Karnataka MLC Election Results 2026: కర్ణాటక ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఘోర పరాజయం - అసెంబ్లీ ఎన్నికల్లో గడ్డు పరిస్థితి తప్పదా?
BJP JDS Coalition Win Karnataka: కర్ణాటక ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు ఘోర పరాభవం ఎదురయింది. 4 స్థానాల్లోనూ బీజేపీ-జేడీఎస్ కూటమి విజయం సాధించింది. డీకే శివకుమార్ వ్యూహాలు విఫలమయ్యాయి.

Karnataka Assembly Elections 2028 Politics: దక్షిణాదిలో కాంగ్రెస్ పార్టీకి అత్యంత ప్రాధాన్యత కలిగిన పెద్ద రాష్ట్రమైన కర్ణాటకలో ఆ పార్టీకి ఊహించని రీతిలో చేదు అనుభవం ఎదురైంది. రెండు పట్టభద్రులు , రెండు ఉపాధ్యాయ శాసనమండలి స్థానాల ఎన్నికల్లో అధికార కాంగ్రెస్ పార్టీ బోణీ కూడా కొట్టలేక క్లీన్ స్వీప్ పరాభవాన్ని మూటగట్టుకుంది. ఈ నాలుగు స్థానాల్లోనూ భారతీయ జనతా పార్టీ - జనతాదళ్ సెక్యులర్ కూటమి ఘనవిజయం సాధించింది. బీజేపీ మూడు స్థానాలను కైవసం చేసుకోగా, మిత్రపక్షం జేడీఎస్ బెంగళూరు టీచర్స్ స్థానాన్ని దక్కించుకుంది.
కాంగ్రెస్‌కు షాకిచ్చిన ఫలితాలు
ఈ ఎన్నికల ఫలితాలు ముఖ్యమంత్రి డీకే శివకుమార్ తో పాటు కాంగ్రెస్ జాతీయ నాయకత్వానికి పెద్ద షాక్‌గా మారాయి. కాంగ్రెస్ ట్రబుల్ షూటర్‌గా, రాష్ట్రంలో తిరుగులేని వ్యూహకర్తగా పేరుపొందిన డీకే శివకుమార్ ఈ ఎన్నికల్లో విజయం సాధించేందుకు స్వయంగా రంగంలోకి దిగి విస్తృత ప్రచారం చేశారు. ముఖ్యంగా బెంగళూరు టీచర్స్ స్థానాన్ని ఎలాగైనా నిలబెట్టుకోవాలని శ్రమించినప్పటికీ, జేడీఎస్ అభ్యర్థి ఎ.పి. రంగనాథ్ చేతిలో కాంగ్రెస్ అభ్యర్థి పుట్టణ్ణ ఓటమి పాలయ్యారు. గెలుపు కోసం కాంగ్రెస్ అగ్రనాయకత్వం సర్వశక్తులూ ఒడ్డినా ఫలితం రాకపోవడం పార్టీ శ్రేణులను తీవ్ర తీవ్ర నైరాశ్యంలోకి నెట్టివేసింది.
కర్ణాటకలో మారుతున్న ప్రజాభిప్రాయానికి సూచికనా?
ఈ ఓటమి కేవలం ఒక స్థానిక ఎన్నికల పరాజయం మాత్రమే కాదని, కర్ణాటకలో మారుతున్న ప్రజాభిప్రాయానికి ప్రాథమిక సూచిక అని భావిస్తున్నారు. విద్యావంతులు, ఉపాధ్యాయులు, ఉద్యోగులు ఓటర్లుగా ఉండే ఈ నాలుగు నియోజకవర్గాల్లో కాంగ్రెస్‌ను తిరస్కరించడం విశేషం. కాంగ్రెస్ ప్రవేశపెట్టిన గ్యారెంటీ పథకాల ఆధారంగానే ఎన్నికలను ఎదుర్కొంటున్నప్పటికీ, అభివృద్ధి లేకపోవడం, ఆర్థిక భారం పెరగడం, అంతర్గత నాయకత్వ పోరు, అవినీతి ఆరోపణల పట్ల మేధావి వర్గం, మధ్యతరగతి విసిగిపోయారనడానికి ఈ తీర్పు అద్దం పడుతోంది. ఈ ఫలితాలు కర్ణాటకలోని ప్రతిపక్ష బీజేపీ-జేడీఎస్ కూటమికి సరికొత్త రాజకీయ ఊపిరినిచ్చాయి. గతంలో వేర్వేరుగా పోటీ చేసి దెబ్బతిన్న ఈ రెండు పార్టీలు, ఎన్డీఏ కూటమిగా కలిసి పనిచేస్తే క్షేత్రస్థాయిలో విజయావకాశాలు ఎంత బలంగా ఉంటాయో ఈ ఎన్నికల ద్వారా నిరూపితమైంది. కాంగ్రెస్‌పై క్షేత్రస్థాయిలో పెరుగుతున్న వ్యతిరేకతను ఈ కూటమి విజయవంతంగా తమ ఓటు బ్యాంకుగా మలుచుకోగలిగింది.
ఏడాదిన్నరలో కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు
2028 ప్రారంభంలోనే కర్ణాటక శాసనసభ ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఫలితాలు కాంగ్రెస్ పార్టీకి ముందస్తు హెచ్చరికగా భావించవచ్చు. సాధారణంగా పట్టభద్రుల , ఉపాధ్యాయుల ఎన్నికల ట్రెండ్ అనేది పట్టణ ప్రాంతాలు , విద్యావంతుల మానసిక స్థితిని ప్రతిబింబిస్తుంది. కాబట్టి, ప్రభుత్వం తన పాలనా శైలిని, ఆర్థిక విధానాలను పునఃసమీక్షించుకోకపోతే రాబోయే రోజుల్లో సాధారణ ఎన్నికల నాటికి పరిస్థితి మరింత దిగజారే ప్రమాదం ఉంది. ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలతో కాంగ్రెస్ సర్కార్ భద్రతకు తక్షణమే ఎలాంటి ముప్పు లేనప్పటికీ, మానసికంగా, రాజకీయంగా ఆ పార్టీ ఆత్మరక్షణలో పడింది. విపక్ష కూటమి ఊపు మీదుండటంతో పాటు ఓటర్ల మూడ్ మారుతోందనే స్పష్టమైన సంకేతాలు వెలువడటంతో, 2028 అసెంబ్లీ యుద్ధానికి ముందే కర్ణాటక రాజకీయం మరింత ఉత్కంఠభరితంగా మారింది.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు






















