AP MLC Elections: బలం లేకపోయినా ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ పోటీకి దిగడం అప్రజాస్వామికం: మాజీ మంత్రి బొత్స
Former minister Botsa : ఉమ్మడి విశాఖ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో టిడిపి అభ్యర్థిని బరిలోకి దించడం అప్రజాస్వామిక చర్యగా మాజీ మంత్రి, వైసీపీ ఎమ్మెల్సీ అభ్యర్థి బొత్స పేర్కొన్నారు.
Visakha Localbody Mlc Elections : ఉమ్మడి విశాఖ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ పోటీకి దిగడం పట్ల మాజీ మంత్రి, వైసీపీ ఎమ్మెల్సీ అభ్యర్థి బొత్స సత్యనారాయణ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగంగా మంగళవారం అనకాపల్లి జిల్లాలోని పెదబొడ్డేపల్లి పార్టీ క్యాంప్ కార్యాలయంలో మాజీ ఎమ్మెల్యే పెట్ల ఉమాశంకర్ గణేశ్ అధ్యక్షతన నియోజవకవర్గంలోని జడ్పీటీసీలు, ఎంపీటీసీలు, కౌన్సిలర్లతో సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా బొత్స మాట్లాడుతూ టీడీపీపై విమర్శలు గుప్పించారు. స్థానిక సంస్థల్లో వైసీపీ కంటే 400 ఓట్లు తేడా ఉన్న టీడీపీ పోటీకి దిగడం దేనికి సంకేతమన్నారు. ఆర్థిక, అంగ బలాన్ని వినియోగించి అప్రజాస్వామికంగా గెలిచేందుకు చంద్రబాబు నాయుడు ప్రయత్నిస్తున్నారని ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ఇది మంచి సాంప్రదాయం కాదన్నారు.
ఈ నెల 30న జరిగే ఎన్నికల్లో ఓటర్లంతా ప్రలోభాలకు లొంగకుండా ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాలని బొత్స పిలుపునిచ్చారు. డబ్బుతో ఓట్లు కొనాలని చంద్రబాబు చూస్తున్నారని ఆరోపించారు. ఓట్లు కొనడం ప్రజాస్వామ్యంలో మంచి పద్ధతి కాదన్నారు. గతంలో టీడీపీ కంటే 50 ఓట్లు తక్కువగా ఉంటే పోటీ నుంచి తప్పుకున్న విషయాన్ని ఈ సందర్భంగా బొత్స గుర్తు చేశారు. సంపద సృష్టిస్తానని చెప్పి అధికారంలోకి వచ్చిన చంద్రబాబు.. ఎన్నికల తరువాత రాష్ట్ర ఖజానా ఖాళీగా ఉందంటూ చెప్పడం హాస్యాస్పదంగా ఉందన్నారు. రాష్ట్ర ఆర్థిక స్థితి ఎలా ఉందో ఎన్నికలకు ముందు తెలియకుండానే హామీలు ఇచ్చారా..? అని ప్రశ్నించిన బొత్స.. అప్పట్లో లక్షల కోట్లు అప్పులు ఉన్నాయంటూ ఎలా విమర్శలు చేయడంపై నిలదీశారు.
కూటమి ప్రభుత్వ తీరుతో ప్రశ్నించాల్సిన అవసరం
రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఆరు నెలలు వరకు ప్రభుత్వాన్ని ఏమీ అనకూడదని భావించామని, కానీ, కూటమి ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుతో ప్రశ్నించాల్సి వస్తోందన్నారు. ప్రలోభాలకు లొంగకుమా తన విజయానికి కృషి చేయాలని ఈ సందర్భంగా ఆయన కోరారు. కూటమి చేస్తున్న అరాచకాలను మండలిలో ఎండగట్టే అవకాశం ఉంటుందని బొత్స పేర్కొన్నారు. సీఎం చంద్రబాబు నాయుడు, కూటమి నేతలు గతంలో రాష్ట్రం అప్పులపై తీవ్రస్తాయిలో తప్పుడు ప్రచారాలు చేశారన్నారు. కానీ, కూటమి ప్రభుత్వం రూ.7500 కోట్లు ఆదాయంతో కొలువుదీరిందని స్పష్టం చేశారు. ఏ రాష్ట్రమైనా పరిమితికి లోబడే అప్పులు చేస్తుందన్నారు. 60 రోజుల్లోనే కూటమి ప్రభుత్వాన్ని నిలదీసే రోజులు వచ్చాయని విమర్శించారు.
జగన్మోహన్‌రెడ్డికి, చంద్రబాబుకు చాలా తేడా ఉందని, మాటిస్తే చేయాలన్నది జగన్ తత్వమని, ఇచ్చిన మాట తప్పడం చంద్రబాబు నైజమన్నారు. ఈ సందర్భంగా మాట్లాడిన మాజీ మంత్రులు కారుమూరి నాగేశ్వరరావు, బూడి ముత్యాలనాయుడు కూటమి ప్రభుత్వంపై ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. కనీస సంఖ్యా బలం లేకుండా కూటమి అభ్యర్థిని ఎలా బరిలోకి దించుతారని ప్రశ్నించారు. ఉత్తరాంధ్ర సీనియర్ నేత బొత్సను అఖండ మెజారిటీతో గెలిపించుకోవాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే ధర్మశ్రీ, మాజీ ఎమ్మెల్సీ డీవీ సూర్యనారాయణరావు, సీనియర్ నాయకులు ఎర్రాపాత్రుడు, సీహెచ్ సన్యాసిపాత్రుడు, ఎంపీపీలు, జెడ్పీటీసీలు, ఎంపీటీసీ, కౌన్సిలర్లు పాల్గొన్నారు,