Wrestlers Protest : ఇందుకేనా మేము పతకాలు తెచ్చింది, క్రిమినల్స్‌లా చూస్తారా? - కన్నీళ్లు పెట్టుకున్న వినేష్ ఫోగట్
Wrestlers Protest: పోలీసులు తమను క్రిమినల్స్‌లా చూస్తున్నారని రెజ్లర్ వినేష్ ఫోగట్ భావోద్వేగానికి లోనయ్యారు.
Wrestlers Protest:
అర్ధరాత్రి ఉద్రిక్తత
రెజ్లర్లు నిరసనలు చేస్తున్న జంతర్‌మంతర్ వద్దకు అర్ధరాత్రి పోలీసులు రావడం ఘర్షణకు దారి తీసింది. పోలీసులు, ఆందోళనకారుల మధ్య వాగ్వాదం జరిగింది. తమపై పోలీసులు దాడి చేశారని రెజ్లర్లు ఆరోపిస్తున్నారు. ఈ ఘర్షణలో కొందరికి గాయాలయ్యాయి. ఈ క్రమంలోనే ఎలాంటి ఉద్రిక్తతలు చోటు చేసుకోకుండా పోలీసులు అప్రమత్తమయ్యారు. జంతర్ మంతర్ వద్ద భద్రతను కట్టుదిట్టం చేశారు. ఈ గొడవ తరవాత తొలిసారి మీడియా ముందుకు వచ్చారు వినేష్ ఫోగట్. లైవ్‌లోనే కన్నీళ్లు పెట్టుకున్నారు. పోలీసులు తమపై ఉద్దేశపూర్వకంగానే దాడి చేశారని ఆరోపించారు. న్యాయం కోసం పోరాడుతున్న తమ పట్ల ఇంత కఠినంగా వ్యవహరించాల్సిన అవసరం ఏముందని ప్రశ్నించారు. "ఇది చూడడానికేనా మేం దేశం కోసం పతకాలు తీసుకొచ్చింది" అంటూ తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. అంతే కాదు. కొందరు పోలీసులు మద్యం మత్తులో వచ్చి తమపై దాడి చేశారని ఆరోపించారు.
"ఇలాంటివి చూసేందుకేనే మేం పతకాలు తీసుకొచ్చింది..? పోలీసుల్లో కొందరు మద్యం మత్తులో ఉన్నారు. కావాలనే దాడి చేశారు. మమ్మల్ని కొందరు తోసేశారు. చాలా రఫ్‌గా హ్యాండిల్ చేశారు. మేమేం క్రిమినల్స్‌మి కాదు. మమ్మల్ని అలా చూడకండి. అయినా మమ్మల్ని అడ్డుకోవడానికి మహిళా పోలీసులు రావాలి. కానీ అందరూ మగవాళ్లే వచ్చారు. ఇందులో అర్థమేంటి..? మహిళా పోలీసులు ఎందుకు రాలేదు..? కొందరు నన్ను వేధించారు. మా మెడల్స్ అన్నీ వెనక్కి తీసుకోవాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం"
- వినేష్ ఫోగట్, రెజ్లర్
#WATCH | Delhi: If this is how the wrestlers will be treated, what will we do with the medals? Rather we will live a normal life & return all the medals & awards to the Indian Government: Wrestler Bajrang Punia at Jantar Mantar pic.twitter.com/mvXqqiFVpR
— ANI (@ANI) May 4, 2023
ఇదీ జరిగింది..
ఇప్పటికే ఢిల్లీ పోలీసులు జంతర్ మంతర్ వద్ద ఆంక్షలు విధించారు. ఎవరూ నిరసన జరుగుతున్న చోటుకు రావద్దని హెచ్చరించారు. పలువురు రాజకీయ నేతలు వచ్చి రెజ్లర్లకు మద్దతుగా నిలవడం వల్ల అక్కడ ఉద్రిక్తత చోటు చేసుకుంటోంది. భారత రెజ్లింగ్ సమాఖ్య (డబ్ల్యూఎఫ్ఐ) అధ్యక్షుడు బ్రిజ్ భూషణ్ సింగ్‌పై లైంగిక ఆరోపణలు చేస్తూ... ఢిల్లీలోని జంతర్‌మంతర్ వద్ద కొన్ని రోజులుగా ఆందోళనలు చేస్తున్నరెజ్లర్లకు పోలీసుల మధ్య అర్ధరాత్రి ఘర్షణ చోటుచేసుకుంది. బుధవారం (మే 3) రాత్రి 11 గంటల సమయంలో పోలీసులు తమపై దాడి చేశారని, అసభ్య పదజాలంతో దూషించారని ఆందోళనకారులు ఆరోపిస్తున్నారు. మాలవ్య నగర్‌కు చెందిన ఆప్ ఎమ్మెల్యే సోమనాథ్ భారతిని ఆందోళనకారుల కోసం మంచాలను తీసుకురాగా ఆయనను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. భారతి అనుమతి లేకుండా మడత మంచాలతో ఆ ప్రాంతానికి చేరుకున్నారని ఢిల్లీ పోలీసులు తెలిపారు. మరోవైపు, పోలీసులతో జరిగిన ఘర్షణలో తన సోదరుడు గాయపడ్డాడని రెజ్లర్ గీతా ఫోగట్ ఆరోపించారు. "రెజ్లర్లపై పోలీసులు చేసిన దాడిలో నా తమ్ముడు దుష్యంత్ ఫోగట్ తలకు గాయమైంది, మరో రెజ్లర్ కూడా గాయపడ్డాడు. ఇది చాలా సిగ్గుచేటు" అని గీతా ఫోగట్ ట్వీట్ చేశారు.
Also Read: World Press Freedom Index: పత్రికా స్వేచ్ఛ సూచీలో మరింత దిగజారిన భారత్, 180 దేశాల్లో 161వ స్థానం