Donald Trump: దేవుడు తోడు, సెక్యూరిటీ సిబ్బంది తెగువతోనే మీ ముందుకొచ్చా- ట్రంప్ భావోద్వేగ ప్రసంగం
Donald Trump News: దేవుడి దయ, సెక్యూరిటీ సిబ్బంది తెగువతో తాను ప్రాణాలతో బయటపడ్డాను అన్నారు డొనాల్డ్ ట్రంప్. అటాక్ తర్వాత తొలిసారిగా ఆయన ప్రజలనుద్దేశించి మాట్లాడారు.
Donald Trump Speech: అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తనపై దాడి జరిగిన తర్వాత తొలిసారిగా ప్రజలనుద్దేశించి ప్రసంగించారు. నవంబర్‌లో జరిగే అధ్యక్ష ఎన్నికల్లో భారీ విజయం సాధించబోతున్నానని ట్రంప్ ధీమా వ్యక్తం చేశారు. గురువారం (జులై 19) మిల్వాకీలో జరిగిన రిపబ్లికన్ నేషనల్ కన్వెన్షన్‌లో ఆఖరి రోజు సమావేశంలో ట్రంప్ పాల్గొన్నారు. ఈ సమావేంలో మాట్లాడిన ట్రంప్ అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ టార్గెట్ చేసి తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
మరో నాలుగు నెలల్లో అఖండ విజయం సాధిస్తామని, మొత్తం అమెరికాకు తానే అధ్యక్షుడిగా ఉంటానని ట్రంప్ ధీమా వ్యక్తం చేశారు. "నా శరీరం మొత్తం రక్తంతో నిండిపోయింది. కానీ నేను సురక్షితంగా బయటపడ్డాను. దేవుడు నాతో ఉన్నందునే మీ ముందు ఇలా నిలబడగలిగాను." అని ట్రంప్ తనపై జరిగిన దాడిని ప్రస్తావిస్తూ ఈ కామెంట్స్ చేశారు. ట్రంప్‌పై దాడి చేసిన థామస్ మాథ్యూస్ క్రూక్స్ అనే వ్యక్తిని సీక్రెట్ సర్వీస్ అక్కడికక్కడే హతమార్చింది.
దేవుడి దయతో మీ ముందు నిలబడ్డా: డొనాల్డ్ ట్రంప్
ఆఖరి క్షణంలో తాను తలను ఊపకపోయి ఉంటే హంతకులు వదిలిన బులెట్ నేరుగా తన తలకు తగిలేదన్నారు ట్రంప్. ఇవాళ మీతో నేను ఉండేవాడిని కాదన్నారు. సర్వశక్తిమంతుడైన దేవుని దయవల్ల నేను ఈ స్టేజ్‌పై మీ ముందు నిలబడ్డాను అని అన్నారు. ఇది కీలక పరిణామమని చాలా మంది అభిప్రాయపడుతున్నారు.
సీక్రెట్ సర్వీస్ ఏజెంట్లకు ట్రంప్ కృతజ్ఞతలు
సగం అమెరికన్ల మనుసు గెలుచుకోవడంలో కిక్ ఉండదనే మొత్తం అమెరికా గెలుచుకోవడానికే అధ్యక్షుడిగా పోటీ చేస్తున్నాను అని ట్రంప్ అన్నారు. పెద్ద రిస్క్ చేసి తన ప్రాణాలను కాపాడిన ఏజెంట్లు గొప్ప వ్యక్తులు అని అభిప్రాయపడ్డారు. 'నమ్మకం, ప్రేమతో మీరు ఇచ్చిన అమెరికా అధ్యక్ష పదవీ నామినేషన్‌ను సగర్వంగా స్వీకరిస్తున్నాను. వచ్చే నాలుగేళ్లు అమెరికా చరిత్రలోనే సువర్ణాక్షరాలతో లిఖించేవి అవుతాయి. ఎన్ని అడ్డంకులు ఎదురైనా అమెరికాను గొప్ప దేశంగా తీర్చి దిద్దుతాం" అంటూ రిపబ్లికన్ సదస్సు చివరి రోజు డొనాల్డ్ ట్రంప్ భావోద్వేగ ప్రసంగం చేశారు.
ఈ సమావేశాలకు వచ్చిన చాలామంది కూడా ట్రంప్‌ను అనుసరించి కుడిచెవికి బ్యాండేజ్ కట్టుకునే వచ్చారు.