Telangana BJP : "రజాకార్ ఫైల్స్" పై బీజేపీ ఆశలు - తెలంగాణ ఎన్నికల్లో ఇదే ఎజెండానా ?
బీజేపీ పక్కాగా ప్లాన్ చేసుకుంటోందా ?ఎన్నికలకు ముందు రజాకార్ ఫైల్స్ వస్తుందా ?హైదరాబాద్ స్టోరీ పేరుతో మరో సినిమా తీస్తారా ?
Telangana BJP : కశ్మీర్ ఫైల్స్ , కేరళ స్టోరీ వంటి సినిమా భారతీయ జనతా పార్టీ ఎజెండాలో భాగంగా మారాయి. ఆ సినిమాల వెనుక బీజేపీ నేతలు ఉన్నారో లేదో ఎవరికీ తెలియదు కానీ వాటికి బీజేపీ చేస్తున్న ప్రమోషన్ అంతా ఇంతా కాదు. స్వయంగా ప్రధాని మోదీ వాటి గురించి ఎన్నికల సభల్లో ప్రస్తావిస్తున్నారు. వాటిని బీజేపీ ఓన్ చేసుకుంటే.. బీజేపీయేతర ప్రభుత్వాలు ఉన్న చోట నిషేధిస్తున్నారు. బీజేపీ రాజకీయాల్లో సినిమాలకు ప్రత్యేక స్థానం ఉందని చెప్పాల్సిన పని లేదు. ప్రజల అభిప్రాయాలను మార్చగల శక్తివంతమైన సాధనం సినిమా అని ఆపార్టీ అగ్రనేతలు నమ్ముతారు. ఫ్లాష్ బ్యాక్ కశ్మీర్ స్టైల్లో ఉన్నప్పుడు అసలు వదిలి పెట్టరు. అందుకే తెలంగాణ ఎన్నికల్లో బీజేపీ కూడా అలాంటి సినిమా ఒకటి ప్లాన్ చేస్తుందన్న అభిప్రాయం బలంగానే వినిపిస్తోంది.
శరవేగంగా నిర్మాణం అవుతున్న రజాకార్ ఫైల్స్
రజాకార్ ఫైల్స్ తీస్తామని పలుమార్లు ప్రకటించారు బండి సంజయ్. నగర శివార్లలోని ఒక స్టూడియోలో చిత్రీకరణ జరుపుకుంటున్న చిత్రం రజాకార్, గత కాలంలో రజాకార్ల మిలీషియా చేతుల్లో హైదరాబాద్ రాష్ట్రంలోని సామాన్య ప్రజలపై, ముఖ్యంగా హిందువులపై జరిగిన అణచివేత, అవమానాలు, దౌర్జన్యాలు ఈ చిత్ర కథాంశం. ఏపీ బీజేపీ నేత గూడూరు నారాయణ రెడ్డి ఈ సినిమా నిర్మాత. వచ్చే ఎన్నికల్లో దీనిని ఉపయోగించుకోవాలని బీజేపీ చూస్తోందనే ప్రచారం కూడా ఉంది. హైదరాబాద్ రాష్ట్రంలోని సామాన్య ప్రజలపై జరిగిన అణచివేత, అవమానాలు, దౌర్జన్యాలు ఈ సినిమాలో చూపించే అవకాశం ఉంది. బీజేపీ నేత గూడూరు నారాయణ రెడ్డి నిర్మిస్తున్న ఈ సినిమాతో చరిత్రను చూపిస్తున్నామని చెబుతున్నారు. రాబయే ఎన్నికల్లో బీజేపీకి ఇది ఉపయోగపడుతుందని భావిస్తున్నారు.
సైలెంట్‌గా రెడీ చేసి చర్చల్లో ఉండేలా రిలీజ్ చేసే చాన్స్
రజాకార్లు, ఆపరేషన్ పోలో, నిజాం పాలన చివరి రోజుల్లో జరిగిన దురాగతాలు, హైదరాబాద్ రాష్ట్రాన్ని భారతదేశంలోకి తీసుకురావడంలో సర్దార్ వల్లభాయ్ పటేల్ వీరోచిత పాత్ర గురించి ఇందులో చూపించే అవకాశం ఉంది. సమరవీర్ క్రియేషన్స్ పతాకంపై నారాయణరెడ్డి ఈ చిత్రాన్ని అత్యంత భారీ నిర్మాణ విలువలతో నిర్మిస్తున్నారు. అయితే 2023 ఎన్నికల్లో ఈ చిత్రం ఎలాంటి ప్రభావం చూపిస్తుందో చూడాలి. బీజేపీ నేతలు మాత్రం.. జరిగిన చరిత్రను చూపిస్తున్నారని అంటున్నారు. . దక్షిణాదిలో రాజకీయ నాయకులపై సినిమాలు రావడం కొత్త కాదు. కానీ ఇలా ఓ అంశంపై సినిమా రావడం మాత్రం కొత్తే. రజాకార్లు అనేది తెలంగాణలోని చాలామంది భావోద్వేగాలకు ముడిపడిన అంశం. దీనిని ఎలాగైనా ఉపయోగించుకోవాలని బీజేపీ అనుకుంటోంది. సినిమా కోసం దర్శకుడు యాట సత్యనారాయణ 1946 నాటి గ్రామాన్ని పునఃసృష్టించారు. చకచకా షూటింగ్ చేస్తున్నారు.
హైదరాబాద్ ఫైల్స్ పేరుతో మరో సినిమా కూడా ?
హైదరాబాద్ పాతబస్తలో ముస్లిం బాలిక వ్యథలతో గతంలో చాలా సినిమాలు వచ్చాయి. అయితే రాజకీయాల కోణంలో మాత్రం ఇప్పటి వరకూ ఎలాంటి సినిమాలు రాలేదు. మైనర్ ముస్లిం అమ్మాయిలను.. సౌదీ షేక్ వచ్చి పెళ్లి చేసుకుని తీసుకు వెళ్తున్నారని, పాతబస్తీ మహిళలకు రక్షణ ఇవ్వకుండా మజ్లిస్ ఏం చేస్తోంది? అని బండి ప్రశ్నించారు. ఇలాంటి వాటితో మరో సినిమా తీయించాలనే ఆలోచనలో బీజేపీ ముఖ్య నేతలు ఉన్నట్లుగా ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే బీజేపీ పెద్దలు.. సినీ రంగానికి చెందిన ముఖ్యులతో సన్నిహిత సంబంధాలు కలిగి ఉన్నారు. సినిమా నిర్మాణానికి ఎలాంటి ఆటంకాలు రావు.
వివాదాలను చర్చల్లో పెడితే విజయమే !
కశ్మీర్ ఫై్స్ కేరళ స్టోరీ వంటి సినిమా తెలంగాణలో సెట్ చేస్తే.. రాజకీయాల్లో అన్నీ పక్కకుపోతాయి. అదే అజెండా అవుతుంది. అప్పుడు ప్రజల ఓటింగ్ ప్రయారిటీ మారిపోతుంది. బీజేపీ కోరుకునేది కూడా అదే. బాక్సాఫీసులు బద్దలవకపోయినా.. బ్యాలెట్ బాక్సులు మాత్రం రికార్డులు సృష్టిస్తాయి.