(Source: ECI/ABP News/ABP Majha)
Uravakonda YSRCP : పయ్యావుల పేరు చెప్పి కొట్టుకుంటున్న మాజీ ఎమ్మెల్యే కుటుంబీకులు - ఉరవకొండ వైఎస్ఆర్‌సీపీలో రచ్చ !
ఉరవకొండ వైఎస్ఆర్‌సీపీలో మాజీ ఎమ్మెల్యే విశ్వేశ్వర్ రెడ్డి కుటుంబీకులు ఘర్షణ పడుతున్నారు. ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటున్నారు.
Uravakonda YSRCP : అనంతపురం జిల్లా ఉరవకొండ నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే విశ్వేశ్వర్ రెడ్డి పరిస్థితి గోరుచుట్టుపై రోకటి పోటులా తయారైంది. అసలే పార్టీలో రెండు గ్రూపులుగా విడిపోయి భవిష్యత్తు అగమ్యగోచరంగా ఉంటే ఇప్పుడు కుటుంబంలోనూ గొడవలు బహిరంగంగా ఘర్షణకు దిగే స్థాయికి వచ్చాయి. అయితే వీరి మధ్య గొడవకు అందరూ టీడీపీ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్‌ను కారణంగా చూపిస్తూండటమే ట్విస్ట్.
వైఎస్ఆర్‌సీపీ ఆఫీసులో కొట్టుకున్న అన్నదమ్ములు !
మాజీ ఎమ్మెల్యే విశ్వేశ్వర్ రెడ్డి కుమారుడు ప్రణయ్ రెడ్డి, ఆయన సోదరుడు దివంగత రాజేంద్రనాథ్ రెడ్డి కుమారుడు నిఖిల్ రెడ్డి లు పార్టీ కార్యాలయంలోనే భాహాబాహీకి దిగడం ఉరవకొండలో కలకలం రేపింది. గత ఎన్నికల్లో ఓడిపోయిన విశ్వేశ్వర్ రెడ్డి ఇంచార్జిగా పార్టీ కార్యకలాపాలను కొనసాగిస్తున్నారు. అయితే ఆయనకు వర్గపోరు ఇబ్బందికరంగా మారింది. ఎమ్మెల్సీ శివరాం రెడ్డి వర్గం తనకు ఎన్నికలలో సహకరించడంలేదని తీవ్ర ఆవేదన చెందుతుంటారు. అసలే పార్టీలో రెండు వర్గాలు ఉండగా ఇప్పుడు కుటుంబంలో ఉన్న ప్రచ్ఛన్నయుద్ధం కాస్తా బహిర్గతం కావడం తో విశ్వేశ్వర్ రెడ్డి కి మరింత తలనొప్పిగా మారింది.
పయ్యావుల పేరుతో ఒకరిపై ఒకరు విమర్శలు !
గత ఎన్నికలలో విశ్వేశ్వర్ రెడ్డి సోదరుని కుమారుడు నిఖిల్ రెడ్డికి పయ్యావుల కేశవ్ రెండు కోట్ల రూపాయల డబ్బు ఇచ్చి ఎలక్షన్లలో లబ్ధి పొందాడని విశ్వేశ్వర్ రెడ్డి వర్గం బహిరంగ విమర్శలు చేస్తోంది. అందుకు తమ వద్ద ఆధారాలు ఉన్నాయని విశ్వేశ్వర్ రెడ్డి కుమారుడు ప్రణయ్ రెడ్డి తన సన్నిహితుల వద్ద చెబుతున్నారు. ఈ విమర్శలు కాస్తా నిఖిల్ రెడ్డి చెవిన పడడంతో ఉరవకొండ లోని పార్టీ కార్యాలయంలో కార్యకర్తల సమావేశాన్ని నిర్వహిస్తున్న ప్రణయ్ రెడ్డిపై దాడికి దిగారు నిఖిల్ రెడ్డి. దీంతో రెండు వర్గాలు ఘర్షణకు దిగాయి. పయ్యావుల కేశవ్ నుంచి డబ్బు తీసుకున్నట్టు ఆధారాలు చూపించాలని డిమాండ్ చేస్తూ నిఖిల్ రెడ్డి వాదనకు దిగారు. అనంతరం ప్రణయ్ కారు డ్రైవర్ పై కూడా నిఖిల్ వర్గీయులు చేయి చేసుకున్నారు.
అమరావతిలో మాజీ ఎమ్మెల్యే విశ్వేశ్వర్ రెడ్డి !
సొంత కుమారుడు, సోదరుని కుమారుడు పార్టీ ఆఫీసులోనే కొట్టుకున్న విషయం తెలిసి విశ్వేశ్వర్ రెడ్డి హుటాహుటిన ఉరవకొండ వచ్చారు. అప్పటి వరకూ ఆయన అమరావతిలో సీఎం జగన్ నిర్వహించిన వర్క్ షాప్‌లో పాల్గొన్నారు. పయ్యావుల కేశవ్ గత ఎన్నికలలో 2 కోట్లు ఇచ్చారన్న విమర్శను ఇటు పయ్యావుల వర్గీయులు సైతం తీవ్రంగా తిప్పి కొడుతున్నారు. ధనార్జన కోసం కుటుంబ సభ్యుల లోనే ఐక్యత లేదని, ఇక భవిష్యత్తులో కూడా విశ్వేశ్వర్ రెడ్డి కుటుంబం ఎన్నికలలో గెలిచే అవకాశం లేదంటూ పయ్యావుల వర్గీయులు దీటుగా జవాబిస్తున్నారు. ఆ కుటుంబంలోని అనైక్యత వారి అపజయానికి కారణమని, వారికి డబ్బులు ఇచ్చి మద్దతు కోరాల్సిన దుస్థితి తెలుగుదేశానికి లేదంటూ ఘాటు వ్యాఖ్యలు చేస్తున్నారు.
కుటుంబలో ఏకాకిగా మారిన విశ్వేశ్వర్ రెడ్డి !
విశ్వేశ్వర్ రెడ్డికి ఆయన తమ్ముడు మధుసూదన్ రెడ్డి లకు మధ్య అగాధం ఉంది. మరోమారు విశ్వ మరో సోదరుడైన దివంగత రాజేంద్రనాథ్ రెడ్డి కుమారుడు నిఖిల్ రెడ్డి తో కూడా వైరం పెరగడంతో కుటుంబ కలహాలు కాస్త రచ్చకెక్కాయి. పార్టీ అధిష్టానం ఈ వ్యవహారాలు నిశితంగా పరిశీలిస్తున్నట్లు సమాచారం. ఈ వ్యవహారాలన్నీ రాబోయే ఎన్నికలలో టికెట్ కేటాయింపుపై ప్రభావం చూపే అవకాశం లేకపోలేదని పార్టీ సీనియర్ నాయకులు చెబుతున్నారు.