Burqa Ban News: బురఖా ధరించడంపై నిషేధం, అతిక్రమించిన వారికి భారీగా జరిమానాలు- జనవరి 1నుంచి అమలు
Switzerland Bans Burqa: మరో యూరోపియన్ దేశం స్విట్జర్లాండ్ సైతం బురఖా ధరించడాన్నినిషేధించింది. బహిరంగ ప్రదేశాల్లో మహిళలు ముఖాన్నికప్పి ఉంచరాదన్న చట్టాన్ని అమల్లోకి తెచ్చింది.
Switzerland Bans Burqa: స్విట్జర్లాండ్‌లో బురఖాపై నిషేదం అమల్లోకి వచ్చింది. బహిరంగ ప్రదేశాల్లో ముఖాన్ని కప్పుకుంటే ఇకపై భారీగా జరిమానాలు విధించనున్నారు. జనవరి 1నుంచి ఈ నియమం అమల్లోకి వచ్చింది. దీంతో బురఖాను నిషేధించిన ఏడో యూరోపియన్ దేశంగా స్విట్జర్లాండ్ నిలిచింది. ఒకవేళ నిబంధనలు ఉల్లంఘిస్తే...వెయ్యి స్విస్ ప్రాంక్‌లు జరిమానా కట్టాల్సి ఉంటుంది. మనదేశ కరెన్సీలో చూసుకుంటే సుమారు 98 వేల రూపాయల వరకు జరిమానా కట్టాల్సి ఉంటుంది. బహిరంగ ప్రదేశాల్లో బురఖా నిషేధించండంపై 2021లోనే ఈదేశంలో ప్రజాభిప్రాయ సేకరణ నిర్వహించారు. దాదాపు 51.21 శాతం మంది పౌరులు బురఖా నిషేధానికి అనుకూలంగా ఓటు వేశారు. దీంతో బురఖా నిషేధిస్తూ ఈ దేశం చట్టం చేసింది. ఈ చట్టం ఈ ఏడాది జనవరి 1 నుంచి అమల్లోకి వచ్చింది. స్విట్జర్లాండ్ కంటే ముందే బెల్జియం, ఫ్రాన్స్, డెన్మార్క్, ఆస్ట్రియా, నెదర్లాండ్స్, బల్గేరియా దేశాల్లో బురఖాపై నిషేధం అమల్లో ఉంది. ఈ చట్టం అమల్లోకి వచ్చిన తర్వాత బహిరంగ ప్రదేశాల్లో, పబ్లిక్ ట్రాన్స్‌పోర్టు, రెస్టారెంట్లు, షాపుల్లో మహిళలు తమ ముఖాన్ని పూర్తిగా కప్పి ఉంచుకోకూడదు. ఈ నిబంధనలను అతిక్రమిస్తే జరిమానా కట్టాల్సి ఉంటుంది.
ముస్లింల తీవ్ర వ్యతిరేకత
బురఖాపై నిషేధం విధించడాన్ని ముస్లిం సంస్థలు, హక్కుల కార్యకర్తలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. దాదాపు 8.85 మిలియన్ల జనాభా ఉన్న స్విట్జర్లాండ్‌లో ముస్లింలు 5 శాతం మాత్రమే ఉన్నారు. మొత్తం జనాభాలో కనీసం పది శాతం కూడా లేనివాళ్లపై ప్రజాభిప్రాయ సేకరణ జరపడమే తప్పని వారు వాదిస్తున్నారు. మైనార్టీల హక్కులను కాలరాస్తున్నారని మండిపడ్డారు. దేశంలోజీవిస్తున్నఇతర మతస్తుల సంప్రదాయాలను అందరూ గౌరవించాలని కోరుతున్నారు.ముస్లిం మహిళలు బురఖా దరించడం ఇస్లాం సంప్రదాయంలో భాగమన్నారు. కావున మైనార్టీ మహిళలను గౌరవించాలని వారి సంప్రదాయాలు వారు పాటించుకునే విధంగా స్వేచ్ఛ కల్పించాలని డిమాండ్ చేసస్తున్నారు.
బురఖా నిషేధంపై ప్రజాభిప్రాయ సేకరణ
బురఖాపై నిషేధం విధించాలని స్విస్ ప్రజలు ఎప్పటి నుంచో కోరుతున్నారు. దీంతో 2021 లో బురఖా వినియోగంపై ఈ దేశ ప్రభుత్వం ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టగా....51.21 శాతం మంది ప్రజలు నిషేధాన్ని కోరుకున్నారు. 2022 సంవత్సరంలో దేశ జాతీయ కౌన్సిల్ ఈ చట్టాన్ని ఆమోదించింది. 2025 జనవరి 1నుంచి స్విస్‌లో ఈచట్టం అమల్లోకి వచ్చింది.. దీంతో ఇక్కడి ముస్లిం మహిళలు నోరు,ముక్కు,చెవులను పూర్తిగా కప్పి ఉంచడానికి వీల్లేదు. ఎవరైనా ఈచట్టాన్ని ఉల్లంఘిస్తే భారీగా జరిమనా చెల్లించాల్సి వస్తుంది.
మినహాయింపు
బహిరంగ ప్రదేశాల్లో బురఖాపై నిషేధం అమల్లోకి వచ్చినా.... విమానాల్లో లేదా దౌత్య, కాన్సులర్ ప్రాంగణాల్లో ఈ నిషేధం అమల్లోకి రాదని అక్కడి ప్రభుత్వం తెలిపింది. మతపరమైన ప్రదేశాలు, ఇతర పవిత్ర ప్రదేశాల్లోనూ ముఖాన్ని పూర్తిగా కప్పుకోవచ్చు. ఆరోగ్యం, భద్రతా కారణాలు, సాంప్రదాయ ఆచారాలు లేదా వాతావరణ పరిస్థితుల దృష్ట్యా ఫేస్ కవర్లు అనుమతించబడతాయని ప్రభుత్వం తెలిపింది. ఈ బురఖా నిషేధాన్ని విమర్శించేవాళ్లతోపాటు స్వాగతించే వాళ్లూ ఉన్నారు. పాతకాలపు సంప్రదాయాల పేరిట మహిళల స్వేచ్చను హరిస్తున్నారని....కనీసం వారు తమ ఇష్టానుసారం జీివించే హక్కు లేకుండా చేశారని....మండిపడ్డారు. ఇప్పుడు ఈ నిషేధం అమల్లోకి రావడంతో వారంతా స్వేచ్ఛగా జీవించవచ్చని అంటున్నారు.