Kanna BJP Future : సైలెంట్‌గా సీనియర్ నేత కన్నా - తర్వాతేం చేయబోతున్నారు ?
ఉమ్మడి ఏపీలో కీలక నేతగా వ్యవహరించిన కన్నా లక్ష్మినారాయణ సైలెంట్‌గా ఉన్నారు. ఆయన రాజకీయ అడుగులపై స్పష్టత రావడం లేదు.
Kanna BJP Future : ఏపీ బీజేపీ సీనియర్ కన్నా లక్ష్మినారాయణ రాజకీయాల్లో సైలెంట్‌గా ఉండటంపై బీజేపీలోనే కాదు ఇతర పార్టీల్లోనూ చర్చనీయాంశమవుతోంది. ఏపీ బీజేపీ అధ్యక్ష పదవి సోము వీర్రాజుకు ఇచ్చే వరకూ ఆయన దూకుడుగానే ఉన్నారు. ఆ తర్వాత సైలెంటయ్యారు. ఉమ్మడి రాష్ట్రంలో కీలక నేతగా ఉన్న ఆయన రాష్ట్ర విభజన తరువాత కాంగ్రెస్ కు రాజీనామా చేసిన ఆయన బీజేపి తీర్దం పుచ్చుకున్నారు. గత ఎన్నికలకు ముందు వైఎస్ఆర్‌సీపీలో చేరడానికి అన్ని ఏర్పాట్లు చేసుకున్నారు. పాదయాత్రలో ఉన్న జగన్ వద్దకు వెళ్లి కండువా కప్పుకోవాలనుకున్నారు. కానీ చివరి క్షణంలో మనసు మార్చుకుని అనారోగ్యం పేరుతో ఆగిపోయారు. తర్వాత రెండు, మూడు రోజులకే ఆయనకు ఏపీ బీజేపీ అధ్యక్ష పదవిని ప్రకటించారు.
వైఎస్‌ఆర్‌సీపీపై దూకుడుగా వెళ్తున్న సమయంలో మార్చేసిన బీజేపీ హైకమాండ్
ఆయన సారధ్యంలోనే బీజేపీ ఎన్నికలకు వెళ్లింది. ఎవరితోనూ పొత్తులు లేకపోవడం... ప్రభుత్వ వ్యతిరేక ఓట్లన్నీ వైఎస్ఆర్‌సీపీ వైపు పోలవడంతో బీజేపీ ఘోరపరాజయాన్ని చవిచూడాల్సి వచ్చింది. పార్లమెంట్‌కు పోటీ చేసిన కన్నా లక్ష్మినారాయణ కనీస పోటీ ఇవ్వలేకపోయారు. వైఎస్ఆర్‌సీపీ ప్రభుత్వంపై మొదట్లో దూకుడుగా వ్యవహరించారు. కరోనా సమయంలో పలురకాల అవినీతి ఆరోపణలు చేశారు. ఈ కారణంగా వైఎస్ఆర్‌సీపీ నేత విజయసాయిరెడ్డి ఆయనపై తీవ్రమైన ఆరోపణలు చేశారు. ఆ సమయంలో బీజేపీ హైకమాండ్ ఆయనను మర్చి సోము వీర్రాజుకు ఏపీ బీజేపీ అధ్యక్ష పదవి ఇచ్చింది. దీంతో కన్నా లక్ష్మినారాయణ సైలెంట్ అయ్యారు.
వచ్చే ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలవడంపై దృష్టి
ప్రస్తుతం బీజేపీ కార్యవర్గ సభ్యుడిగా కన్నా ఉన్నారు. అయితే గతంలోలా యాక్టివ్‌గా ఉండటం లేదు. పార్టి నిర్వహించే సమావేశాలకు మాత్రం కన్నా హజరవుతున్నా,అక్కడ కూడ ఆయన అంత ఉత్సాహంగా కనిపించటం లేదనే ప్రచారం ఉంది. ముందు ఎమ్మెల్యే లేదా ఎంపీగా గెలవడంపై ఆయన దృష్టి పెట్టారు. ఇప్పటికైతే ఆయన గుంటూరు పశ్చిమ నియోజకవర్గంపై దృష్టి పెట్టినట్లుగా చెబుతున్నారు. గతంలో ఆయన అక్కడ్నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. మంత్రి పదవి నిర్వహించారు. బీజేపీ తరపున పోటీ చేస్తే ఇతర పార్టీల మద్దతు లేకుండా గెలవడం కష్టమని భావిస్తున్నారు.
పొత్తులు ఉంటే బెటర్ - లేకపోతే కొత్త వ్యూహం
వచ్చే ఎన్నికల్లో బీజేపీ ఒంటరిగా పోటీ చేయదని ఖచ్చితంగా కూటమి ఉంటుందని భావిస్తున్నారు. వైఎస్ఆర్‌సీపీ బీజేపీ పెద్దలతో సన్నిహిత సంబంధాలు కొనసాగిస్తూండటంతో ఆ పార్జీతో పొత్తు పెట్టుకున్నా పశ్చిమ నుంచే పోటీ చేయాలనే ఆలోచన చేస్తున్నారు. ఈ అంశంపై లోతుగా కన్నా ఆలోచన చేస్తున్నారు. ఎలాగైనా సరే ఆయన గుంటూరు పశ్చిమ నుంచి పోటీ చేయాలని అనుకుంటున్నారు. అందు కోసం అవసరమైన రాజకీయ వ్యూహం కోసం ఎదురు చూస్తున్నారని ఆయన అనుచరులు చెబుతున్నారు.