రాహుల్ కంటే ముందు అనర్హత వేటు పడిన నేతలు వీరే
మోదీ ఇంటి పేరుపై అనుచిత వ్యాఖ్యల కేసులో రాహుల్‌గాంధీపై అనర్హత వేటుతో ఈ అంశం దేశవ్యాప్తంగా చర్చ సాగుతోంది. గతంలో జైలుశిక్ష పడి చట్టసభల్లో ఇప్పటి వరకు సభ్యత్వం కోల్పోయిన నేతలపై చర్చ జరుగుతోంది.
MP's MLA's Disqualification : ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇంటి పేరుపై అనుచిత వ్యాఖ్యలు చేసిన కేసులో కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీపై అనర్హత వేటుతో ఈ అంశం దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. 2019 నాటి కేసులో రాహుల్ గాంధీపై సూరత్ కోర్టు విధించిన రెండేళ్ల జైలు శిక్షతో రాహుల్ తన పదవిని కోల్పోబోతున్నారా అంటూ చర్చ జరుగుతున్న వేళ అనూహ్యంగా లోక్ సభ రాహుల్ గాంధీని ఎంపీ పదవికి అనర్హుడిగా ప్రకటించింది. ఈ నిర్ణయంపై కాంగ్రెస్ తో సహా పలు విపక్షాలు విమర్శలు గుప్పిస్తున్నాయి.
రాహుల్ విషయంలో లోక్ సభ సిబ్బందిది తొందరపాటు చర్య అని కొంతమంది అభిప్రాయపడుతుంటే.. ఇదంతా పక్కా స్కెచ్ ప్రకారం రాహుల్‌ను సభ నుంచి బయటకు పంపేలా అనర్హత వేటుకు బీజేపీ ప్లాన్ చేసిందని మరి కొందరు చెబుతున్నారు. ప్రజాప్రాతినిధ్య చట్టం 1951 సెక్షన్ 8(3) ప్రకారం ఎదైనా కేసులో దోషిగా తేలి రెండేళ్లకు తగ్గకుండా జైలు శిక్ష పడితే అలాంటి వారు తమ లోక్ సభ, శాసనసభ సభ్యత్వాన్ని కోల్పోవాల్సి వస్తుంది. రాహుల్ గాంధీపై అనర్హత వేటుతో జైలు శిక్ష పడి చట్టసభల్లో ఇప్పటి వరకు సభ్యత్వం కోల్పోయిన నేతలపై జోరుగా చర్చ జరుగుతోంది.
రాహుల్‌గాంధీ కంటే ముందు అనర్హత వేటు కారణంగా ఎంతోమంది ప్రముఖులు తమ సభ్యత్వాలను కోల్పోయారు. అసలా మాటకొస్తే, రాహుల్ గాంధీ నానమ్మ, మాజీ ప్రధాని ఇందిరా గాంధీ సైతం అనర్హత వేటును ఎదుర్కొన్నారు. అప్పట్లోనే ఇందిరా గాంధీ తన లోక్‌సభ సభ్యత్వాన్ని కోల్పోయారు. 1971 ఎన్నికల్లో ఇందిర విజయం చెల్లదంటూ అలహాబాద్ హైకోర్టు తీర్పు ఇవ్వడంతో 1975 జూన్ 12న ఆమె తన పదవిని కోల్పోవాల్సి వచ్చింది. గతంలో అనర్హత వేటు కారణంగా పదవి కోల్పోయిన ప్రముఖులు ఎవరంటే..
లాలూ ప్రసాద్: సెప్టెంబరు 2013లో దాణా కుంభకోణం కేసులో దోషిగా తేలిన తర్వాత ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ లోక్‌సభకు అనర్హుడయ్యారు. ఆయన బీహార్‌లోని సరన్ నుంచి ఎంపీగా ప్రాతినిధ్యం వహించారు.
జె జయలలిత: ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో నాలుగేళ్ల జైలుశిక్షతో పాటు రూ.100 కోట్ల జరిమానా విధించడంతో ఏఐఏడీఎంకె అధినేత్రి జె.జయలలితపై సెప్టెంబరు 2014లో తమిళనాడు అసెంబ్లీ అనర్హత వేటు వేసింది. ఆ సమయంలో తమిళనాడు ముఖ్యమంత్రిగా ఉన్న ఆమె తన పదవికి రాజీనామా చేయాల్సి వచ్చింది. 2015లో కర్ణాటక హైకోర్టు నిర్దోషిగా ప్రకటించడంతో తిరిగి సీఎం పదవి చేపట్టారు.
పీపీ మహ్మద్ ఫైజల్: హత్యాయత్నం కేసులో 2023 జనవరిలో 10 సంవత్సరాల జైలు శిక్ష పడిన తర్వాత నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీకి చెందిన లక్షద్వీప్ ఎంపీ పీపీ మహమ్మద్ ఫైజల్ స్వయంచాలకంగా అనర్హుడయ్యాడు. అయితే, కేరళ హైకోర్టు ఆయన నేరాన్ని, శిక్షను తరువాత నిలిపివేసింది. ఆయన అనర్హతను రద్దు చేస్తూ లోక్‌సభ సెక్రటేరియట్ ఇంకా నోటిఫికేషన్ జారీ చేయలేదు.
