Sri Lanka Crisis: ఆర్థికంగా ఇంకా కోలుకోని శ్రీలంక- చైనాకు కోతులను అమ్ముతున్న ద్వీప దేశం
Sri Lanka Crisis: ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్న శ్రీలంక పరిస్థితి ఆసరాగా చేసుకుని చైనా ఓ ప్రతిపాదన చేసింది. శ్రీలంకలో మాత్రమే కనిపించే కోతులను తమ దేశానికి ఎగుమతి చేయాలని కోరినట్లు తెలుస్తోంది.
Sri Lanka Crisis: భారత దేశ పొరుగు దేశాలైన శ్రీలంక, పాకిస్థాన్ ఆర్థిక సంక్షోభంతో కొట్టుమిట్టాడుతున్నాయి. పాకిస్థాన్ ఇప్పటికే దివాళా తీయగా, శ్రీలంక ఇంకా తేరుకోలేదు ద్రవ్యోల్బణం తీవ్రస్థాయికి చేరుకోవడంతై ఆ దేశ ప్రజలు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. నిత్యావసర సరకులు కూడా దొరకలేని పరిస్థితి దాపురించింది. రోజురోజుకూ పరిస్థితి మరింత దిగజారుతోంది. ఈ దుస్థితిలో శ్రీలంక సహాయ కోసం ఇతర దేశాల వైపు చేయి చాస్తోంది. అయితే శ్రీలంక పరిస్థితి ఆసరాగా చేసుకుని చైనా ప్రభుత్వం ఓ ప్రతిపాదన చేయగా అది కాస్త ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.
శ్రీలంకలో మాత్రమే కనిపించే అరుదైన టోక్ మకాక్ కోతుల్ని లంక ప్రభుత్వం చైనాకు ఎగుమతి చేయాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. శ్రీలంక చైనాకు పంపించాలనుకుంటున్న ఆ కోతులు అంతరించిపోయే జాతుల జాబితాలో ఉన్నట్లు IUCN చెబుతోంది. కానీ శ్రీలంక ఇప్పటికే ఆర్థికంగా చితికిపోయింది. శ్రీలంక దుర్భర పరిస్థితి ఆసరాగా తీసుకున్ చైనా తన అవసరాలు తీర్చుకుంటున్నట్లు తెలుస్తోంది. శ్రీలంక నుండి ఏకంగా లక్ష కోతులను దిగుమతి చేసుకోవడానికి చైనా ప్రభుత్వం ప్రతిపాదన పెట్టింది. ఇంత భారీ సంఖ్యలో కోతుల్ని దిగుమతి చేసుకోవాలని చైనా అనుకోవడంపై ప్రపంచవ్యాప్తంగా అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. శ్రీలంక నుండి దిగుమతి చేసుకోవాలనుకునే కోతులను ప్రయోగాల కోసం వాడుకుంటుందని అంటున్నారు. చైనా ప్రతిపాదనపై శ్రీలంక ప్రభుత్వం తీవ్రంగా ఆలోచిస్తోంది.
శ్రీలంక నుండి లక్ష కోతులను చైనాకు పంపించే విషయంపై అధ్యయనం చేయాలని శ్రీలంక వ్యవసాయశాఖ మంత్రి మహింద అమరవీర సంబంధిత అధికారులను ఆదేశించినట్లు వార్తలు రావడం చర్చనీయాంశంగా మారింది. శ్రీలంకలో టోక్ మకాక్ కోతులు సంఖ్య ఎక్కువగా ఉందని, లక్ష కోతులను చైనాకు పంపడం వల్ల జరిగే నష్టం ఏమీలేదని చైనా విజ్ఞప్తిని పరిగణనలోకి తీసుకోవచ్చని మహింద ఆలోచిస్తున్నట్లు సమాచారం. ఈ కోతులను ప్రయోగాల కోసం అని కాకుండా జంతు ప్రదర్శనశాలలో ఉంచుతారని మహింద అమరవీర వెల్లడించారు. కోతులను చైనాకు ఇస్తే న్యాయపరమైన చిక్కులేమైనా వస్తాయా అనే విషయాలపై అధ్యయనం చేయాలని కేబినెట్ అనుమతితో ఓ కమిటీని నియమించి అధ్యయనం చేయించాలని నిర్ణయించారు.
ప్రస్తుతం శ్రీలంకలో టోక్ మకాక్ కోతుల సంఖ్య 30 లక్షలకు పైగా ఉన్నట్లు తెలుస్తోంది. ఇవి స్థానిక పంటలకు తీవ్ర నష్టాన్ని తీసుకువస్తున్నట్లు అధికారులు చెబుతున్నారు. వీటి సంతతిని నియంత్రించేందుకు ఎన్ని చర్యలు చేపట్టినా ఫలితం ఉండటం లేదని, ఇటువంటి సమయంలో చైనా ఆ కోతులను కోరడంతో శ్రీలంక ప్రభుత్వం కూడా ఆ కోతులను పంపించేందుకు యోచిస్తున్నట్లు తెలుస్తోంది.
శ్రీలంక మంత్రి మహింద చెబుతున్నట్లు ఆ కోతులను చైనా జూలలో ఉంచుతుందా లేదా ప్రయోగాల కోసం వాడుతుందా అనేది తెలియాల్సి ఉంది. అలాగే ఈ కోతులను ఉచితంగా ఇస్తారా.. లేదా వాటి ధర ఎంతగా నిర్ణయిస్తారు అనే ప్రశ్నలకు సమాధానం తెలియాల్సి ఉంది. టోక్ మకాక్ కోతుల సంఖ్య విపరీతంగా పెరిగిపోయి పంటను నష్టపరుస్తున్నట్లు శ్రీలంక ప్రభుత్వం చెబుతోంది. మరోవైపు ఈ జాతి కోతులు అంతరించిపోయే దశలో ఉన్నాయని ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ కన్జర్వేషన్ ఆఫ్ నేచర్ చెబుతోంది.