Sudan Starvation Deaths: సుడాన్‌లో ఆకలి చావులు, 60 మంది చిన్నారుల మృత్యువాత
Sudan Starvation Deaths: అంతర్గత పోరుతో సుడాన్ దుర్భర పరిస్థితులు నెలకొన్నాయి. చిన్నారులు ఆకలికి తట్టుకోలేక ప్రాణాలు వదులుతున్నారు.
Sudan Starvation Deaths: సైన్యం, పారామిలిటరీ బలగాల మధ్య పోరుతో సుడాన్ దేశంలో దుర్భర పరిస్థితులు నెలకొన్నాయి. ఇరు వర్గాల ఆధిపత్య పోరు ప్రజల పాలిట శాపంగా మారింది. లక్షలాది మంది సుడాన్ వాసులు వలసలు పోతున్నారు. వందలాది మంది ప్రాణాలు వదులుతున్నారు. తినడానికి తిండి కూడా దొరకని పరిస్థితి నెలకొంది. ఆకలి చావులు అక్కడ నిత్యకృత్యమయ్యాయి. తాజాగా సుడాన్ రాజధాని ఖార్తూమ్ లోని ఓ అనాథ శరణాలయం నుంచి వెలుగులోకి వచ్చిన దృశ్యాలు ప్రతి ఒక్కరినీ కలచివేస్తున్నాయి. చిన్నారులకు పట్టడానికి పాలు కూడా లేకపోవడంతో మంచి నీటిని తాగిస్తున్నారు. దీంతో కనీస ఆహారం అందక పసికందులు అనారోగ్యానికి గురై, వైద్య సాయం అందక ప్రాణాలు కోల్పోతున్నారు.
ఆరు వారాల్లో 60 మంది చిన్నారులు మృతి
ఆరు వారాల వ్యవధిలో రాజధాని నగరం ఖార్తూమ్ లోని అనాథ శరణాలయంలో 60 మంది పసికందులు, చిన్నారులు చనిపోయారు. అందులో 26 మంది రెండ్రోజుల వ్యవధిలోనే చనిపోయినట్లు అంతర్జాతీయ మీడియా సంస్థలు కథనాలు ఇస్తున్నాయి. వారికి తగిన ఆహారం లభించకపోవడం, అనారోగ్యానికి గురైన పసికందులకు వైద్య సాయం అందకపోవడం వల్ల ఈ మరణాలు సంభవించాయి. అనాథ శరణాలయ సిబ్బంది, మరణ ధ్రువీకరణ పత్రాల్లోని వివరాల ఆధారంగా ఈ విషయాన్ని నిర్ధారించాయి అంతర్జాతీయ మీడియా వర్గాలు. కొన్ని దృశ్యాల్లో మృతి చెందిన చంటి బిడ్డలను ఖననం చేసేందుకు తెల్లటి షీట్లలో చుట్టి ఉంచినట్లు కనిపించింది. ఒక గదిలో నేలపై పదుల సంఖ్యలో పసి పిల్లలు ఉండగా.. వారిలో కొందరు పసికందులు ఏడుస్తూనే ఉన్నారు. వారి ఆకలి తీర్చేందుకు ఓ మహిళ రెండు జగ్గుల నిండా నీటిని తీసుకెళ్లి వారికి తాగించడం సుడాన్ లోని దుర్భర పరిస్థితికి అద్దం పడుతోంది.
'ఈ దుస్థితి వస్తుందని ముందే ఊహించాం'
ఇది దేశంలో నెలకొన్న విపత్కర పరిస్థితి. సైన్యం, పారామిలిటరీ బలగాల మధ్య అంతర్యుద్ధం మొదలైన మొదటి రోజే ఈ దుస్థితి వస్తుందని ఊహించినట్లు అనాథ శరణాలయ వాలంటీర్ ఒకరు తెలిపారు. సుడాన్ లో నెలకొన్ని పరిస్థితులపై సోషల్ మీడియాలో తీవ్ర ఆగ్రహం వ్యక్తం అవుతోంది. యూనిసెఫ్, రెడ్ క్రాస్ సహకారంతో స్థానిక ఛారిటీ సంస్థ మే 28న ఆహారం, మెడిసిన్, బేబీ ఫార్ములాను సరఫరా చేసింది. అయితే ఖార్తూమ్ అనాథ శరణాలయంలో ఉన్న చిన్నారులను వెంటనే అక్కడి నుండి తరలించకపోతే మరణాలు మరింతగా పెరిగే ప్రమాదం ఉందని అక్కడి సిబ్బంది తెలిపారు.
ఆధిపత్య పోరుతో సూడాన్ అతలాకుతలం
సైన్యం, పారామిలిటరీ బలగాల మధ్య ఆధిపత్య పోరుతో సూడాన్ అతలాకుతలం అవుతోంది. స్థానికంగా భారీ స్థాయిలో ఘర్షణలు, దాడులు జరుగుతున్నాయి. ఈ విపత్కర పరిస్థితుల నేపథ్యంలో లక్షలాది మంది సూడాన్ వాసులు సొంత ప్రాంతాలను వీడి వలసలు పోతున్నారు. చాలా మంది సూడాన్ వీడి ఇతర దేశాలకు శరణార్థులుగా వెళ్తున్నారు. ఈ ఘర్షణల్లో వేలాది మంది చనిపోయినట్లు తెలుస్తోంది. ఇందులో చిన్నారుల సంఖ్య తక్కువేం లేదని అంతర్జాతీయ మీడియా అంటోంది.