Andhra Politics : టీడీపీ, జనసేనతోనే బీజేపీ - ఆ కేంద్రమంత్రి తేల్చేసి వెళ్లారా ?
ఏపీలో రాజకీయ పార్టీలు రహస్య పొత్తుల ప్రక్రియ పూర్తి చేశాయా ?కేంద్ర మంత్రి నారాయణస్వామి చెప్పింది అదేనా ?టీడీపీ, బీజేపీ, జనసేన కూటమి ఖరారైందా ?సీట్లపైనా వారు అంతర్గతంగా అవగాహనకు వస్తున్నారా ?
![Andhra Politics : టీడీపీ, జనసేనతోనే బీజేపీ - ఆ కేంద్రమంత్రి తేల్చేసి వెళ్లారా ? Have the political parties completed the process of secret alliances in AP? Andhra Politics : టీడీపీ, జనసేనతోనే బీజేపీ - ఆ కేంద్రమంత్రి తేల్చేసి వెళ్లారా ?](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/07/11/6e301b013df9fbc4ecb59a6803734fdb1689088586613228_original.png?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Andhra Politics : ఆంధ్రప్రదేశ్ లో పొత్తుల రాజకీయాలు ఓ క్లారిటీకి రావడం లేదు. టీడీపీ ఎవరితో కలుస్తుంది.. జనసేన టీడీపీతో కలుస్తుందా లేదా ..ఇంతకీ బీజేపీ వైఖరీ ఏంటి ? అంటూ చర్చోపచర్చలు జరుగుతున్నాయి. ఓ వైపు అధికారపక్షం విపక్ష కూటమి ఏర్పడకూడదని ప్రయత్నాలు చేస్తోంది. మరో వైపు ఇతర పార్టీలు పొత్తుల చర్చలు జరుపుతున్నాయో లేదో స్పష్టత లేదు. ఇలాంటి సమయంలో.. కేంద్ర మంత్రి నారాయణస్వామి అనంతపురం జిల్లాకు వచ్చారు. ఏపీలో పొత్తులు ఉంటాయని.. బీజేపీ, జనసేన, టీడీపీ కలిసి పోటీ చేస్తాయని ప్రకటించారు. అయితే నారాయణ స్వామి మాటలకు అంత ప్రాధాన్యం లభించలేదు. కానీ.. అదే పొత్తు ఉంటుందన్న సంకేతాలను మెల్లగా ప్రజల్లోకి పంపారన్న అభిప్రాయం మాత్రం బలపడుతోంది.
పొత్తులు ఫిక్సయ్యాయా.. సరైన సమయం కోసం చూస్తున్నారా ?
రాజకీయ పార్టీలన్నీ ఓ వ్యూహం ప్రకారం ఉంటాయి. పొత్తుల గురించి చర్చలు జరిపినా జరపకపోయినా ఎవరూ చెప్పుకోరు. సమయం .. సందర్భం.. తమ పొత్తుల వల్ల విజయం ఖాయం అన్న వాతావరణం ఏర్పాటు చేసేదాకా వ్యూహాత్మకం సాగదీసి అప్పుడు ప్రకటన చేస్తారు. ప్రస్తుతం ఏపీలో అలాంటి పరిస్థితే ఉందన్న అభిప్రాయం వినిపిస్తోంది. జనసేన అధినేత పవన్ కల్యాణ్ తాము టీడీపీతో కలిసి వెళ్తామని ప్రకటించారు. బీజేపీని కూడా కలుపుకుని వెళ్తామని చెప్పారు. ఆ తర్వాత ఎలాంటి చర్చలు జరగలేదు. కానీ.. బహిరంగంగానే. అంతర్గతంగా ఆ మూడు పార్టీలు చర్చల్లో ఉన్నాయన్న అభిప్రాయం కూడా వినిపిస్తోంది. అందుకే బీజేపీకి చెందిన కీలక నేతలు తరచూ వచ్చి.. టీడీపీతో పొత్తుల గురించి మాట్లాడుతున్నారని అంటున్నారు.
టీడీపీ-జనసేన మధ్య సీట్ల పంపకంపై కూడా అవగాహన వచ్చిందన్న ప్రచారం
నిజానికి టీడీపీ, జనసేన పార్టీలు పొత్తుల విషయంలో చాలా క్లారిటీగా ఉన్నాయని అంతర్గతంగా పూర్తి స్థాయిలో చర్చలు కూడా పూర్తి చేసుకున్నారు. ఎవరెవరు ఎక్కడెక్కడ పోటీ చేయాలన్నది కూడా ఖరారు చేసుకున్నారన్న చర్చ నడుస్తోంది. ఇప్పటికే టీడీపీ అధినేత చంద్రబాబు అభ్యర్థులను ఖరారు చేస్తున్నారు. ఆయన పెద్దగా దృష్టి పెట్టని కొన్ని నియోజకవర్గాలే.. జనసేన ఖాతాలో పడతాయని.. కొన్ని సీట్ల గురించి సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది. అయితే ఈ అంశంపై రెండు పార్టీలు గుంభనంగానే ఉన్నాయి. ఇంకా చెప్పాలంటే..అధికారికంగా పొత్తుల ప్రకటన కూడా చేయలేదు. అందుకే.. రెండు పార్టీల వ్యూహంపై ఆసక్తి ఏర్పడింది.
ఎన్నిలకు ఇంకా ఎనిమిది నెలల సమయం - తొందరేముందని అనుకుంటున్నారా ?
ఏపీలో కూడా ఐదు రాష్ట్రాలతో పాటు ఎన్నికలు జరుగుతాయన్న అభిప్రాయం వినిపిస్తోంది. దానిపై ఈ నెలలోనే క్లారిటీ వస్తుంది. ఈ నెలలో అసెంబ్లీ రద్దు కోసం నిర్ణయం తీసుకోకపోతే.. ఐదు రాష్ట్రాలతో పాటు ఎన్నికలు జరగవు. అంటే.. ముందస్తు లేనట్లే. అప్పుడు వచ్చే మార్చిలో ఎన్నికలు జరుగుతాయి. అంటే ఎనిమిది నెలల గడువు ఉంటుంది. ఇప్పుడే పొత్తులు ప్రకటించుకోవడం రాజకీయంగా మంచి వ్యూహం కాదని.. అందుకే.. ఏదైనా ఎన్నికల తర్వాతనే అధికారిక ప్రకటన చేయాలన్నట్లుగా అన్ని పార్టీలు ఉన్నట్లుగా చెబుతున్నారు. కానీ తమ పార్టీల కూటమి ఉంటుందన్న సంకేతాలను మాత్రం ప్రత్యక్షంగానో.. పరోక్షంగానే పంపుతున్నారన్న అభిప్రాయం వినిపిస్తోంది.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)