AP vs TS Essential Commodities Subsidies: నిత్యావసర వస్తువుల ధరల మంట - ప్రజా వ్యతిరేకత ముప్పు - ప్రభుత్వాల మాస్టర్ ప్లాన్లు ఇవే !
Essential Commodities Price Hike: ఎల్ నినో ప్రభావంతో నిత్యావసరాల ధరల మండుతున్నాయి. ఏపీలో సబ్సిడీ సరుకుల కౌంటర్లు, తెలంగాణలో సబ్సిడీ కిట్ల పంపిణీని ప్రభుత్వాలు ప్రారంభిస్తున్నాయి.

El Nino Impact Commodity Prices AP TS: రాజకీయాల్లో ప్రభుత్వాలపై ప్రజల్లో తీవ్ర అసంతృప్తి రగిలేందుకు పెద్ద పెద్ద సమస్యలో లేదా సిద్ధాంతపరమైన విభేదాలో అవసరం లేదు. సగటు సామాన్యుడి రోజువారీ కిచెన్ బడ్జెట్ తలకిందులైతే చాలు! కడుపు నిండా తినే కూరగాయలు, నిత్యావసర సరుకుల ధరలు ఆకాశాన్నంటినప్పుడు, ప్రజల్లో వ్యక్తమయ్యే ఆగ్రహం నేరుగా పాలకపక్షాల గ్రాఫ్‌ను వేగంగా పడదోస్తుంది. ప్రపంచవ్యాప్తంగా ప్రభావం చూపిన ఎల్ నినో తీవ్రత వల్ల ఏర్పడిన అకాల వర్షాలు, పండగల రద్దీ, వాతావరణ మార్పుల ధాటికి ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లోనూ నిత్యావసర సరుకుల ధరలు భగ్గుమంటున్నాయి. ఈ పరిస్థితుల్లో ధరల మంట ప్రజావ్యతిరేకతగా మారకముందే అదుపుచేసేందుకు ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలు రూ.కోట్ల ఆర్థిక భారాన్ని మోసేందుకు సిద్ధపడుతుండటం ఆసక్తికరమైన రాజకీయ సమీకరణగా మారింది.
ఏపీలో తక్కువ ధరలకే నిత్యావసరాలు
ఏపీలో అధికారంలో ఉన్న చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం, పెరుగుతున్న ధరల నుంచి సామాన్యుడిని కాపాడేందుకు ప్రత్యేక కౌంటర్లు, పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్‌ను పూర్తిస్థాయిలో రంగంలోకి దించింది. నెలకు సుమారు రూ. 100 కోట్ల వరకు అదనపు భారాన్ని ప్రభుత్వమే భరిస్తూ, బహిరంగ మార్కెట్ ధరల కంటే చాలా తక్కువకే నిత్యావసరాలను అందుబాటులోకి తెస్తోంది. రూ.100కే కిలో కందిపప్పు, రూ.125కే లీటర్ పామాయిల్, రూ.25కే గోధుమపిండి అందించడంతో పాటు, ధరణి బ్రాండ్ బియ్యాన్ని ప్రత్యేక వాహనాల ద్వారా అందుబాటులోకి తెస్తూ మార్కెట్ ధరలపై ఒత్తిడి పెంచి అదుపులోకి తెచ్చే ప్రయత్నం చేస్తోంది.
నిత్యావసర కిట్లను పంపిణీ చేసే యోచనలో రేవంత్ సర్కార్
మరోవైపు తెలంగాణలో రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం, ప్రజల అసంతృప్తిని చల్లబరిచేందుకు ఏకంగా రేషన్ కార్డుదారులకు ప్రత్యేక నిత్యావసరాల కిట్ల పంపిణీకి శ్రీకారం చుట్టే దిశగా అడుగులు వేస్తోంది. కేవలం బియ్యం మాత్రమే కాకుండా, పప్పు దినుసులు, వంటనూనెలు, గోధుమపిండి, చక్కెర వంటి 6 రకాల నిత్యావసరాలతో కూడిన సబ్సిడీ కిట్లను అందించడం ద్వారా పేద, దిగువ మధ్యతరగతి కుటుంబాలకు ఆర్థిక భద్రత కల్పించేందుకు పౌరసరఫరాల శాఖ ప్రణాళికలు సిద్ధం చేసింది. బహిరంగ మార్కెట్లో ధరలను విచ్చలవిడిగా పెంచే వ్యాపారుల నిర్బంధ తనిఖీలతో పాటు, ప్రభుత్వం నేరుగా ఈ సబ్సిడీ కిట్లను ఇవ్వడం ద్వారా క్షేత్రస్థాయిలో ప్రజల్లో సానుకూలత తెచ్చుకోవాలని భావిస్తోంది.
ఆర్థిక సమస్యలున్నా ముందుకే!
ఆర్థికంగా తీవ్ర లోటు, రుణభారంతో సతమతమవుతున్నప్పటికీ రెండు రాష్ట్ర ప్రభుత్వాలు ధరల నియంత్ణకై ఇంత భారీగా నిధులు వెచ్చించడానికి ప్రధాన కారణం ఓటు బ్యాంకు ముప్పు! ఉచిత పథకాలు ఎంత అందజేసినా, మార్కెట్‌లో నిత్యావసరాల ధరలు పెరిగితే సామాన్యుడి పాకెట్ మనీ ఖాళీ అయిపోతుంది. దీనివల్ల ప్రభుత్వాల సంక్షేమ పథకాల ఇంపాక్ట్ సున్నాగా మారి, హామీలు ఇచ్చారు కానీ పొట్ట నింపడం లేదు అనే నిరసన స్వరం గ్రామాల్లో బలంగా వినిపించే ప్రమాదం ఉందనేది పొలిటికల్ సర్వేల హెచ్చరిక. ఈ నిత్యావసరాల ధరల నియంత్రణ అంశం రెండు ప్రభుత్వాలకు సంజీవనిలా మారనుంది. బహిరంగ మార్కెట్ ధరలపై నిరంతరం నిఘా ఉంచడం, లభ్యత కొరత రాకుండా ముందస్తుగా దిగుమతులు చేసుకోవడం ద్వారా ప్రజాసంతోషాన్ని కాపాడుకోవడమే ఏపీ, తెలంగాణ సీఎంల ప్రధాన అజెండా.
జాతీయ, అంతర్జాతీయ వాతావరణ మార్పుల వల్ల ఏర్పడిన నిత్యావసరాల కొరతను కేవలం పరిపాలనా సమస్య గా చూడకుండా, 'రాజకీయ మనుగడ' సమస్యగా భావించి రెండు రాష్ట్ర ప్రభుత్వాలు భారాన్ని తమ భుజాన వేసుకోవడం రాజకీయంగా అత్యంత వ్యూహాత్మకమైన అడుగుగా భావించవచ్చు.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు






















