆర్ పాదయాత్రల టాస్క్ ఇచ్చారు. ఆరు నెలల సమయం ఇచ్చారు. అందరూ ఆ లోపు ఎన్నికలకు సిద్ధం కావాల్సిందే.