Galla Aruna Kumari : ఒక ప్రయాణం ముగిసింది, రాజకీయాలపై గల్లా అరుణ కుమారి కీలక వ్యాఖ్యలు
Galla Aruna Kumari : మాజీ మంత్రి, టీడీపీ నేత గల్లా అరుణ కుమారి రాజకీయ ప్రయాణం ముగిసిందని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఒక ప్రయాణం ముగిసిందని ఇకపై సేవా ప్రయాణం స్టార్ట్ చేశానన్నారు.
Galla Aruna Kumari : ఏపీ, తెలంగాణ రాజకీయాల్లో తన కంటూ ప్రత్యేక స్థానం సంపాదించిన మహిళా నేత గల్లా అరుణకుమారి. చిత్తూరు జిల్లా అరగొండలో తన రాజకీయ ప్రస్థానం మొదలుపెట్టిన ఆమె..రాజకీయాల్లో అందరికీ సుపరిచితురాలు. చంద్రగిరి ఎమ్మెల్యేగా నాలుగు సార్లు గెలుపొందిన అరుణ కుమారి... ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించారు. అంతే కాకుండా కాంగ్రెస్ రాష్ట్ర మహిళా అధ్యక్షురాలిగా పని చేసి, మహిళలు ఎందులోనూ తక్కువ కాదని నిరూపించారు. రాజకీయంలో అపారమైన అనుభవం ఉన్న గల్లా అరుణ కుమారి రాష్ట్ర విభజన అనంతరం టీడీపీలో చేరి పొలిట్ బ్యూరో సభ్యురాలిగా పనిచేశారు. రాజకీయాల్లో ఎప్పుడూ చురుగ్గా ఉండే అరుణ కుమారి 2014లో చంద్రగిరిలో ఓటమి పాలైయ్యారు. ఆ ఓటమిని ఏమాత్రం జీర్ణించుకోలేని గల్లా నెమ్మదిగా రాజకీయాలకు దూరం ఉంటూ వచ్చారు.
రాజకీయాలకు దూరంగా ఉంటూ
2019 ఎన్నికలకు ముందుగానే నియోజకవర్గం బాధ్యతల నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించిన గల్లా అరుణ కుమారి టీడీపీకి పెద్ద షాక్ ఇచ్చారు. తన కుమారుడైన గల్లా జయదేవ్ ఎంపీగా గుంటూరు నుంచి పోటీ చేయడంతో చిత్తూరు జిల్లాలో తన రాజకీయాలకే అంతగాశ్రద్ద చూపలేదు. తరువాత చిత్తూరు జిల్లాలో ఆమె పెద్దగా ఎక్కడ కనిపించేవారు కాదు. గల్లా అరుణ కుమారి అజ్ఞాతంలోకి వెళ్లారనే పుకార్లు వచ్చాయి. అవేవి పట్టించుకోని ఆమె అప్పుడప్పుడు ప్రజల్లో కనిపిస్తూ వచ్చేవారు. జిల్లా రాజకీయాలకు మాత్రమే పరిమితం అయ్యినట్లుగా ఆమె వ్యవహార శైలి ఉండడంతో, జిల్లాలోని బడా రాజకీయ నాయకులు అనేక సార్లు ఆమెను కలిసి తమ గోడును విన్నవించుకున్నా ఆమె ఏమాత్రం వినిపించుకోలేదని, తాను రాజకీయాలకు దూరం ఉండేందుకు నిర్ణయించుకున్నట్లు తేల్చేశారని పార్టీ కేడర్ లో బలంగా వినిపిస్తున్న మాట. ఈ తరుణంలో గల్లా అరుణ కుమారే స్వయంగా తాను రాజకీయాల్లో ఉండబోనని సంచలన వ్యాఖ్యలు చేయడం హాట్ టాపిక్ గా మారింది.
ఇకపై సేవా ప్రయాణం
దశాబ్దాల రాజకీయ అనుభవం కలిగిన గల్లా అరుణకుమారి తన భవిష్యత్తు రాజకీయాలపై క్లారిటీ ఇచ్చారు. తవణంపల్లె మండలంలోని దిగువమాఘం గ్రామంలో అమరరాజా శిక్షణ నైపుణ్యాభివృద్ధి సంస్థ నూతన భవనం భూమి పూజలో అమరరాజా సంస్థల ఛైర్మన్ గల్లా రామచంద్రనాయుడు, గల్లా అరుణ కుమారి పాల్గొనినారు. తెలుగుదేశం పార్టీలో భవిష్యత్తుపై మీడియా ప్రతినిధులు అడిగిన ప్రశ్నలకు స్పందిస్తూ మాజీ మంత్రి గల్లా అరుణకుమారి సంచలన ప్రకటన చేశారు. తాను రాజకీయాలకు స్వస్తి పలుకుతున్నట్లు ప్రకటించారు. తన రాజకీయ ప్రయాణం ముగిసిందని, సేవా ప్రయాణం మొదలుపెట్టానన్నారు. తన అనుచరులకు లైసెన్సు ఇచ్చేశానని వారికి ఎక్కడ బాగుంటే అక్కడ ఉండొచ్చని చెప్పారు. రాజకీయాలలో తాను చూడని పదవి లేదన్న ఆమె జయదేవ్ రాజకీయాలలో ఉన్నారని ఆయన కోసం మాత్రం పనిచేస్తానన్నారు. గతంలోనే టీడీపీ పోలిట్ బ్యూరో పదవికి రాజీనామా చేసిన గల్లా అరుణ ఆ తరువాత జాతీయ ఉపాధ్యక్షురాలిగా టీడీపీ నియమించింది. ఆమె తాజా ప్రకటనతో టీడీపీలోనూ కలవరపాటు నెలకొంది.