I.N.D.I.Alleance : ఇండియా కూటమి విచ్చిన్నమేనా? కాంగ్రెస్ స్వయంకృతం ?
కేంద్రంలోని మోడీ సర్కారును గద్దెదించే లక్ష్యంతో ఏర్పడిన `ఇండియా` కూటమి మూడునాళ్ల ముచ్చటగానే మిగిలిపోనుందా? కీలక పార్టీలన్నీ.. వేటి దారి అవి చూసుకున్ననేపథ్యంలో సర్వత్రా ఈమాటే వినిపిస్తోంది.
I.N.D.I.Alleance: ``కేంద్రంలో నియంతృత్వ పాలన సాగుతోంది. దీనికి ముగింపు పలకాలంటే.. అందరూ చేతులు కలపాలి. మన మధ్య కొన్ని కొన్ని విభేదాలు ఉండొచ్చు. కానీ, బలమైన మోడీని ఢీ కొట్టేప్పుడు.. మన వ్యక్తిగత వ్యవహా రాలను పక్కన పెట్టి పోరాటం చేయాల్సి ఉంది. నేను మనసా, వాచా, కర్మణా.. చెబుతున్న మాట. ముందు గా నేనే ఉంటా. అందరూ కలిసి మోడీ సర్కారును దింపే వరకు కలిసి నడుద్దాం``- ఇదీ.. 2023, జూలై 18న బిహార్(Bihar) ముఖ్యమంత్రి నితీష్ కుమార్(C.M. Nithish kumar) చెప్పిన అమృత వాక్కులు!!
ఆరు నెలలు గడిచేసరికి..
``మోడీ( Modi)ని వ్యతిరేకించాలని ముందుగా నేనే ముందుకు వచ్చారు. ఈ విషయంలో సందేహం లేదు. ఈ క్రమంలోనే ఇండియా(I.N.D.I.A) బ్లాక్‌ను ఏర్పాటు చేశాం. కానీ, నా మాటకు విలువ లేకుండా పోయింది. కూటమికి `ఇండియా` పేరు వద్దని చెప్పా. నా మాట వినలేదు. సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి సీట్ల కేటాయిం పుపై ముందుగానే తేల్చేయాలని సూచించా. అది కూడా వినిపించుకోలేదు. రెండు రాష్ట్రాల్లో అధికారంలోకి వచ్చేసరికి.. కాంగ్రెస్ పార్టీకి మేం కనిపించలేదు. అందుకే బయటకు వచ్చా`` - అదే నితీష్ కుమార్.. కేంద్రంలోని మోడీతో జట్టుకట్టి బిహార్‌లో మరోసారి ముఖ్యమంత్రిగా పగ్గాలు చేపట్టిన తర్వాత రోజు అంటే.. జనవరి 29, 2024న చేసిన ప్రకటన ఇది!!
కట్ చేస్తే..
కేంద్రంలోని నరేంద్ర మోడీ సర్కారును గద్దెదింపాలనే లక్ష్యంతో ఏర్పడిన ఇండియా కూటమిలో దాదాపు 28 పార్టీలున్నాయి. వీటికి కాంగ్రెస్ పార్టీ నేతృత్వం వహిస్తోంది. అయితే.. సీట్ల పంపకాల మాట ఎలా ఉన్నా.. ఇండియా బ్లాక్.. కన్వీనర్ ఎంపిక విషయంలో తలెత్తిన వివాదం.. చినుకు చినుకు గాలి వానగా మారినట్టు.. కీలక పార్టీలైన.. ఆమ్ ఆద్మీ, తృణమూల్ కాంగ్రెస్, జనతాదళ్ యునైటెడ్‌లు దాదాపు బయటకు వచ్చేశాయి. ప్రస్తుతం ఎవరికి వారుగా ఉండగా.. బిహార్ సీఎం నితీష్ నేతృత్వంలో జేడీయూ ఏకంగా బీజేపీతోపొత్తు పెట్టుకుని ప్రభుత్వం ఏర్పాటు చేసింది. మరోవైపు పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ.. కూడా కాంగ్రెస్‌తో కలిసి పోటీ చేసేది లేదని పేర్కొనడమే కాదు.. సవాళ్ల పర్వంలో తనవంతు పాత్రను విశేషంగా పోషిస్తున్నారు. ఇక, ఆమ్ ఆద్మీ పార్టీ(ఢిల్లీ, పంజాబ్‌లలో అధికారంలో ఉంది) కూడా.. కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా మారిపోయింది. దీంతో దాదాపు ఇండియా కూటమి.. విచ్ఛిన్నమయ్యిందనే అంటున్నారు పరిశీలకులు.
సీట్ల విషయమే కాదు..
