Guntur Roads: గుంతల రోడ్డుపై పడిపోయిన వైసీపీ కార్పొరేటర్, బండికి నెంబర్ ప్లేట్ కూడా లేదు - ఫొటోతో స్థానికులు ట్రోలింగ్
రాజకీయ పార్టీలు రోడ్ల సమస్యపై ఉద్యమాలు చేస్తుంటే, సామాన్యులు కూడా తమ అవస్థలపై సోషల్ మీడియాలో వాస్తవాలను పోస్ట్ చేసేందుకు ప్రయత్నిస్తున్నారు.
ఏపీలో రోడ్ల పై విపక్షాలతో పాటు ప్రజల నుంచి పెద్ద ఎత్తున ఆందోళన వ్యక్తం అవుతుంది. రాజకీయ పార్టీలు రోడ్ల సమస్యపై ఉద్యమాలు చేస్తుంటే, సామాన్యులు కూడా తమ అవస్థలపై సోషల్ మీడియాలో వాస్తవాలను పోస్ట్ చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. తాజాగా గుంటూరు నగరంలో వైసీపీకి చెందిన కార్పోరేటర్ రోడ్డు మీద వెళుతూ గుంతలు పడిన రోడ్డులో కింద పడిపోయారు. దీంతో ఈ వ్యవహరం ఇప్పుడు స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. అధికార పార్టీకి చెందిన కార్పోరేటర్ కావటంతో ఆయన్ను కూడా జనం స్థానికంగా ట్రోల్ చేసేస్తున్నారు. రోడ్డు మీద పడిన వెంటనే ఆయన్ను స్థానికులు కొందరు పక్కకు జరిపి సహాయం చేసి సపర్యలు చేశారు. ఇంతలో మరి కొందరు స్పాట్ నుంచి ఫొటోలు తీసి సోషల్ మీడియాలో ప్రచారం చేశారు. దీంతో గుంటూరులో ఈ వ్యవహరం చర్చనీయాంశంగా మారింది.
ఉదయాన్నే ఘటన... నిమిషాల్లో ఫొటోలు వైరల్
మంగళవారం ఉదయాన్నే గుంటూరు నగరంలోని పొన్నూరు రోడ్ లో ఇది జరిగింది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన బాషా, గుంటూరు నగర పాలక సంస్థలో 11వ వార్డు కార్పొరేటర్ గా వ్యవహరిస్తున్నారు. ఉదయాన్నే బాషా పొన్నూరు రోడ్డు మీదగా ద్విచక్ర వాహనంపై వెళ్తుండగా గుంతలో జారిపడ్డారు. శీతాకాలం అయినప్పటికీ వాతావరణంలో మార్పులు రావటంతో గుంటూరు నగరంలో తెల్లవారుజాము నుండి లైట్ గా వర్షం పడుతుంది. ఆపై రోడ్ల మీద గుంతలు కూడా ఉండటంతో వాహనం స్కిడ్ అయ్యి, కార్పోరేటర్ బాషా కింద పడిపోయారు. ఉదయం కావటంతో వాహనాల రద్దీ చాలా తక్కువగా ఉంది. దీంతో పెద్ద ప్రమాదం తప్పిందని స్థానికులు అంటున్నారు. ఇది జరిగిన వెంటనే స్థానికంగా ఉన్న కొందరు కార్పొరేటర్ బాషాను రోడ్డు మీద నుండి పక్కకు తీసుకువచ్చి సపర్యలు చేశారు. ఇదే సమయంలో రోడ్ల దుస్థితిపై ప్రజా ప్రతినిధులు, స్థానిక ఎమ్మెల్యే పట్టించుకోవటం లేదని స్థానికులు మాట్లాడటంతో కార్పొరేటర్ బాషా నవ్వుతూ ఉండిపోయారు. తాను కూడా అధికార పార్టీలో ఉండటంతో ఏమీ మాట్లాడలేకపోయారు. కార్పొరేటర్ కూడా రోడ్డు ప్రమాదానికి గురికావటంతో స్థానికులు ఆయనను కలసి విచారం వ్యక్తం చేశారు. నేడు కార్పొరేటర్ కి ఎదురైన అనుభవం, ప్రజలకు జరగకుండా వెంటేనే రోడ్ల నిర్మాణం చేపట్టాలని స్థానికులు కోరారు.
గుంటూరులో నెంబర్ ప్లేట్ వాహనాలు..
మరో వైపున గుంటూరు నగరంలో వాహనాలకు నెంబర్ ప్లేట్ లు లేకుండా ఇష్టానుసారంగా తిరిగేస్తున్నాయని స్థానికులు అంటున్నారు. తాజాగా ప్రమాదానికి గురయిన కార్పొరేటర్ బాషా వాహనానికి కూడా నెంబర్ ప్లేట్ లేదని స్థానికులు చెబుతున్నారు. ఈ విషయంలో పలుమార్లు పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవటం లేదంటున్నారు. కార్పొరేటర్ వాహనానికి కూడా నెంబర్ ప్లేట్ లేకుండా తిరుగుతున్నారని, స్థానికులు కార్పొరేటర్ తోనే నవ్వుతూ చమత్కరించారు. దీనికి కూడా కార్పొరేటర్ బాషా నవ్వుతూనే తన దుస్తులకు అంటిన మట్టిని దులుపుకొని అక్కడ నుండి నిష్క్రమించారు.
వైరల్ గా ఫొటోలు...
గుంటూరు నగరంలో అధికార పార్టీకి చెందిన కార్పొరేటర్ బాషా గుంతల రోడ్డులో పడి ప్రమాదానికి గురి కావటంతో సంఘటన ఫొటోలు చేసిన స్థానికులు వాట్సాప్, గ్రూపుల్లో పెద్ద ఎత్తున ప్రచారం చేశారు. దీంతో ఈ ఫొటోలతో పెద్ద ఎత్తున ట్రోల్ చేస్తున్నారు. రోడ్ల దుస్థితిపై సోషల్ మీడియాలో ట్రోలింగ్ జరగడంతో, రోడ్ల దుస్థితిని ట్యాగ్ చేస్తూ ప్రచారం చేస్తున్నారు.