(Source: ECI/ABP News/ABP Majha)
Chandrababu Naidu Arrest: నంద్యాల టు విజయవాడ- చంద్రబాబు అరెస్ట్, ఎప్పుడు ఏం జరిగిందంటే !
Chandrababu Naidu Arrest: టీడీపీ అధినేత చంద్రబాబునాయుడుని సీఐడీ పోలీసులు శనివారం తెల్లవారుజామున అరెస్టు చేశారు. ఆయన అరెస్ట్ వెనుక హైడ్రామా నడిచింది.
Chandrababu Naidu Arrest: టీడీపీ అధినేత చంద్రబాబునాయుడుని సీఐడీ పోలీసులు శనివారం తెల్లవారుజామున అరెస్టు చేశారు. ఆయన అరెస్ట్ వెనుక హైడ్రామా నడిచింది. ఎప్పుడు ఏం జరిగిందంటే.. ‘బాబు స్యూరిటీ- భవిష్యత్తుకు గ్యారెంటీ’ కార్యక్రమంలో భాగంగా చంద్రబాబు శుక్రవారం రాత్రి నంద్యాలలో బహిరంగ సభలో పాల్గొన్నారు. అనంతరం ఆర్కే ఫంక్షన్ హాలులో బస చేశారు. అర్ధరాత్రి 12 గంటల తరువాత 600 మందికిపైగా పోలీసులు నంద్యాలకు చేరుకున్నారు. అడుగడుగునా చెక్‌పోస్టులు, బారికేడ్లు ఏర్పాటు చేశారు. చంద్రబాబు బస చేస్తున్న ఆర్కే ఫంక్షన్ హాల్‌ను ఎస్పీ రఘువీర్‌రెడ్డి ఆధ్వర్యంలో వందలాది మంది పోలీసులు చుట్టుముట్టారు. అనంతరం డీఐజీ రఘురామిరెడ్డి, ఎస్పీ రఘువీర్‌రెడ్డి అక్కడికి చేరుకున్నారు.
చంద్రబాబును అరెస్టు చేస్తారన్న సమాచారం అందుకున్న టీడీపీ నాయకులు, కార్యకర్తలు ఆర్కే ఫంక్షన్ హాలు వద్దకు చేరుకున్నారు. ఈ క్రమంలో పార్టీ నేతలు, పోలీసుల మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. అడ్డుగా బైఠాయించిన టీడీపీ శ్రేణులను నెట్టుకుంటూ పోలీసులు ఫంక్షన్ హాల్ లోపలికి ప్రవేశించారు. వారిని టీడీపీ నేతలు, కార్యకర్తలు అడ్డుకున్నారు. ఈ సమయంలో ఎందుకు వచ్చారని టీడీపీ శ్రేణులు ప్రశ్నించారు. దీనిపై పోలీసులు స్పందిస్తూ మీకు సమాధానం ఇవ్వాల్సిన అవసరం లేదని, చంద్రబాబు నాయుడుకే చెబుతామని అన్నారు. మొదట చంద్రబాబు ముఖ్య భద్రతాధికారితో సంప్రదింపులు జరిపారు. తెల్లవారు జామున మూడు గంటల ప్రాంతంలో చంద్రబాబు బస చేస్తున్న బస్సు వద్దకు పోలీసులు వెళ్లారు.
ఆర్కే ఫంక్షన్ హాల్ ప్రాంగణం నుంచి టీడీపీ కార్యకర్తలు, మీడియా ప్రతినిధులను దూరంగా పంపేసిన పోలీసులు తర్వాత లోపల ఉన్న వారి వాహనాలనూ తొలగించారు. అనంతరం పోలీసు వాహనాలను లోపలికి తీసుకెళ్లారు. లోపల చంద్రబాబు బస్సు వద్ద రక్షణగా ఉన్న భూమా బ్రహ్మానందరెడ్డి, భూమా అఖిలప్రియ, జగత్‌విఖ్యాత్‌రెడ్డి, బీసీ జనార్దన్‌రెడ్డి, ఏవీ సుబ్బారెడ్డిని మహానంది పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ఆ ప్రాంగణాన్ని పూర్తిగా తమ ఆధీనంలోకి తీసుకున్నారు. రాత్రి 3 గంటల సమయంలో అధికారులు చంద్రబాబును నిద్రలేపేందుకు ప్రయత్నించారు. డీఐజీ రఘురామిరెడ్డి, టీడీపీ నాయకుల మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది.
