Wagner Group: పుతిన్‌కి కట్టప్పలాంటోడు ఇప్పుడు ఎదురు తిరిగాడు, తొక్కుకుంటూ పోతాం అని వార్నింగ్ - ఇగో హర్ట్ అయిందట
Wagner Group: ఉక్రెయిన్‌లో రష్యా తరపున పోరాటం చేసిన వాగ్నర్ సైన్యం పుతిన్‌పై తిరుగుబాటుకి సిద్ధమైంది.
Wagner Group Rebellion:
పుతిన్‌పై తిరుగుబాటు
రష్యా అధ్యక్షుడు పుతిన్ పొరుగు దేశమైన ఉక్రెయిన్‌ను ఆక్రమించుకోవాలని ఏడాదిన్నరగా యుద్ధం చేస్తున్నారు. పక్క దేశం సంగతి సరే. మరి సొంతింటి పరిస్థితేంటి..? అదే రష్యా గురించి ఆలోచిస్తున్నారా...అని? ఉక్రెయిన్‌పై సైనిక చర్య మొదలు పెట్టిన తరవాత సొంత దేశంలోనే వ్యతిరేకత వచ్చింది పుతిన్‌పై. "ఏం సాధించడానికి ఈ యుద్ధం" అని కొందరు నేరుగానే ప్రశ్నించారు. కానీ అవేమీ పట్టించుకోలేదు పుతిన్. పైగా ఉక్రెయిన్‌పై పోరాడేందుకు స్పెషల్‌గా ఓ మిలిటరీనే సిద్ధం చేశాడు. ఇన్నాళ్లు ముందుండి పోరాడిని అదే సైన్యం...ఇప్పుడు ఉన్నట్టుండి గన్‌ని వెనక్కి తిప్పి రష్యాపైనే గురి పెట్టింది. మొత్తం దేశాన్ని షాక్‌కి గురి చేసింది. ఇన్నాళ్లూ చాలా నమ్మకంగా ఉన్న ఆ సైన్యాధిపతి కూడా బాహుబలిని వెన్నుపోటు పొడిచిన కట్టప్పలా మారిపోయాడు. "మా సైనికులపైనే దాడులు చేసి...మమ్మల్నే మోసం చేస్తారా" అని గట్టిగానే ప్రశ్నిస్తున్నారు. అటు రష్యా సైన్యం మాత్రం "తిరుగుబాటుని" సహించేది లేదని తేల్చి చెబుతోంది. ఈ కారణంగా రష్యా-ఉక్రెయిన్ యుద్ధం ఊహించని మలుపు తిరిగింది. పోరాడే వాళ్లు లేకుండా రష్యా ఉక్రెయిన్‌పై ఏం యుద్ధం చేస్తుంది మరి...?
తొక్కుకుంటూ పోతాం..
పుతిన్ అంతగా ముచ్చటపడి మరీ తయారు చేసుకున్న ఆ సైన్యమే Wagner Group Military Company. దీన్ని లీడ్ చేసేది యెవ్‌గెని ప్రిగోరిన్ (Yevgeny Prigozhin). పుతిన్‌పై తిరుగుబాటు చేస్తున్నట్టు ఓ ఆడియో క్లిప్ కూడా విడుదల చేశాడు ప్రిగోరిన్. "మేం పని మొదలు పెట్టాం. పూర్తి చేసే తీరతాం. మా దారిలో అడ్డొచ్చేది ఏదైనా తొక్కుకుంటూ వెళ్లిపోతాం" అని తేల్చి చెప్పాడు. అటు రష్యా మిలిటరీ అప్రమత్తమై కీలక ప్రాంతాల్లో పెద్ద ఎత్తున సైన్యాన్ని మొహరిస్తోంది.
అసలేంటీ..వాగ్నర్ గ్రూప్..
Wagner Group. దీన్నే PMC Wagnerగానూ పిలుస్తారు. రష్యాలో పారామిలిటరీ ఆర్గనైజేషన్ ఇది. రష్యా చట్టాలకు లోబడి పని చేస్తుందీ సైన్యం. ఇదో ప్రైవేట్ మిలిటరీ. ఉక్రెయిన్‌లో రష్యాకు అనుకూలంగా ఉద్యమం చేసిన వేర్పాటు వాదులకు 2014లో అండగా నిలిచిందీ సైన్యం. ఆఫ్రికా, మిడిల్ ఈస్ట్‌లోనూ యాక్టివ్‌గా ఉంది. ఈ మిలిటరీలో దాదాపు 5 వేల మంది సైనికులున్నట్టు అంచనా. అయితే...యూకే మాత్రం ఈ సైన్యంలో 50 వేల మంది ఉంటారని చెప్పింది. ఉక్రెయిన్‌లో రష్యా సైనిక చర్యలో వీళ్లే పోరాటం చేశారు. రష్యాలో వీళ్లకు సూపర్ ఫైటర్స్ అని పేరు. కానీ అంతర్జాతీయంగా మాత్రం ఎన్నో ఆరోపణలు ఎదుర్కొంది. ఆఫ్రికా సహా సెంట్రల్ ఆఫ్రికన్ రిపబ్లిక్, లిబియా, మాలిలో మానవ హక్కుల ఉల్లంఘనకు పాల్పడ్డారన్న వాదనలున్నాయి.
తిరుగుబాటు ఎందుకు..?
ఈ ఏడాది జనవరి నుంచి మొదలైంది గొడవ. ఉక్రెయిన్‌లోని పలు కీలక ప్రాంతాలు రష్యా అధీనంలోకి రావడానికి తామే కారణమని ప్రకటించుకున్నాడు వాగ్నర్ గ్రూప్ చీఫ్ ప్రిగోరిన్. కానీ..రష్యా మిలిటరీ మాత్రం తమకు పేరు రాకుండా కుట్ర చేస్తోందని ఆరోపించారు. అంతే కాదు. బక్‌ముత్ రీజియన్‌ని ఆక్రమించిన సమయంలో రష్యా మిలిటరీ కనీసం తమకు ఆయుధాలు కూడా ఇవ్వలేదని మండి పడ్డారు. వాగ్నర్ గ్రూప్‌లోని కొందరు సైనికులు రష్యా సైన్యాన్ని తిడుతూ వీడియోలు కూడా విడుదల చేశారు. తాము లేకపోతే ఉక్రెయిన్‌పై పైచేయి సాధించడం రష్యా వల్ల కాకపోయేదని తేల్చి చెబుతున్నాడు ప్రిగోరిన్. ఇగో హర్ట్ చేసినందుకే యుద్ధం ప్రకటించామని వెల్లడించాడు.
Also Read: US Visit: మ్యాజిక్ చేసిన మోదీ, భారీ పెట్టుబడులు ప్రకటించిన గూగుల్ & అమెజాన్