JC Vs Palle Raghunatha : తగ్గేదేలే అంటున్న జేసీ, రెండో వైపు చూపిస్తానంటున్న పల్లె - అనంతపురం టీడీపీలో పొలిటికల్ ఫైట్
JC Vs Palle Raghunatha : అనంతపురం టీడీపీలో మాటల తూటాలు పేలుతున్నాయి. ఒకరిపై ఒకరు విమర్శలు ప్రతి విమర్శలు చేసుకుంటున్నారు. జేసీ వర్సెస్ పల్లె మధ్య రాజుకున్న రాజకీయ వైరం ఎన్నో మలుపులు తిరుగుతుంది.
JC Vs Palle Raghunatha : సార్వత్రిక ఎన్నికలు మరో రెండేళ్లు ఉండగానే ఉమ్మడి అనంతపురం జిల్లాలో నాయకుల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. ఫలితంగా ఎండ వేడికి తోడు పొలిటికల్ హీట్ రోజు రోజుకీ పెరుగుతోంది. సాధారణంగా రెండు వేరు వేరు పక్షాల నేతల మధ్య సవాళ్లు ప్రతిసవాళ్లు ఉంటాయి. అందుకు భిన్నంగా ఉమ్మడి అనంతపురం జిల్లాలో ఒకే పక్షానికి చెందిన అగ్ర నాయకుల మధ్య మాటలు కోటలు దాటుతున్నాయి. నీకు ఈ ఎన్నికల్లో టిక్కెట్టు రాకుండా చేస్తా అంటూ ఓ నాయకుడు హెచ్చరిస్తే.. ముందు నీ సీట్ చూసుకో కనీసం మనుషుల తోడు లేకుండా.. 50 మీటర్లు కూడా నడవలేని నీకే టికెట్ ఉండదంటూ మరో నాయకుడి జవాబు. ఇలా మాటల తూటాలతో రాజకీయ వేడి రాజుకుంటోంది.
పల్లెకు టికెట్ లేకుండా చేస్తా
వివరాల్లోకి వెళితే ఉమ్మడి అనంతపురం జిల్లాలో చాలామంది అభ్యర్థులను మార్చాల్సి ఉందని, అప్పుడే తమ నాయకుడు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా చేసుకోగలుగుతామంటూ గత కొన్నేళ్లుగా తెలుగుదేశం నాయకులు మాజీ ఎమ్మెల్యే తాడిపత్రి మున్సిపల్ చైర్ పర్సన్ జేసీ ప్రభాకర్ రెడ్డి వ్యాఖ్యలు చేస్తూవస్తున్నారు. దీంతో సొంత పార్టీలోనే చాలామంది మాజీ ఎమ్మెల్యేలు జేసీ ప్రభాకర్ రెడ్డిపై గుర్రుగా ఉన్నారు. ఈ సిరీస్ లో భాగంగా పుట్టపర్తి నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే పల్లె రఘునాథ్ రెడ్డికి టికెట్ లేకుండా చేస్తానంటూ జేసీ ప్రభాకర్ రెడ్డి వ్యాఖ్యానించారు. ఇంతటితో ఆగకుండా పుట్టపర్తి నియోజకవర్గంలో కొంతమంది టీడీపీ చోటా నాయకులు ఇళ్లకు వెళ్లి విలేకరుల సమావేశాలు నిర్వహించి పల్లె రఘునాథ్ రెడ్డికి వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేశారు. ఇలా రెండు పర్యాయాలు జరిగినప్పటికీ పల్లె నుంచి పెద్దగా దీటైన జవాబు రాలేదు. ఒకరిపై ఒకరు వ్యాఖ్యలు చేసుకుంటే పార్టీ పరువుపోతుందంటూ తమ శిబిరం మౌనంగా ఉన్నట్లు పల్లె వర్గీయులు చెప్పుకొచ్చారు.
పుట్టిపర్తి టీడీపీ అభ్యర్థిగా కొత్త వారికి ఛాన్స్
ఇదిలా ఉండగా గత వారంలో మరోసారి పుట్టపర్తికి వెళ్లేందుకు జేసీ ప్రభాకర్ రెడ్డి ప్రయత్నించారు. దీంతో పల్లె శిబిరం కూడా అప్రమత్తమై జేసీ ప్రభాకర్ రెడ్డిని అడ్డుకునేందుకు సమాయత్తమైంది. జేసీ గో బ్యాక్ అంటూ నినాదాలు చేస్తూ రోడ్లపైకి వచ్చారు పల్లె వర్గీయులు. ఈ సందర్భంగా ఇరు వర్గాల మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుని ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఇది పసిగట్టిన పోలీసులు రెండు వర్గాలను చెదరగొట్టి శాంతి భద్రతలను నెలకొల్పారు. మరోవైపు అనంతపురం నుంచి పుట్టపర్తికి ప్రభాకర్ రెడ్డి బయలుదేరగానే మార్గమధ్యలో రాప్తాడు నియోజకవర్గం మరూరు టోల్ ప్లాజా దగ్గర అరెస్టు చేశారు. అనంతరం సొంత పూచీకత్తుపై వదిలిపెట్టారు. నేతలు ఇద్దరూ మీడియా సమావేశాలు ఏర్పాటు చేసి ఒకరిపై ఒకరు విమర్శలు ప్రతి విమర్శలు చేసుకున్నారు. పుట్టపర్తి నియోజకవర్గం తెలుగుదేశం అభ్యర్థిగా కొత్త ముఖాలు రాబోతున్నాయని పల్లె రఘునాథ్ రెడ్డికి చుక్కెదురు అవుతుందంటూ జేసీపీఆర్ చేసిన వ్యాఖ్యలు పల్లె శిబిరంలో ఆగ్రహాన్ని తెప్పించాయి.
బాలయ్య డైలాగ్స్ వర్సెస్ అల్లు అర్జున్ డైలాగ్స్
తానేమీ తక్కువ కాదంటూ పల్లె మీడియా ముందుకు వచ్చి తాడిపత్రిలో జేసీ ప్రభాకర్ రెడ్డికి టికెట్ రాబోదని జోస్యం చెప్పారు. ఎందుకంటే స్వతహాగా యాభై మీటర్లు కూడా నడవలేని ప్రభాకర్ రెడ్డికి టికెట్ రాబోదని వ్యంగ్యాస్త్రాలు విసిరారు. పైగా పల్లె రఘునాథ్ రెడ్డిని ఇప్పటి వరకు ఒకవైపే చూశావు త్వరలోనే రెండో వైపును చూస్తావని బాలయ్య డైలాగులు పేల్చారు. ఇకపై తన మీద మాటల దాడికి దిగితే నేను కూడా విమర్శలకు దిగాల్సి వస్తుందంటూ దీటుగా జవాబిచ్చారు. ఈ విషయంలో తగ్గేది లేదంటూ పుష్ప డైలాగు అందుకున్నారు. ఇలా ఉమ్మడి అనంతపురం జిల్లాలో ఒకే పార్టీలో నాయకుల మధ్య మాటల యుద్ధం జరుగుతుండడంతో రాజకీయ వేడి రోజు రోజుకీ పెరుగుతుంది. ఈ విమర్శలు కాస్త చిలికిచిలికి గాలివానలా మారి రాబోయే ఎన్నికల్లో ఎవరి కొంప ముంచుతుందో అంటూ కిందిస్థాయి కార్యకర్తలలో ఆందోళన వ్యక్తమవుతోంది.