పార్లమెంటు(Parliament) ఎన్నికల్లో ప్రాంతీయ పార్టీల బలాన్ని ఎవరూ తోసిపుచ్చలేరు. అందుకే.. ఇండియా(I.N.D.I.A) కూటమిలోని పార్టీలు కూడా.. తమ తమ బలాన్ని తక్కువ చేసుకునేందుకు ప్రయత్నించవు. ముఖ్యంగా కాంగ్రెస్ దక్షిణాదిలో కొంత వరకు బాగానే ఉన్నప్పటికీ.. ఉత్తరాది రాష్ట్రాల్లో ముఖ్యంగా యూపీ, ఢిల్లీ వంటి చోట్ల చాలా బలహీనంగా ఉంది. మహారాష్ట్రలోనూ గత ఎన్నికల్లో ఒకే ఒక్క సీటు దక్కించుకుంది. ఇక, పశ్చిమ బెంగాల్‌లోనూ పరిస్థితి ఇంది. ఇప్పుడు కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకుంటే.. తమ సీట్లను ఆ పార్టీకి కేటాయించాల్సి ఉంటుంది. తద్వారా.. తమ ఉనికి ప్రశ్నార్థకం అవుతుందని ఆయ పార్టీలు అంచనా వేస్తున్నాయి. అంతేకాదు.. మోడీ దూకుడుకు.. చెక్ పెట్టాలంటే.. తామే మరింత వ్యక్తిగతంగా బలం పుంజుకోవాలనే వ్యూహంతోనూ డిల్లీ, పశ్చిమ బెంగాల్ ప్రభుత్వాలు ఉన్నాయి. అందుకే.. ఇండియా కూటమిలో ఉన్నా.. లేకున్నా.. టికెట్ల విషయంలో సొంత నిర్ణయాలు తీసుకుంటున్నాయి. ఇదే బ్లాక్ విచ్ఛిన్నానికి దారితీస్తోంది.
వివాదాలకు దారితీసిన అంశాలు ఇవీ..
+ ఇండియా బ్లాక్ కన్వీనర్ పదవిని ఆశించిన బిహార్ సీఎం నితీష్, పశ్చిమబెంగాల్ సీఎం మమత, ఢిల్లీ సీఎం కేజ్రీవాలన్‌ను కాంగ్రెస్ పట్టించుకోకుండా.. ఏకపక్ష నిర్ణయం తీసుకుని ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గేకు పట్టం కట్టడం.
+ సార్వత్రిక ఎన్నికల సమరంలో సీట్ల పంపకాలు తామే చేపడతామని కాంగ్రెస్ ముందుకు రావడం.
+ మా రాష్ట్రాల్లో మీరు పెత్తనం చేస్తారా? అంటూ.. మమత తిరుగుబాటు చేయడం. పైగా.. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ చేపట్టిన భారత్ జోడో యాత్రకు సంబంధించిన సమాచారం ఆమెకు చెప్పకపోవడం.
+ ప్రధాన మంత్రి పీఠాన్ని ఎవరికి ఇస్తారన్న విషయంపై కాంగ్రెస్ తనవైపే తన వేలు చూపించుకోవడం.
+ 6 సార్లు ఇండియా బ్లాక్ సమావేశాలు జరిగినా.. కాంగ్రెస్ ఇతర పార్టీల డిమాండ్లపై సరిగా స్పందించలేదన్న విమర్శలు ఉన్నాయి.
+ ఐక్యత లోపం.. ఇండియ కూటమిని అడ్డు పెట్టి ఉత్తరాదిలో తమ బలం పుంజుకునేలా కాంగ్రెస్ వ్యవహరించిందనే ఆరోపణలు.
ఇప్పుడు ఏం జరుగుతోంది?
+ కాంగ్రెస్ తాము చెప్పినట్టు వినాలని బ్లాక్ పార్టీలు చెబుతున్నాయి.
+ బెంగాల్, ఢిల్లీ, పంజాబ్, యూపీల్లో తాము ఇచ్చిన సీట్లే తీసుకోవాలని ఆయా రాష్ట్రాల్లోని బ్లాక్ కూటమి నేతలు తేల్చి చెబుతున్నారు.
+ బెంగాల్ సీఎం మమత అసలు టికెట్లు ఇచ్చేది లేదని.. ఏం చేసుకుంటారో చేసుకోండని వ్యాఖ్యానించారు.
+ యూపీలో ఎస్పీ నేత అఖిలేష్ యాదవ్ .. తాము చెప్పినట్టు వినాలని షరతులు పెట్టడం.
+ పంజాబ్‌లో తాము ఒంటరిగానే పోటీకి దిగుతామని ఆప్ చెప్పడంతోపాటు.. అసొంలోని మూడు స్థానాల్లో తమ అభ్యర్థులను ప్రకటించేసుకోవడం. దిబ్రూగఢ్ గౌహతి, తేజ్‌పూర్ నుంచి తమ పార్టీ అభ్యర్థులను బరిలోకి దింపుతున్నట్టు ప్రకటించింది.
+ ఇలా లోక్‌సభ ఎన్నికలు సమీపిస్తున్న వేళ విపక్ష ఇండియా కూటమి ఉనికి ప్రశ్నార్థకంగా మారుతోంది. కూటమిలో పార్టీల మధ్య సీట్ల సర్దుబాటు విషయంలో జాప్యం జరుగుతుండటం, ఐక్యత లోపాలు వంటివి ఇండియా బ్లాక్‌ను తీవ్రస్థాయిలో ప్రభావితం చేస్తున్నాయనడంలో సందేహం లేదు. మరి ఎన్నికల నాటికి ఈ కూటమి ఉంటుందా? విచ్ఛిన్నమవుతుందా? చూడాలి.