అబ్దుల్లా ఆజం ఖాన్: సమాజ్‌వాదీ పార్టీ ఎమ్మెల్యే అబ్దుల్లా ఆజం ఖాన్‌కు 15 ఏళ్ల నాటి కేసులో కోర్టు రెండేళ్ల జైలు శిక్ష విధించిన కొద్ది రోజుల తర్వాత, ఫిబ్రవరి 2023లో ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ నుంచి అనర్హుడయ్యాడు. ఆయన రాంపూర్ జిల్లాలో సువార్ నుంచి అసెంబ్లీకి ప్రాతినిధ్యం వహించారు. 2019లో ద్వేషపూరిత ప్రసంగం కేసులో రాంపూర్ కోర్టు ఆజంఖాన్‌ను దోషిగా ప్రకటించడంతో యూపీ అసెంబ్లీ ఆయనపై అనర్హత వేటు వేసింది.
అనిల్ కుమార్ సాహ్ని: మోసం కేసులో మూడేళ్ల జైలుశిక్ష పడిన తర్వాత ఆర్జేడీ ఎమ్మెల్యే అనిల్ కుమార్ సాహ్ని 2022 అక్టోబర్‌లో బీహార్ అసెంబ్లీ నుంచి అనర్హుడయ్యారు. ఆయన కుర్హానీ అసెంబ్లీ స్థానానికి ప్రాతినిధ్యం వహించారు. 2012లో ప్రయాణాలు చేయకుండానే నకిలీ ఎయిర్ ఇండియా ఇ-టికెట్లను ఉపయోగించి ప్రయాణ భత్యం పొందేందుకు ప్రయత్నించినందుకు ఆయన దోషిగా తేలారు. మోసానికి ప్రయత్నించిన సమయంలో జేడీయూ రాజ్యసభ ఎంపీగా ఉన్న సాహ్ని రూ.23.71 లక్షల క్లెయిమ్‌లను సమర్పించారు.
విక్రమ్ సింఘ్ సైనీ: 2013 ముజఫర్‌నగర్ అల్లర్ల కేసులో రెండేళ్ల జైలుశిక్ష పడిన తర్వాత బీజేపీ ఎమ్మెల్యే విక్రమ్ సింగ్ సైనీ అక్టోబర్ 2022 నుంచి ఉత్తరప్రదేశ్ శాసనసభకు అనర్హుడయ్యారు. సైనీ ముజఫర్‌నగర్‌లోని ఖతౌలీ నుంచి ఎమ్మెల్యేగా ఉన్నారు.
ప్రదీప్ చౌదరి: కాంగ్రెస్ ఎమ్మెల్యే ప్రదీప్ చౌదరి దాడి కేసులో మూడేళ్ల జైలు శిక్ష పడిన తర్వాత జనవరి 2021లో హర్యానా అసెంబ్లీకి అనర్హుడయ్యారు. ఆయన కలక నుంచి ఎమ్మెల్యేగా ఉన్నారు.
కుల్దీప్ సింగ్ సెంగార్: అత్యాచారం కేసులో దోషిగా తేలిన తర్వాత 2020 ఫిబ్రవరిలో కుల్దీప్ సింగ్ సెంగార్ ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ నుంచి అనర్హుడయ్యాడు. ఉన్నావ్‌లోని బంగార్‌మౌ నియోజకవర్గం నుంచి ఎన్నికైన సెంగార్‌ను గతంలో బీజేపీ బహిష్కరించింది.
అనంత్ సింగ్: ఆర్జేడీ ఎమ్మెల్యే అనంత్ సింగ్ తన నివాసంలో ఆయుధాలు, మందుగుండు సామగ్రిని స్వాధీనం చేసుకున్న కేసులో దోషిగా తేలిన తరువాత జూలై 2022లో బిహార్ అసెంబ్లీ నుంచి అనర్హుడయ్యాడు. సింగ్ పాట్నా జిల్లాలోని మొకామా నుంచి ఎమ్మెల్యేగా ఉన్నారు.
వీరితో పాటు తమిళనాడుకు చెందిన డీఎంకే నేత, రాజ్యసభ ఎంపీ టీఎం సెల్వ గణపతి, మహారాష్ట్రకు చెందిన బీజేపీ ఎమ్మెల్యే సురేష్ హల్వాంకర్, ఉల్హాస్ నగర్ ఎమ్మెల్యే పప్పూ కహానీ, బిహార్లోని జహానాబాద్ ఎంపీ జగ్ దీష్ శర్మ, కాంగ్రెస్ కు చెందిన రాజ్యసభ సభ్యుడు రషీద్ మసూద్, మధ్యప్రదేశ్ లో బిజావర్ ఎమ్మెల్యే ఆశారాణి, ఝార్ఖండ్ ఎమ్మెల్యే ఎనోస్ ఎక్కా, లోహర్ దర్గా ఎమ్మెల్యే కమల్ కిశోర్ భగత్, శివసేనా ఎమ్మెల్యే బాబన్ రావు ఘోలాప్ లు వివిధ కేసుల్లో దోషులు గా తేలి చట్టసభల్లో అనర్హత వేటు ఎదుర్కొన్నారు.