KCR In Delhi : ఢిల్లీలో కేసీఆర్ - బీఆర్ఎస్ విస్తరణపై కీలక చర్చలు!
సీఎం కేసీఆర్ ఢిల్లీలో బీఆర్ఎస్ విస్తరణపై కీలక చర్చలు నిర్వహించే అవకాశం ఉంది. రెండు, మూడు రోజుల పాటు ఆయన ఢిల్లీలోనే ఉండనున్నారు.
KCR In Delhi : భారత్ రాష్ట్ర సమితి అధినేత కేసీఆర్ ఢిల్లీ పర్యటనలో ఉన్నారు. ఉత్తరప్రదేశ్‌లో జరిగిన సమాజ్ వాదీ పార్టీ చీఫ్ ములాయం సింగ్ అంత్యక్రియల్లో పాల్గొన్న తర్వాత ఆయన ఢిల్లీ చేరుకున్నారు. ఢిల్లీకి చేరుకున్న వెంటనే... భారత రాష్ట్ర సమితి పార్టీ కోసం లీజుకు తీసుకున్న భవనాన్ని పరిశీలించారు. పార్టీ కార్యాలయాన్ని పూర్తి స్థాయిలో అందబాటులోకి తెచ్చేందుకు ఏర్పాటు చేయాల్సిన సౌకర్యాలపై సూచనలు చేశారు. నిజానికి టీఆర్ఎస్ భవన్ పేరుతో ఓ కార్యాలయాన్ని ఢిల్లీలో నిర్మిస్తున్నారు. అయితే నిర్మాణం ఆలస్యం కావడంతో వేరే భవనాన్ని లీజుకు తీసుకున్నారు. ఏడాది తర్వాత సొంత భవనంలోకి బీఆర్ఎస్ కార్యాలయం మార్చే అవకాశం ఉంది.
రెండు , మూడు రోజుల పాటు ఢిల్లీలోనే కేసీఆర్
కేసీఆర్ రెండు, మూడు రోజుల పాటు ఢిల్లీలోనే ఉంటారని చెబుతున్నారు. కేసీఆర్‌తో పాటు ఎంపీ సంతోష్, ఎమ్మెల్సీ కవితతో పాటు మరికొంత మంది నేతలు ఉన్నారు. టీఆర్ఎస్ పేరును బీఆర్ఎస్‌గా మార్చే ప్రక్రియ తో పాటు మునుగోడు ఉపఎన్నికల విషయంలో ఈసీని ఎప్పటికప్పుడు సంప్రదించడానికి ఫిర్యాదులు చేయడానికి ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్ కుమార్ ఢిల్లీలోనే ఉంటున్నారు. ఇప్పుడు కేసీఆర్ కూడా ఈ పార్టీ వ్యవహారాలను ఫాలో అప్ చేసుకునే అవకాశం ఉంది. ఈసీ అధికారులతోనూ ఆయన భేటీ అయ్యే అవకాశాలున్నాయని చెబుతున్నారు. టీఆర్ఎస్ ను బీార్ఎస్‌గా మార్చే ప్రక్రియ ఎన్ని రోజుల్లో పూర్తవుతుందో క్లారిటీ తీసుకునే అవకాశం ఉంది.
భారత రాష్ట్ర సమితిని ఇతర రాష్ట్రాల్లో విస్తరించే దిశగా కీలక చర్చలు జరిపే అవకాశం
అదే సమయంలో జాతీయ స్థాయిలో బీఆర్ఎస్‌ను బలోపేతం చేసుకునేందుకు కేసీఆర్ ఈ ఢిల్లీ పర్యటనలో ప్రయత్నిస్తారన్న ప్రచారం జరుగుతోంది. రాజకీయాలకు సంబంధం లేని తటస్తులతో భేటీలు అయ్యే అవకాశం ఉందని టీఆర్ఎస్ వర్గాలు చెబుతున్నాయి. అలాగే ఇతర రాష్ట్రాల్లో కొన్ని చిన్న పార్టీలతో పొత్తులు లేదా విలీనాలపై చర్చ జరిగే అవకాశం ఉందని చెబుతున్నారు. కేసీఆర్ పార్టీ ప్రకటన తర్వాత ఇంత వరకూ మీడియాతో మాట్లాడలేదు. జాతీయ పార్టీ కాబట్టి ఢిల్లీలో స్థాయిలో మొదటి సారి జాతీయ మీడియాతో మాట్లాడే అవకాశం ఉందంటున్నారు. ఇప్పటికే జాతీయ మీడియాలో బీఆర్ఎస్‌కు ప్రచారం కోసం ప్రత్యేకంగా ఓ టీమును నియమించుకున్నారు.
ఢిల్లీ లిక్కర్ వ్యవహారంలోనూ కీలక పరిణామాలు - కేసీఆర్ ఢిల్లీ పర్యటనపై చర్చ
అదే సమయంలో ఢిల్లీ లిక్కర్ స్కాం ప్రకంపనలు కూడా ఎక్కువగానే ఉన్నాయి. అభిషేక్ రావు అనే హైదరాబాద్ వ్యాపారిని సీబీఐ అధికారులు అరెస్ట్ చేశారు. ప్రస్తుతం ఆయన సీబీఐ కస్టడీలోనే ఉన్నారు. ఆయన టీఆర్ఎస్ పెద్దలకు సన్నిహితులు అని చెబుతున్నారు. అలాగే ఈడీ అధికారులు హైదరాబాద్‌లో సోదాలు నిర్వహించినప్పుడు వెన్నమనేని శ్రీనివాసరావు దగ్గర కీలకమైన ఆధారాలు దొరికాయన్న ప్రచారం ఉంది. తెలంగాణలో మరికొన్ని అరెస్టులు జరిగే అవకాశం ఉందని బీజేపీ వర్గాలు చెబుతున్నారు. ఈ పరిణామాల మధ్య కేసీఆర్ ఢిల్లీ పర్యటన రాజకీయవర్గాల్లో చర్చనీయాంశం అవుతోంది.