టీడీపీ కర్నూలు జిల్లా అధ్యక్షుడు బీటీ నాయుడు, మాజీ మంత్రి కాలవ శ్రీనివాసులు తలుపునకు అడ్డుగా నిలబడ్డారు. పగలంతా కార్యక్రమాల్లో పాల్గొని చంద్రబాబు అలసిపోయారని, ప్రస్తుతం విశ్రమిస్తున్నారని చెప్పారు. ఇంత రాత్రి సమయంలో ఆయన్ను ఎందుకు నిద్రలేపేందుకు ప్రయత్నిస్తున్నారని ప్రశ్నించారు. ఇందుకు డీఐజీ స్పందిస్తూ ‘మేం మీతో మాట్లాడటం లేదు. చంద్రబాబు ముఖ్య భద్రతాధికారితో చర్చిస్తున్నాం. మధ్యలో మీరెందుకు జోక్యం చేసుకుంటురు’ అంటూ ప్రశ్నించారు. చంద్రబాబును తానే జిల్లాకు ఆహ్వానించానని, మీరు ఏదైనా ఉంటే నాతో మాట్లాడాలంటూ బీటీ నాయుడు వారికి చెప్పారు. పోలీస్ అధికారులు స్పందిస్తూ ‘బస్సులోపల ఏం జరుగుతుందో తెలుసు కోవాలనుకుంటున్నాం. చంద్రబాబుతో మాట్లాడాలని భావిస్తున్నాం’ అంటూ సమాధానమిచ్చారు. ఇందుకు నాయకులు, టీడీపీ కార్యకర్తలు ఒప్పుకోలేదు.
చంద్రబాబును నిద్రలేపేందుకు తాము ఒప్పుకోమని టీడీపీ నాయకులు స్పష్టం చేశారు. మీరు ఇలా అడ్డుకుంటే బాబు బస చేస్తున్న బస్సునే తీసుకెళ్తామని పోలీసులు సమాధానమిచ్చారు. 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా చేసిన వ్యక్తి విశ్రమిస్తున్న బస్సును తీసుకెళ్తామని చెప్పడం అన్యాయమని కాలవ శ్రీనివాసులు, ఇతర నాయకులు ఖండించారు. ఏం చర్యలు తీసుకోవాలన్నా, ఏం మాట్లాడాలనుకున్నా ఉదయం రావాలని సూచించారు. ఈ క్రమంలో ఇరువర్గాల మధ్య ఘర్షణ వాతావరణం ఏర్పడింది. పోలీసులు ఫంక్షన్ హాలు వద్ద అడ్డుగా ఉన్న వాహనాలను తొలగించి పలువురిని అదుపులోకి తీసుకున్నారు.
అనంతరం చంద్రబాబు బస్సు వద్దకు వెళ్లి ఆయన్ను కిందకు రావాలని పిలిచారు. కిందకు వచ్చిన చంద్రబాబు తన హక్కులను కాలరాస్తున్నారని పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. తాను తప్పు చేస్తే నడిరోడ్డుపై ఉరితీయాలని, ఏ చట్టం ప్రకారం తనను అరెస్టు చేస్తారో చెప్పాలని డిమాండ్ చేశారు. ప్రాథమిక ఆధారాలు లేకుండా ఎలా అరెస్టు చేస్తారని ప్రశ్నించారు. చంద్రబాబు ప్రశ్నలకు పోలీసులు సమాధానం ఇస్తూ.. తాము హైకోర్టుకు ప్రాథమిక ఆధారాలు ఇచ్చామని పేర్కొన్నారు. ఆధారాలు చూపాలంటూ చంద్రబాబు తరఫు న్యాయవాదులు కోరారు. రిమాండు రిపోర్టులో అన్ని వివరాలు ఉన్నాయని పోలీసులు చెప్పారు. అవినీతి ఆరోపణలపై అరెస్టు చేస్తున్నట్లు నోటీసులో పోలీసులు పేర్కొన్నారు. తమతో విజయవాడకు బయలుదేరితే 15 నిమిషాల్లో మీరు కోరిన అన్ని పత్రాలు వాట్సాప్‌లో పంపిస్తామన్నారు.
చంద్రబాబు ఆరోగ్యం సరిగా లేదని ఆయన తరఫు న్యాయవాదులు చెప్పారు. దీంతో వైద్యులు చంద్రబాబుకు వైద్యపరీక్షలు నిర్వహించారు. ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని చెప్పడంతో విజయవాడకు తరలించారు. నంద్యాల, గిద్దలూరు బేస్తవారిపేట మీదుగా ఆయన్ను విజయవాడ తీసుకెళ్తున్నారు. మార్కాపురం నియోజకవర్గం తాడివారి పల్లిలో చంద్రబాబుని తరలిస్తున్న కాన్వాయ్‌ని స్థానిక టీడీపీ నేతలు అడ్డుకున్నారు. చంద్రబాబును అరెస్ట్‌ను నిరసిస్తూ రోడ్డుపై అడ్డంగా నిలబడ్డారు. పోలీసులు వారిపై లాఠీ చార్జ్ చేశారు. టీడీపీ నేతలు ఎక్కడికక్కడ అడ్డుపడుతున్న నేపథ్యంలో చంద్రబాబు కన్వాయ్‌ని పోలీసులు బేస్తవారిపేట, పొదిలి, దర్శి, అద్దంకి, చిలకలూరిపేట, గుంటూరు మీదుగా విజయవాడకు తరలిస్తున్నారు.