Hyderabad: వందేళ్ళ ముందు చూపుతో సీఎం కేసీఆర్ విప్లవాత్మక నిర్ణయాలు, మంత్రి కేటీఆర్
హైదరాబాద్ విశ్వ నగరం జరిగిన అభివృద్ధి గురించి మంత్రి కేటిఆర్ ట్విటర్ లో పోస్ట్ చేశారు.
వందేళ్ళ ముందు చూపుతో సీఎం కేసీఆర్ తీసుకున్న విప్లవాత్మక నిర్ణయాల వల్ల హైదరాబాద్ నగరం విశ్వ నగరంగా అవతరించిందని తెలంగాణ రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ ట్విట్టర్లో వెల్లడించారు.
ఈ సందర్భంగా హైదరాబాద్ రహదారి వ్యవస్థలో మార్పులు, మెట్రో రైలు, మౌలిక వసతుల కల్పన, ప్రగతిశీల పారిశ్రామిక విధానం ఆవిష్కరణలకు అనువైన వాతావరణం హరితహారం ఇలా తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన పలు కార్యక్రమాల వల్ల రాష్ట్రానికి గుండె కాయవంటి హైదరాబాద్ నగరం మన పెన్నాడు చూడని అభివృద్ధి సాధించిందని సంతోషం వ్యక్తం చేశారు. హైదరాబాద్ ను రానున్న రోజుల్లో మరింత అభివృద్ధి చేస్తామని కేటీఆర్ వెల్లడించారు.
నగరవాసులకు ఓ వైపు విశ్వనగర స్థాయి మౌలిక వసతులు కల్పిస్తూనే మరో వైపు ఆహ్లాదకరమైన వాతావరణాన్ని సృష్టించే విధంగా తెలంగాణ ప్రభుత్వం గత తొమ్మిదిన్నరేండ్లుగా చేస్తున్న అభివృద్ధి యజ్ఞం కొనసాగుతునే ఉన్నదని కేటిఆర్ చెప్పారు. సంక్షేమ పథంలో భాగంగా నిరుపేదలు ఆత్మగౌరవంతో బతికేలా డబుల్ బెడ్‌రూం ఇండ్లు, ఐటీ రంగంలో మరింత అభివృద్ధి సాధించే కొత్త కంపెనీలు, ఆహ్లాదకరమైన జీవన శైలి కోసం ఔటర్‌పై సైకిల్ ట్రాక్, నగరానికి తలమానికంగా మార్చేలా మూసీ సుందరీకరణ…ఇలా బహుముఖ ప్రణాళికలకు శ్రీకారం చుడుతూ అమలు చేస్తూ బీఆర్‌ఎస్ ప్రభుత్వం దూసుకుపోతున్నదని ఆశా భావం వ్యక్తం చేశారు.
నగరాన్ని బెస్ట్ లివింగ్ సిటీగా మార్చే క్రమంలో భాగంగా గత నెల రోజుల్లోనే వేల కోట్ల విలువ చేసే అభివృద్ధి పనులకు పునాది రాయి పడింది. మరికొన్ని ప్రారంభం కూడా జరిగాయి చెప్పారు. మంత్రులు హరీశ్‌రావు, తలసాని, సబిత, మహమూద్ అలీ, మల్లారెడ్డి సహా నగర ఎమ్మెల్యేలు విరామం లేకుండా చేస్తున్న ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలతో గ్రేటర్ హైదరాబాద్‌లో జాతర వాతావరణం నెలకొన్నదని వెల్లడించారు. అనతి కాలంలోనే కండ్ల ముందు నగర రూపు రేఖలు ఊహించనిరీతిలో మారుతుండటంతో నగరంలో ఏ మూలకు వెళ్లినా ప్రజల్లో అభివృద్ధిపైనే విస్తృతంగా చర్చ కొనసాగుతున్నదని మంత్రి కేటిఆర్ అన్నారు.
కలలోనూ ఊహించని ఐటీ అడుగులు
దేశంలో ఐటీ అంటేనే బెంగళూరు నగరం. కానీ ఈ తొమ్మిదిన్నరేండ్లలో ఆ నగరాన్ని వెనక్కి నెట్టి ఐటీలో మేటిగా నిలిచింది హైదరాబాద్ నగరం అని మంత్రి కేటిఆర్ సంతోషం వ్యక్తం చేశారు. అదేవిధంగా హైదరాబాద్‌లో ఐటీ అంటే వెస్ట్ సిటీ. తెలంగాణ సర్కారు ఆ గమనాన్నీ మార్చి ఐటీ వెలుగులు నలుదిశలా వ్యాపించేలా చర్యలు తీసుకున్నదన్నారు. ఇందులో భాగంగా తూర్పు నగరంలోనూ ఐటీ టవర్లు వస్తున్నాయి. అయితే పాత నగరంలో ఐటీ పార్కు అనేది ఎవరూ కలలో కూడా ఊహించలేదు. ఏకంగా రూ.700 కోట్లతో 21 అంతస్తుల ఐటీ టవర్ నిర్మాణానికి మలక్‌పేటలో స్వయంగా నేనే శంకుస్థాపన చేయడమనేది హైదరాబాద్ చరిత్రలోనే ఓ కీలక పరిణామం. రానున్న రోజుల్లో పాత నగరంలోనూ టెకీల సందడి కనిపించనున్నది. అంతేకాదు… హైటెక్ సిటీలో మాదిరిగా మెట్రో స్టేషన్ నుంచి ఈ ఐటీ టవర్‌కు స్కైవాక్ కూడా నిర్మాణం కానున్నదని వెల్లడించారు.
అంతర్జాతీయ పెట్టుబడులకు స్వర్గధామం
నగర శివారు అంతర్జాతీయ పెట్టుబడులకు స్వర్గధామంగా మారిందని మంత్రి చెప్పారు. గత నెల రోజుల్లోనే వేలాది కోట్ల పెట్టుబడులు రావడం విశేషమన్నారు. చందనవెల్లిలో సింటెక్స్ రూ.350 కోట్లు, కిటెక్స్ రూ.1200 కోట్ల పెట్టుబడులతో ముందుకు రాగా… ఆ కంపెనీల నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశామన్నారు. అదేవిధంగా జీనోమ్ వ్యాలీలో రూ.200 కోట్ల బీఎస్‌ఈ, రూ.వెయ్యి కోట్లతో యూరోఫైన్స్ ముందుకు రాగా వాటికి కూడా శంకుస్థాపన చేయడం సంతోషం అని చెప్పారు.
పర్యావరణహితంగా
హైదరాబాద్ నగరంలో ప్రజా రవాణాను పర్యావరణహితంగా మార్చేందుకు అడుగులు మొదలయ్యాయి. ఏకంగా వెయ్యి గ్రీన్ బస్సుల లక్ష్యంగా తొలి విడతగా 25 బస్సులు అందుబాటులోకి వచ్చాయి. జీరో పొల్యూషన్ ప్రాతిపదికన ఈ బస్సులు సేవలు అందించనున్నాయి. ఇలా హైదరాబాద్ విశ్వ నగరం అభివృద్ధి చెందడం గర్వించదగ్గా విషయం అని వెల్లడించారు.