Food Delivery on Horse: గుర్రపు స్వారీతో జొమాటో ఫుడ్ డెలివరీ, విపరీతంగా వీడియో వైరల్!
Zomato Viral News: రెండు మూడు రోజుల పాటు పెట్రోల్ దొరకదు అన్న ఒక్కవార్త హైదరాబాద్ మొత్తాన్ని షేక్ చేసిన సంగతి తెలిసిందే.
Horse Riding in Hyderabad: హైదరాబాద్ లో ఓ ఫుడ్ డెలివరీ బాయ్ వ్యవహరించిన తీరు బాగా వైరల్ అవుతోంది. అతను గుర్రం మీద వెళ్తూ ఫుడ్ డెలివరీ చేయడం అక్కడ చూస్తున్నవారిని బాగా ఆకట్టుకుంది. మంగళవారం (జనవరి 3) హైదరాబాద్ లో పెట్రోల్ కోసం వాహనదారులు ఇబ్బందులు పడిన సంగతి తెలిసిందే. పెట్రోల్ బంక్ వద్ద లైన్‌లో నిలబడిన ఓ జొమాటో డెలివరీ బాయ్ ఇక తనకు పెట్రోల్ దొరకదని భావించి.. బయటికి వచ్చేశాడు. ఇక విసుగుచెంది వాహనాన్ని పక్కన పెట్టేసి.. తన గుర్రాన్ని ఆశ్రయించాడు. అనంతరం గుర్రంపై వెళ్లి ఫుడ్ పార్సిల్ అందించాడు. ఇది హైదరాబాద్ చంచల్‌గూడ చుట్టుపక్కల జరిగినట్లుగా భావిస్తున్నారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా చక్కర్లు కొడుతోంది.
రెండు మూడు రోజుల పాటు పెట్రోల్ దొరకదు అన్న ఒక్కవార్త హైదరాబాద్ మొత్తాన్ని షేక్ చేసిన సంగతి తెలిసిందే. పెట్రోల్ బంకుల దగ్గర బైకులు, కార్లతో ప్రజలు బారులు తీరటంతో ట్రాఫిక్ కష్టాలు ఓ రకం కాదు. గంటల తరబడి క్యూలో నిలబడినా పెట్రోల్ దొరకకపోవటంతో చాలా మంది ఇళ్లకే పరిమితం అయ్యారు. జొమాటో, స్విగ్గీ లాంటి ఫుడ్ డెలివరీ యాప్స్ ఇదిగో ఇలా విన్నూత్న పద్ధతులు పాటించాల్సి వచ్చింది. పెట్రోల్ సమస్య అనేది చిరుద్యోగులపై బాగా ప్రభావం చూపించింది.
పెట్రోల్ కొరత లేదన్న బంకుల డీలర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్
తెలంగాణలో ట్రక్ డ్రైవర్ల సమ్మె వల్ల రాష్ట్రంలో పెట్రోల్, డీజిల్ కొరత ఏర్పడిందనే వదంతులు ఊపందుకోవడంతో దీనిపై పెట్రోల్ బంక్ డీలర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ అమరేందర్ రెడ్డి క్లారిటీ ఇచ్చారు. తెలంగాణలో పెట్రోల్ బంకుల్లో ఎలాంటి ఇంధన షార్టేజ్ లేదని చెప్పారు. కేంద్ర ప్రభుత్వం తెచ్చిన చట్టానికి వ్యతిరేకంగా నిన్న (జనవరి 1) ట్యాంకర్ల డ్రైవర్లు సమ్మె చేశారని చెప్పారు. ఈరోజు వారితో మాట్లాడి సమ్మె విరమించామని వివరించారు.
ఇంకా తెలంగాణ పెట్రోల్ బంక్ డీలర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ అమరేందర్ రెడ్డి మాట్లాడుతూ.. ‘‘అప్పటికే కొన్ని పెట్రోల్ బంకుల్లో స్టాక్ అయిపోవడంతో నో స్టాక్ బోర్డు పెట్టారు. దీంతో గందరగోళం నెలకొంది. ఈరోజు రాత్రి వరకు అన్ని బంకులకు స్టాక్ వస్తుంది. ప్రజలు ఎవరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. రోజూ రెండు డిపోల నుండి 40 లక్షల లీటర్ల డీజిల్, పెట్రోల్ సప్లై అవుతుంది. పెట్రోల్ బంకులు బంద్ అవుతున్నాయని సోషల్ మీడియాలో ప్రచారం చేశారు అందువల్లే ప్రజలు పెట్రోల్ బంకుల వద్ద బారులు తీరారు. మరో మూడు గంటల్లో యథావిధిగా పెట్రోల్ బంకుల్లో డీజిల్ పెట్రోల్ అందుబాటులో ఉంటుంది’’ అని తెలిపారు.