(Source: ECI/ABP News/ABP Majha)
Jagan About Sharmila: బాణాలకు బలైపోవడానికి అభిమన్యుడిని కాదు, నేను అర్జునుడ్ని- షర్మిల అంశంపై జగన్!
YS Jagan Siddham Meeting: ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు షర్మిల తన సోదరుడు జగన్ ను ఉద్దేశించి విమర్శలు చేస్తున్నారు. భీమిలి సభలో సీఎం జగన్ సైతం పరోక్షంగా షర్మిలకు కౌంటర్ ఇచ్చారని ప్రచారం జరుగుతోంది.
YS Jagan starts Election campaign from Bheemili: భీమిలి: "అన్న వదిలిన బాణం " షర్మిల పై ఏపీ సీఎం జగన్ రివర్స్ ఎటాక్ మొదలుపెట్టారు. తన చుట్టూ ప్రత్యర్థులు రాజకీయ పద్మవ్యూహం పన్నారని వెన్నుపోట్లు.. ఎత్తులు పన్నుతున్నారని అయితే వారి వ్యూహం లో చిక్కి బాణాలకు బలై పోవడానికి తాను అభిమన్యుడిని కాదనీ అర్జునుడిని అంటూ సీఎం జగన్ భీమిలి సభ వేదిక గా తేల్చారు. నిజానికి ఏపీ కాంగ్రెస్ పగ్గాలు చేపట్టిన నాటి నుండి ఎక్స్ ప్రెస్ స్పీడ్ లో తన అన్న జగన్ ను టార్గెట్ చేసుకుంటూ YS షర్మిల దూసుకు పోతున్నారు. ఇచ్ఛాపురం మొదలుపెట్టి ఇడుపులపాయ వరకూ సాగే ఆమె యాత్ర లో ప్రధానంగా తన తండ్రి YSR అందించిన పాలన కొనసాగించడం లో అన్న జగన్ ఫెయిల్ అయ్యారంటూ తీవ్ర విమర్శలు చేస్తున్నారు.
కేవలం విమర్శల వరకూ మాత్రమే కాదు గేట్లు కొట్టుకుపోయిన గుండ్లకమ్మ ప్రాజెక్టు, గంతలు పడ్డ గుంటూరు రోడ్లు వంటి వైసీపీ పాలనకు ఇబ్బంది కరంగా మారిన చోట్ల కు స్వయంగా వెళ్లి మరీ ప్రభుత్వాన్ని ఎండగడుతున్నారు. రెండు రోజుల నుండి ఏకంగా జగన్ ఎట్టి పరిస్థితుల్లోనూ వైఎస్సార్ వారసుడు కాదనీ.. వైఎస్సార్ సీపీ లో రాజశేఖర్ రెడ్డి లేనే లేడని y అంటే yv సుబ్బారెడ్డి, S అంటే సాయిరెడ్డి, R అంటే రామకృష్ణా రెడ్డి (సజ్జల) మాత్రమే అంటూ సంచలన కామెంట్స్ చేస్తున్నారు. తనను వైసీపీ నుండి భయపెట్టే ప్రయత్నాలు జరుగుతున్నాయని అయితే తాను పులి బిడ్డ ను అంటూ సవాల్ చేశారు.
షర్మిల పై కౌంటర్ విమర్శలు మొదలుపెట్టిన వైసీపీ మంత్రులు
తమ పాలన పై విమర్శలు చేసే టీడీపీ,, జనసేన లాంటి విపక్షాల పై తీవ్రంగా రియాక్ట్ అయ్యే వైసీపీ నాయకులు షర్మిల పై మాత్రం ఇంతవరకూ మాటలతో ఎటాక్ చెయ్యలేదు.స్వయానా తమ అధినేత చెల్లెలు కావడం తో ఆచి తూచి స్పందించే వారు .కానీ ఈ మధ్య వారు కూడా తమ డోసు పెంచారు. షర్మిలను చూస్తే జాలి వేస్తుందనీ..చంద్రబాబుకు మరో ప్యాకేజీ స్టార్ దొరికారనీ బొత్స, రోజా, కారుమూరి లాంటి మంత్రులు కామెంట్స్ చేస్తున్నారు. రానున్న రోజుల్లో ఈ డోసు మరింత పెరిగే ఛాన్స్ ఉంది.
స్వయంగా రంగం లోకి దిగిన అన్న జగన్
తనపై ఎన్ని విమర్శలు చేస్తున్నా షర్మిలపై డైరెక్ట్ గా ఎలాంటి కామెంట్స్ చెయ్యని జగన్ ఇప్పుడు తాను కూడా కౌంటర్ ఎటాక్ ప్రారంభించారు. తన ఎన్నికల శంఖారావ సభ " సిద్దం" వేదిక గా భీమిలి నుండి తనపై అందరూ కలిసి పద్మ వ్యూహాలు పన్నుతున్నారని అయితే వారి "బాణాలకు" బలై పోవడానికి తాను అభిమన్యుడిని కాదనీ అర్జునుడిని అనీ అన్నారు. దీనిలో బాణం అనే మాట ఖచ్చితం గా YS షర్మిలను ఉద్దేశించి అన్నారని జనం లోకి బలంగా వెళ్తోంది. జగన్ జైల్లో ఉన్న సమయం లో ఆయనకు బదులుగా పాదయాత్ర చేసిన షర్మిల అప్పట్లో తాను "అన్న వదిలిన బాణాన్ని అంటూ చేసిన ప్రకటన ఎంత వైరల్ అయ్యిందో అందరికీ తెలిసిందే. ఇప్పుడు దాన్నే ఇండైరెక్ట్ గా మెన్షన్ చేస్తూ విపక్షాలు వదిలిన "బాణాల"కు బలయ్యేది లేదని జగన్ అన్నారని పొలిటికల్ సర్కిల్స్ లో చర్చ మొదలైంది. మరి దీనిపై షర్మిల ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి.