BRS Election Plan : కేసీఆర్ బహిరంగసభలు - కేటీఆర్ బస్సు యాత్ర ! బీఆర్ఎస్ మిషన్ తెలంగాణ రెడీ !
బీఆర్ఎస్ ప్రచార ప్రణాళికకేసీఆర్ బహిరంగసభలుకేటీఆర్ బస్సు యాత్రకీలకమైన జిల్లాల్లో హరీష్ మార్క్ రాజకీయంబీఆర్ఎస్ ప్లాన్ ఏ రెడీ అయినట్లేనా ?
BRS Election Plan : మూడో సారి విజయం సాధించడానికి బీఆర్ఎస్ పార్టీ పెద్దలు ప్రచార ప్రణాళికకు తుది రూపు ఇస్తున్నారు. కేసీఆర్ బహిరంగసభలు.. కేటీఆర్ బస్సు యాత్ర ఇతర సీనియర్ నేతలకు జిల్లాల బాధ్యతలు అప్పగించాలని దాదాపుగా నిర్ణయించుకున్నారు. కేసీఆర్ జాతీయ రాజకీయాలపై దృష్టి పెట్టినా తెలంగాణ విషయంలో మాత్రం పూర్తి స్థాయిలో తానే ప్రచార బాధ్యతలు తీసుకోనున్నట్లుగాతెలుస్తోంది. ప్రతి జిల్లాలో భారీ బహిరంగ సభతో జనంలోకి రాబోతున్నారు. ఉదయం జిల్లా ప్రగతి సమావేశాలను నిర్వహించి.. సాయంత్రం భారీ బహిరంగ సభల్లో పాల్గొనేలా ప్రణాళిక సిద్ధం చేసుకుంటున్నారు.
కేటీఆర్ బస్సు యాత్రకు సన్నాహాలు !
బిఆర్‌ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా బస్సు యాత్రను చేపట్టబోతున్నట్లుగా బీఆర్ఎస్ వర్గాలు చెబుతున్నాయి. ప్రతి నియోజకవర్గాన్ని కవర్ చేసేలా ప్రణాళికలు రూపొందిస్తున్నారని అంటున్నారు. సభలు, సమావేశాలు ఉండేలా ప్రయత్నిస్తున్నారు. ఆయా నియోజకవర్గాల్లో బిఆర్‌ఎస్ పార్టీ ఆధ్వర్యంలో చేసిన అభివృద్ధిని వివరించనున్నారు. అక్కడి సమస్యలను గుర్తించి వాటిని తీర్చేందుకు కావాల్సిన హామీలను కేటీఆర్ ద్వారా ఇప్పించేందుకు సిద్ధం అయ్యారు. ప్రజలు ఏం కోరుకుంటున్నారో కూడా సర్వే రిపోర్టుల ఆధారంగా వారి అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకుంటున్నారు. ముఖ్యంగా కేటీఆర్ ఆధ్వర్యంలో జరిగే బస్సు యాత్ర విజయవంతం చేసేలా ముఖ్య అనుచరులకు బాధ్యతలను అప్పగించనున్నారు. భవిష్యత్తు సీఎం కేటీఆర్ అనే తరహాలో యాత్రను నిర్వహించబోతున్నట్లు తెలుస్తోంది.
పాదయాత్రల ద్వారా ప్రజల్లోకి వెళ్లిన విపక్ష పార్టీలు !
తెలంగాణలో ఇప్పటికే విపక్ష పార్టీల నేతలు పాదయాత్రల ద్వారా ప్రజల్లోకి వెళ్లారు. బీజేపీ తరపున బండి సంజయ్, కాంగ్రెస్ తరపున రేవంత్ రెడ్డి, వైఎస్ఆర్‌టీపీ అధ్యక్షురాలు షర్మిల పాదయాత్రలు చేశారు. చేస్తున్నారు. అందుకే ప్రభుత్వం తరపున కూడా ఓ కీలక వ్యక్తి యాత్ర చేస్తే బాగుంటుందన్న అభిప్రాయానికి వచ్చారు. బస్సు యాత్ర అయితే అన్ని నియోజకవర్గాలను చుట్టేయవచ్చు అని భావిస్తున్నారు. ఎలక్షన్ షెడ్యూల్ విడుదల అయ్యే లోపే బస్సు యాత్రను పూర్తి చేయనున్నారు. తర్వాత భారీ బహిరం గ సభలు, ఆత్మీయ సమ్మేళనాలు నిర్వహించనున్నారు. యాత్ర మాత్రం జూన్ మొదటి వారం లేదా జూన్ తర్వాత కానీ ఉండేలా నిర్ణయిస్తున్నారు. త్వరలోనే ఇందుకు సంబంధించిన పూర్తి ప్రణాళికలను విడుదల చేసే అవకాశం ఉందని తెలంగాణ భవన్ వర్గాలు చెబుతున్నాయి.
సవాల్ గా మారిన ఖమ్మం జిల్లా బాధ్యతలు హరీష్ కేనా ?
ఖమ్మంలో పార్టీకి ఎమ్మెల్యేలు ఉన్నా.. అక్కడి నుంచి ప్రతి పక్షాలు గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు అధిష్టానం బావిస్తోంది. ఖమ్మంలో టిడిపి , కాంగ్రెస్, వైఎస్‌ఆర్‌టిపితో పాటు పాటు సొంత పార్టీ అసమ్మతి నేతలు అధికార పార్టీని ఓడించేందుకు ప్రయత్నిస్తారన్న అభిప్రాయం అధిష్టానం మదిలో ఉంది. దీంతో ఈ జిల్లాను పూర్తిగా హరీష్ రావుకు అప్పగించి.. గెలిపించే బాధ్యతను ఇవ్వనున్నారు. గతంలో రెండు సార్లు ఒకే ఒక్క స్థానాన్ని బీఆర్ఎస్ గెల్చుకుంది. ఈ సారి ఎక్కువ సీట్లు కైవసం చేసుకునేలా హరీష్ కు బాధ్యతలివ్వనున్నారు. మొత్తంగా ఎక్కడ లోపాలు ఉన్నాయో.. పక్కాగా క్లియర్ చేసుకుంటూ బీఆర్ఎస్ ప్రచార ప్రణాళిక రెడీ చేసుకుంటున్నట్లుగా కనిపిస్తోంది.