Chandrababu Naidu: చంద్రబాబు ప్రమాణ స్వీకారానికి ముహూర్తం ఫిక్స్, ఈవెంట్ వేదిక ఎక్కడంటే !
Chandrababu Oath Taking Muhurat: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ఈ నెల 12న ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ మేరకు ముహూర్తం ఖరారు చేసినట్లు తెలుస్తోంది.
AP New CM Chandrababu Take oath on 12 June: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి (AP CM)గా టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) ఈ నెల 12న ప్రమాణ స్వీకారం (Oath Taking) చేయనున్నారు. ఈ మేరకు ముహూర్తం ఖరారైంది. గన్నవరం విమానాశ్రయం సమీపంలోని కేసరపల్లి ఐటీ పార్క్ (Kesarapalli IT Park) వద్ద 12వ తేదీ ఉదయం 11.27 గంటలకు చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ మేరకు టీడీపీ నాయకులు, అధికారులు ఏర్పాట్లు చేపట్టారు. ఉమ్మడి రాష్ట్రం విభజన తరువాత ఆంధ్రప్రదేశ్ మూడో ముఖ్యమంత్రిగా చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేయనున్నారు.
ఏర్పాట్ల పరిశీలన
చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం కార్యక్రమానికి మొదటగా మొదటగా ఎయిమ్స్ సమీపంలోని స్థలాన్ని పరిశీలించారు. అయితే ప్రధాని నరేంద్రమోదీ, ఎన్డీయే కూటమి ముఖ్యనేతలు, వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు వచ్చే అవకాశం ఉండడం, టీడీపీ నేతలు, కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలిరానున్న నేపథ్యంలో అధికారులు, టీడీపీ నేతలు ఆ ప్రాంతం అనువుగా ఉండదని భావించారు.
ఈ నేపథ్యంలోనే గన్నవరం విమానాశ్రయం సమీపంలోని కేసరపల్లి ఐటీ పార్క్ వద్ద ప్రమాణస్వీకార కార్యక్రమం ఏర్పాట్లు చేయాలని నిర్ణయించారు. ఇప్పటికే అక్కడ సభావేదిక ఏర్పాట్లు జోరుగా సాగుతున్నాయి. వేదిక నిర్మాణం కోసం ఇప్పటికే 12 లారీలలో సామగ్రిని తీసుకొచ్చారు. టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు, సీనియర్ నాయకుడు, ఎమ్మెల్యే టీడీ జనార్దన్, టీడీపీ నేతలు సభా స్థలాన్ని పరిశీలించారు.
మోదీ కోసం మార్పు
వాస్తవానికి జూన్ 9న చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేయాల్సి ఉంది. అమరావతి వేదికగా కార్యక్రమం జరగాల్సి ఉంది. అయితే అదే రోజు ప్రధానిగా నరేంద్ర మోదీ ప్రమాణ స్వీకారం జరగనుండంతో చంద్రబాబు ప్రమాణ స్వీకార కార్యక్రమం వెనక్కి వెళ్లింది. జూన్ 12న కేసరపల్లి ఐటీ పార్క్ వద్ద చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ సందర్భంగా ఇప్పటికే ప్రధాని మోదీతో పాటు పలువురు ప్రముఖులకు ఆహ్వానం పంపినట్లు ప్రచారం జరుగుతోంది.
వైఎస్ జగన్‌కు ఆహ్వానం
వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని చంద్రబాబు ప్రమాణ స్వీకారానికి ఆహ్వానించినట్లు ప్రచారం జరుగుతోంది. విజయవాడ వేదికగా జరిగే చంద్రబాబు ప్రమాణ స్వీకారానికి రావాలని వైఎస్ జగన్‌కు ఆహ్వానం వెళ్లినట్లు సమాచారం. కార్యక్రమానికి జగన్ హాజరవుతారా లేదా అని ఆసక్తి నెలకొంది. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.