Delhi Liquor Scam : ఢిల్లీ లిక్కర్ స్కాంలో మళ్లీ ఈడీ దూకుడు - రాజకీయంగానూ కీలక పరిణామాలు ఉండబోతున్నాయా ?
ఢిల్లీ లిక్కర్ స్కాంలో ఈడీ దూకుడు కీలక రాజకీయ పరిణామాలకు కారణం అయ్యే అవకాశాలు ఉన్నాయి. వచ్చే వారం, పది రోజుల్లో ఏదైనా జరగవచ్చన్న అభిప్రాయం వినిపిస్తోంది.
Delhi Liquor Scam : ఢిల్లీ లిక్కర్ స్కాం రాజకీయంగా ఎంతో ప్రాధాన్యమున్న కేసు. ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా ఇప్పటికీ జైల్లో ఉన్నారు. అయితే కొంత కాలంగా ఈ కేసులో దర్యాప్తు సంస్థల దూకుడు తగ్గింది. అప్రూవర్లుగా మారుతామన్న వారందరి విజ్ఞప్తులు ఆమోదిస్తోంది. ముఖ్యంగా సౌత్ లాబీకి చెందిన ఎక్కువ మంది నిందితులు క్షమాభిక్ష పిటిషన్లు దాఖలు చేశారు. దర్యాప్తు సంస్థలు కూడా సానుకూలత తెలిపాయి. తాజాగా లిక్కర్ కేసులో పేరున్నా ఇప్పటి వరకూ ఒక్క సారి కూడా విచారణకు హాజరు కాని వైఎస్ఆర్‌సీపీ ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి అప్రూవర్ అయ్యారు. గుంభనంగా సాగిన ఈ వ్యవహారంలో ఈడీ కీలక చర్యలు తీసుకోబోతందన్న ప్రచారం ఢిల్లీలో గుప్పుమంటోంది.
గత వారం రోజులుగా కీలక వ్యక్తుల్ని ప్రశ్నిస్తున్న ఈడీ అధికారులు
గత వారం రోజులుగా ఈడీ అధికారులు ఢిల్లీ లిక్కర్ సాకంలో కీలక వ్యక్తుల్ని ప్రశ్నిస్తున్నారు. ఎమ్మెల్సీ కవిత వద్ద గతంలో ఆడిటర్ గా పని చేసిన బుచ్చిబాబును రెండు రోజుల పాటు ప్రశ్నించినట్లు తెలుస్తోంది. అదే సమయంలో మాగుంట శ్రీనివాసులరెడ్డి చెప్పిన సమాచారం మేరకు హైదరాబాద్ నుంచి ఢిల్లీకి జరిగిన నగదు లావాదేవీల అంశంపైనా మరికొంత మందిని ప్రశ్నించినట్లుగా ఈడీ వర్గాలు చెబుతున్నాయి. తెలంగాణ అధికార పార్టీకి చెందిన ఓ ముఖ్య నేతకు ఢిల్లీలో అన్ని పనులు చక్క బెట్టే వ్యక్తిని కూడా ప్రశ్నించినట్లుగా చెబుతున్నారు. త్వరలో కొంత మందికి నోటీసులు జారీ చేయబోతున్నారని.. విచారణకు పిలవబోతున్నారని అంటున్నారు.
గతంలో కవిత విచారణ తర్వాత నెమ్మదించిన దర్యాప్తు
గతంలో ఢిల్లీలో కవితను విచారణను పిలిచి.. ఆమెకు సంబంధించిన ఫోన్లను స్వాధీనం చేసుకున్న ఈడీ వాటిని విశ్లేషించింది. వాటి నుంచి ఎలాంటి సమాచారం సేకరించారో స్పష్టత లేదు కానీ.. సీబీఐ కోర్టుకు సమర్పించిన వివిధ పత్రాల్లో ఎమ్మెల్సీ కవితపై నిర్దిష్టమైన ప్రయోజనం పొందారని.. ఢిల్లీ లిక్కర్ స్కాంతో వచ్చిన సొమ్ముతో ఆస్తులు కూడా కొన్నారని వెల్లడించారు. తర్వాత ఇక కవితను విచారణకు పిలవలేదు. సౌత్ లాబీలో కీలక నిందితుడిగా ఉన్న శరత్ చంద్రారెడ్డితో పాటు మాగుంట రాఘవరెడ్డి కూడా అప్రూవర్లుగా మారారు. ప్రస్తుతం వారు బెయిల్ మీద ఉన్నారు.
ఇద్దరు ఈడీ అధికారుల్ని అరెస్ట్ చేసిన సీబీఐ
ఢిల్లీ లిక్కర్ స్కాంలో నిందితుల వద్ద నుంచి లంచాలు తీసుకున్నారని ముగ్గురు ఈడీ అధికారులను ఇటీవల సీబీఐ అరెస్టు చేసింది. ఢిల్లీ లిక్కర్ కేసులో అవినీతికి పాల్పడ్డారనే ఆరోపణలతో వారిని అరెస్టు చేశారు. ఈడీకి సంబంధించిన పవన్ కార్తికేయ అనే అసిస్టెంట్ డైరెక్టర్ రూ. 5 కోట్లు లంచం తీసుకుని కేసును నీరు గార్చరనే ఆరోపణలతో పవన్ తో పాటు అతని సిబ్బంది మరో ఇద్దరిని అరెస్టు చేశారు. ఈడీ ఉన్నతాధికారులే ఆయనపై సీబీఐకి కంప్లైంట్ ఇచ్చింది. ఈ వ్యవహారం తర్వాత ఈడీ దూకుడు పెంచడం సహజంగానే సంచలనంగా మారింది.
రాజకీయంగా కీలక పరిణామాలు ఉంటాయా ?
ఢిల్లీ లిక్కర్ స్కాంకు రాజకీయ పరిణామాలకు గట్టి లింక్ ఉంది. ఎందుకంటే నిందితులంతా ముఖ్య రాజకీయ పార్టీలకు చెందిన వారే. బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ కుమార్తె.. వైసీపీ ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి, మరో ఎంపీ విజయసాయిరెడ్డి అల్లుడి సోదరుడు, టీటీడీ బోర్డు మెంబర్ శరత్ చంద్రారెడ్డి వంటి వారు ఉన్నారు. ఇక ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ ను కూడా సీబీఐ ఓ సారి ప్రశ్నించింది. సిసోడియా జైల్లో ఉన్నారు. ఈ కేసును కొలిక్కి తెచ్చేందుకు ఈడీ దూకుడు చూపిస్తోందని అంటున్నారు. త్వరలో ఈ కేసు విషయంలో జరిగే పరిణామాలు రాజకీయంగానూ సంచలనం సృష్టించే అవకాశాలు ఉన్నాయి.