Munugodu ByElection Fever : మునుగోడులో అప్పుడే ఉపఎన్నిక ఫీవర్ - రంగంలోకి దిగిన పార్టీలు !
మునుగోడులో ఉపఎన్నిక హడావుడి కనిపిస్తోంది. అన్ని పార్టీలు తమ నేతలను సమాయత్తం చేస్తున్నారు.
Munugodu ByElection Fever : తెలంగాణలో మరో ఉపఎన్నిక వస్తుందన్న సంకేతాలు రావడమే ఆలస్యం అన్ని పార్టీలు అలర్ట్ అయిపోయాయి. కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి బీజేపీలో చేరడానికి రంగం సిద్ధం చేసుకున్నారనే విషయం వెలుగులోకి వచ్చింది. తాను పార్టీ మారడం చారిత్రక అవసరం అని ఆయన సమర్థించుకున్నారు. ఈ లెక్క ప్రకారం ఆయన మునుగోడు ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి ఉపఎన్నికల్లో బీజేపీ తరపున పోటీ చేస్తారు. అక్కడ బీజేపీ గెలిస్తే ఒక్క సారిగా ఆ పార్టీ సెంటిమెంట్ బలపడుతుంది. అది సాధారణ ఎన్నికల్లో తిరుగులేని విధంగా ప్లస్ అవుతుంది. ఆ ప్లాన్‌తో అడుగు వేస్తున్నారని తెలంగాణ రాజకీయవర్గాలకు ఓ క్లారిటీ వచ్చింది. అందుకే మునుగోడులో అప్పుడే ఉపఎన్నిక వేడి కనిపిస్తోంది.
సర్వేలు .. పార్టీ కార్యకర్తలతో భేటీలు -ఎన్నికల వ్యూహాల్లో కోమటిరెడ్డి !
ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి బీజేపీలో చేరి మళ్లీ ఆ పార్టీ అభ్యర్థిగా పోటీ చేయాలనుకుంటున్న కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఇప్పటికే పలు మార్గాల ద్వారా అభిప్రాయసేకరణ చేయించుకున్నట్లుగా తెలుస్తోంది. ఆయన కోసం పలు సర్వే టీమ్‌లు రంగంలోకి దిగాయి. అదే సమయంలో పార్టీ క్యాడర్‌తో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చర్చలు జరుపుతున్నారు. మండలాల వారీగా నేతలతో మావేశం అవుతున్నారు. పార్టీ మార్పుపై అభిప్రాయాలు సేకరిస్తున్నారు. ఓ రకంగా ఆయన గ్రౌండ్ ప్రిపేర్ చేసుకుంటున్నారన్న విషయం స్పష్టమవుతోంది.
మునుగోడులో ఒక్క సారిగా పెరిగిన టీఆర్ఎస్ కార్యక్రమాలు!
ఉపఎన్నికలు ఎక్కడ వచ్చినా టీఆర్ఎస్ దూకుడుగా ప్రారంభించే కార్యక్రమాలను మునుగోడులో ప్రారంభించేశారు. గతంలో మునుగోడులో ఇచ్చిన కల్యాణ లక్ష్మి చెక్కులు బౌన్స్ అయ్యాయి. ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి పంపిణీ చేయకపోవడం వల్లనే బౌన్స్ అయ్యాయని చెప్పి ఇప్పుడు కొత్త చెక్కులను మంత్రి జగదీష్ రెడ్డి పంపిణీ చేస్తున్నారు. చాలా కాలంగా ప్రజల డిమాండ్‌గా ఉన్న గట్టుప్పలను ప్రత్యేక మండల కేంద్రం చేయడాన్ని నెరవేర్చారు. ఇప్పుడు నియోజకవర్గంలో పెండింగ్‌లో ఉన్న సమస్యలపై దృష్టి సారించారు. అదే సమయంలో కాంగ్రెస్ నేతల్ని ముఖ్యంగా రాజగోపాల్ రెడ్డి అనుచరులకు టీఆర్ఎస్ కండువా కప్పేందుకు ప్లాన్లు వేసుకుంటున్నారు. గట్టుప్పల్ మండల సాధన సమితీ నేతల్ని..కొంత మంది గ్రామసర్పంచ్‌లకు ఇప్పటికే కండువా కప్పారు.
కాంగ్రెస్ కసరత్తు ప్రారంభించిన రేవంత్ రెడ్డి !
కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రాజీనామా చేసి బీజేపీ తరపున పోటీ చేస్తే భారీగా దెబ్బతినేది కాంగ్రెస్ పార్టీనే. మునుగోడు నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీకి కంచుకోట లాంటిది. గతంలో అక్కడ్నుంచి పాల్వాయి గోవర్ధన్ రెడ్డి నేతృత్వం వహించేవారు. ఆ తర్వాత ఆయన కుమార్తె పాల్వాయి స్రవంతి పోటీ చేశారు. కానీ నెగ్గలేదు. గత ఎన్నికల్లో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పట్టుబట్టి మునుగోడు నుంచి పోటీ చేసి గెలిచారు. ఓ రకంగా ఆ నియోజకవర్గానికి స్థానికేతరుడు. అయితే పార్టీపై పట్టు సాధించారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి మళ్లీ పాల్వాయి వర్గాన్ని తెరపైకి తెస్తున్నారు. పాల్వాయి స్రవంతిని పిలిచి మాట్లాడారు. అంతర్గతంగా పార్టీ పరిస్థితిపై చర్చలు జరుపుతున్నారు.
ఇంకా రాజగోపాల్ రెడ్డి రాజీనామా చేయలేదు. రాజీనామా చేస్తానని కూడా ప్రకటించలేదు. కానీ అన్ని పార్టీలు మాత్రం ఉపఎన్నిక వస్తుందని డిసైడైపోయి కసరత్తులు ప్రారంభించేశారు.