Telangana BJP : కొంచెం ఇష్టం.. కొంచెం కష్టం ! మిశ్రమ ఫలితాలతో తెలంగాణ బీజేపీలో పెద్దగా కనిపించని ఉత్సాహం !
హిమాచల్ ప్రదేశ్‌తో పాటు ఉపఎన్నికల్లో ఓడిపోవడంతో తెలంగాణ బీజేపీ నేతల్లో పెద్దగా ఉత్సాహం కనిపించలేదు. దేశమంతా బీజేపీ వైపు ఉందని గట్టిగా చెప్పుకోలేకపోతున్నారు.
Telangana BJP : రెండు రాష్ట్రాల్లో ఘన విజయాలు సాధించి మొత్తం ప్రజలు మోదీ వైపు ఉన్నారని.. తెలంగాణలోనూ అలాంటి విజయాల్ని నమోదు చేస్తామని ధీమాగా ప్రకటించుందామనుకున్న తెలంగాణ బీజేపీకి హిమాచల్ ప్రదేశ్ ఎన్నికల ఫలితాలు మింగుడు పడనివ్వలేదు. అలాగే ఉపఎన్నికల్లోనూ మిశ్రమ ఫలితాలు వచ్చాయి. దీంతో తెలంగాణ బీజేపీ నేతలు అనుకున్నతంగా విజయోత్సవాల్ని నిర్వహించుకోలేకపోయారు. గుజరాత్ ఎన్నికల ప్రభావం తెలంగాణపై ఉంటుందనుకుంటే.. మరి హిమాచల్ ప్రభావం ఉండదా అన్న ప్రశ్న దూసుకొస్తోంది.
గుజరాత్ విజయం మోదీ మార్క్ !
గుజరాత్‌లో ఏడు సార్లు బీజేపీ వరుసగా గెలవడానికి ప్రధాన కారణం.. మొదట మోదీ.. తర్వాత ఇతర పార్టీల్లో ముఖ్యమంత్రి స్థాయి అభ్యర్థి లేకపోవడం. గుజరాత్ కాంగ్రెస్ పార్టీలో ఇమేజ్ ఉన్న ఒక్క నాయకుడు కూడా లేరు. మోదీ కాకపోతే ఎవరు అన్నదానికి సమాధానం లేదు. అందుకే ప్రజలు మోదీని చూసే ఆదరిస్తున్నారు. ఇప్పుడు కూడా అదే జరిగింది. ఇటీవల ఎన్నికల్లో గుజరాత్‌లో మోదీ ఎక్కువ సమయం కేటాయించి ప్రచారం నిర్వహించారు. అతి సుదర్ఘమైన రోడ్ షోలు నిర్వహించారు. తానే ముఖ్యమంత్రి అభ్యర్తి అన్న స్థాయిలో కష్టపడ్డారు. మోదీని దేశానికి ప్రధానిగా వెళ్లినా .. ఆయనే తమ ప్రైడ్ అని.. గుజరాతీలు నమ్మకం పెట్టుకున్నారు. ఆ ఫలితమే భారీ విజయం.
హిమాచల్ ప్రదేశ్‌లో చేజారిన అధికారం- ఉపఎన్నికల్లోనూ ఎదురుదెబ్బ !
ఒక్క గుజరాత్ మినహా బీజేపీ మంచి ఫలితాలు రాలేదు. ఢిల్లీ మున్సిపల్ ఎన్నికల్లో పదిహేనేళ్ల తర్వాత ఓడిపోయారు. హిమాచల్ ప్రదేశ్‌లో అధికారాన్ని పోగొట్టుకున్నారు. యూపీ, రాజస్థాన్, చత్తీస్‌ఘడ్‌లలో జరిగిన ఉపఎన్నికల్లో పరాజయం పాలయ్యారు. దీంతో బీజేపీ శ్రేణుల్లో అనుకున్నంత జోష్ కనిపించడం లేదు. ఆయా రాష్ట్రాల్లోని స్థానిక పరిస్థితుల కారణంగానే పరాజయం పాలయ్యామని బీజేపీ నేతలు విశ్లేషిస్తున్నారు. అయితే అలాంటి పరిస్థితులే తెలంగాణలో ఉన్నాయని టీఆర్ఎస్ నేతలు కౌంటర్ ఇస్తున్నారు.
గుజరాత్‌లో మోదీ తరహాలో తెలంగాణలో కేసీఆర్ కటౌట్ !
తెలంగాణలో టాల్ లీడర్‌గా కేసీఆర్ ఉన్నారు. తెలంగాణ అంటే కేసీఆర్.. కేసీఆర్ అంటే తెలంగాణ. గుజరాత్ సలో ప్రజలు మోదీని తమ మనిషఇగా ఎలా చూస్తారో తెలంగాణ ప్రజలు అలా చూస్తారు. మోదీకి అంత ఆదరణ లేదు. లోకల్ లీడర్లతో కేసీఆర్‌తో పోటీ పడే ఇమేజ్ ఉన్న నేత లేరు. తెలంగాణలో గత ఎన్నికల్లో బీజేపీకి వచ్చింది కేవలం ఏడు శాతం ఓట్లు. వందకు పైగా స్థానాల్లో డిపాజిట్ కోల్పోయింది. ఇప్పుడు కూడా పరిస్థితి మెరుగుపడిందన్న వాదన ఉంది. కానీ ఇతర పార్టీల నుంచి వచ్చిన బలమైన అభ్యర్థులు ఉన్న చోటే బీజేపీ ప్రబావం చూపిందని ఎక్కువ మంది గుర్తు చేస్తున్నారు.
ఆ ఎన్నికల ఫలితాలతో తెలంగాణలో బూమ్ రాదు !
ఎలా చూసినా గుజరాత్ ఎన్నికల ఫలితాలతో.. తెలంగాణ బీజేపీకి కొత్తగా వచ్చే జోష్ ఏమీ ఉండదు. ఇంకా చెప్పాలంటే.. కర్ణాటక ఎన్నికల ఫలితాలతో బీజేపీకి ఉత్సాహమో..నిరాశే రావొచ్చు. వచ్చే ఏప్రిల్, మే నెలల్లో కర్ణాటక ఎన్నికలు జరగనున్నాయి. దక్షిణాదిలో బీజేపీ అధికారంలో ఉన్న ఏకైక రాష్ట్రం కర్ణాటక. అక్కడ గెలిస్తే బీజేపీలో ఉత్సాహం రావొచ్చు.