Qatar Summons Indian Ambassador : బీజేపీ నాయకుల వివాదాస్పద వ్యాఖ్యలు, భారత రాయబారికి ఖతార్ సమన్లు
Qatar Summons Indian Ambassador : మహమ్మద్ ప్రవక్తపై బీజేపీ నాయకులు చేసిన వివాదాస్పద వ్యాఖ్యలను ఖతార్ దేశం ఖండించింది. ఈ మేరకు భారత రాయబారి దీపక్ మిట్టల్ ను వివరణ కోరింది. భారత ప్రభుత్వం ఈ వ్యాఖ్యలపై ఖండించాలని కోరింది.
Qatar Summons Indian Ambassador : కాన్పూర్ అల్లర్ల వివాదానికి కారణమైన బీజేపీ అధికార ప్రతినిధి నుపుర్ శర్మ, దిల్లీ మీడియా హెడ్ నవీన్ జిందాల్ ను ఆ పార్టీ అధిష్ఠానం సస్పెండ్ చేసింది. మతపరమైన అభ్యంతరకర వ్యాఖ్యలు ఎవరు చేసిన ఉపేక్షించమని బీజేపీ స్పష్టం చేసింది. అయితే మహమ్మత్ ప్రవక్తపై నుపుర్ శర్మ చేసిన వ్యాఖ్యలపై ఖతార్ ప్రభుత్వం అభ్యంతరం తెలిపింది. ప్రవక్తపై చేసిన వ్యాఖ్యలను ఉపసంహరించుకోవాలని, ఇందుకు భారత ప్రభుత్వం బహిరంగంగా ఖండించాలని కోరింది. ఈ మేరకు ఖతార్ విదేశాంగ మంత్రిత్వ శాఖ భారత రాయబారి దీపక్ మిట్టల్‌కు అధికారిక నోట్ అందించింది. ప్రవక్త మహమ్మద్‌పై బీజేపీ నాయకులు చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నట్లు నోట్ లో పేర్కొంది. ఈ వ్యాఖ్యలు ఖండిస్తున్నట్లు వెల్లడించింది. దీనిపై మిట్టల్ స్పందిస్తూ ఈ ట్వీట్లు భారత ప్రభుత్వ అభిప్రాయాలను ప్రతిబింబించవని తెలిపారు. అవి వ్యక్తిగత అభిప్రాయాలు అని తెలిపారు.
బీజేపీ నాయకుల వ్యాఖ్యలు ఖండించిన ఖతార్
“విదేశాంగ శాఖ సహాయ మంత్రి సోల్తాన్ బిన్ సాద్ అల్-మురైఖీ ఈ నోట్‌ని రిపబ్లిక్ ఆఫ్ ఇండియా రాయబారికి అందజేశారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ముస్లింలందరినీ ఆగ్రహానికి గురిచేసే విధంగా బీజేపీ నేతలు చేసిన వ్యాఖ్యలను ఖండిస్తున్నాం. వారిని బీజేపీ అధిష్ఠానం సస్పెండ్ చేసినట్లు బీజేపీ చేసిన ప్రకటనను ఖతార్ స్వాగతించింది" అని ఖతార్ విదేశాంగ మంత్రిత్వ శాఖ అన్నారు. ప్రపంచవ్యాప్తంగా రెండు బిలియన్లకు పైగా ముస్లింలు ప్రవక్త మహమ్మద్ మార్గాన్ని అనుసరిస్తున్నారని, ఆయన శాంతి, అవగాహన, సహనం, సందేశంగా... ప్రపంచవ్యాప్తంగా ఉన్న ముస్లింలు అనుసరించే వెలుగు రేఖగా ఉంటుందని నోట్ లో సూచించింది.
అది భారత ప్రభుత్వ అభిప్రాయం కాదు
ఖతర్ లో భారత రాయబార కార్యాలయ ప్రతినిధి మాట్లాడుతూ, “భారతదేశంలోని వ్యక్తులు మతపరమైన వ్యక్తిత్వాన్ని కించపరిచే కొన్ని అభ్యంతరకరమైన ట్వీట్లకు సంబంధించి ఆందోళనలు జరిగాయి. ఆ ట్విట్‌లు భారత ప్రభుత్వ అభిప్రాయాలను ఏ విధంగానూ ప్రతిబింబించవు" అని తెలియజేశారు. మహమ్మద్ ప్రవక్తపై చేసిన వ్యాఖ్యల కారణంగా బీజేపీ తన జాతీయ అధికార ప్రతినిధి నుపుర్ శర్మను సస్పెండ్ చేసింది. ఢిల్లీ మీడియా హెడ్ నవీన్ కుమార్ జిందాల్‌ను బహిష్కరించింది. ఈ సమస్యపై గొడవను తగ్గించడానికి ప్రయత్నించింది. ఈ వ్యాఖ్యలపై ముస్లిం సంఘాల నిరసనల చేయడంతో బీజేపీ ఓ ప్రకటన చేసింది. బీజేపీ అన్ని మతాలను గౌరవిస్తుందని, ఏదైనా మతపరమైన వ్యక్తిని అవమానించడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్లు పేర్కొంది.
వ్యాఖ్యలు ఉపసంహరించుకున్న శర్మ, జిందాల్
ఎవరి మత భావాలను దెబ్బతీయాలనేది తమ ఉద్దేశం కాదని శర్మ, జిందాల్ తమ వ్యాఖ్యలను ఉపసంహరించుకున్నారు. "మన నాగరికత వారసత్వం, భిన్నత్వంలో ఏకత్వం బలమైన సాంస్కృతిక సంప్రదాయాలకు అనుగుణంగా, భారత ప్రభుత్వం అన్ని మతాలకు అత్యున్నత గౌరవాన్ని ఇస్తుంది. కించపరిచే వ్యాఖ్యలు చేసిన వారిపై ఇప్పటికే కఠిన చర్యలు తీసుకున్నాం’’ బీజేపీ పేర్కొంది. "అన్ని మతాల పట్ల గౌరవం, ఏదైనా మతపరమైన వ్యక్తిత్వాన్ని అవమానించడం లేదా ఏదైనా మతం, వర్గాన్ని కించపరచడం వంటి వాటిని ఖండిస్తూ సంబంధిత వర్గాలు ఒక ప్రకటనను కూడా విడుదల చేశాయి" అని భారత రాయబార కార్యాలయం తెలిపింది.