PM Narendra Modi: ప్రవాస భారతీయులపై ప్రధాని నరేంద్ర మోదీ ప్రశంసలు
PM Narendra Modi praises expatriate Indians : ప్రవాస భారతీయులపై ప్రధాని నరేంద్ర మోదీ ప్రశంసలు వర్షం కురిపించారు. ఎక్స్ వేదికగా ఎన్‌ఆర్‌ఐల సేవలను మెచ్చుకుంటూ ప్రధాని మోదీ పోస్ట్ చేశారు.
Prime Minister Narendra Modi Praises Expatriate Indians: ప్రవాస భారతీయులపై ప్రధాని నరేంద్ర మోదీ ప్రశంసలు వర్షం కురిపించారు. యూఏఈలోని అబుదాబిలో అహల్‌లాన్ మోదీ పేరుతో నిర్వహించనున్న ప్రత్యేక కార్యక్రమంలో ప్రధాని మోదీ మంగళవారం పాల్గొననున్నారు. ఈ నేపథ్యంలోనే ఎక్స్ వేదికగా ఎన్‌ఆర్‌ఐల సేవలను మెచ్చుకుంటూ పోస్ట్ చేశారు. ప్రపంచంలోని అనేక దేశాల్లో ఉంటున్న భారతీయులు, భారతి సంతతి ప్రజలపై పొగడ్తలు వర్షం కురిపించారు. ప్రపంచ దేశాలతో భారత్ సంబంధాలను మరింత బలోపేతం చేసేలా ప్రవాసుల కృషి చేస్తున్నారంటూ కొనియాడారు. ప్రపంచ దేశాల్లో విశేషమైన సేవలు అందిస్తున్న ప్రవాసులును చూస్తే తనకు గర్వంగా ఉందంటూ ఆయన కొనియాడారు. అహ్‌లాన్ మోదీ కార్యక్రమంలో వారిని కలిసేందుకు ఆసక్తిగా ఎదురు చూస్తున్నా అంటూ ప్రధాని పోస్ట్‌లో పేర్కొన్నారు. ఈ చిరస్మరణీయమైన కార్యక్రమంలో మీరూ చేరండి అంటూ మోదీ ప్రవాసులకు పిలుపునిచ్చారు.
అతిపెద్ద ప్రవాసుల ఈవెంట్ అన్న ప్రధాని మోదీ
అబుదాబిలో జరిగే అతి పెద్ద భారత డయాస్పోరా(ప్రవాసుల) ఈవెంట్‌గా అహ్‌లాన్ మోదీ కార్యక్రమాన్ని ప్రధాని పేర్కొన్నారు. ఇది జాయెద్ స్పోర్ట్స్ సిటీ స్టేడియంలో జరగనుంది. ఈ కార్యక్రమంలో 35 వేల నుంచి 40 వేల మంది ప్రవాసులు పాల్గొనే అవకాశం ఉందని సమాచారం. ఈ పర్యటనలో భాగంగా ప్రధాని మోదీ యూఏఈ అధ్యక్షుడు షేక్ మహ్మద్ బిన్ జాయేద్ అల్ నహ్వాన్‌తో భేటీ కానున్నారు. అనంతరం అబుదాబిలో నిర్మించిన మొట్టమొదటి హిందూ దేవాలయాన్ని ప్రధాని ప్రారంభించనున్నారు. ఇకపోతే, తాజాగా పర్యటనతో ప్రధాని మోదీ ఏడోసారి పర్యటించనున్నారు. ఇప్పటి వరకు ప్రధానిగా మోదీ ఆరుసార్లు యూఏఈలో పర్యటించారు.
ఖైదీలు విడుదల నేపథ్యంలో మోదీ పర్యటన
ఖతార్‌లో గూఢచర్యం ఆరోపణలపై అరెస్టయిన నౌకాదళ మాజీ అధికారుల ఇటీవల విడుదలయ్యారు. ఈ నేపథ్యంలోనే ప్రధాని మోదీ ఖతార్‌లో పర్యటిస్తున్నారు. మంగళవారం అబుదాబికి వెళ్లనున్న ప్రధాని ఆ తరువాత ఖతార్‌కు వెళతారు. మోదీ తాజా పర్యటన సర్వత్రా ఆసక్తిని కలిగిస్తోంది. ఖతార్‌లో గూఢచర్యం ఆరోపణలతో ఎనిమిది మంది భారత నేవీ అధికారులను ఖతార్ ప్రభుత్వం అరెస్ట్ చేసింది. సుమారు 18 నెలలపాటు ఖతార్‌లో నిర్భందించబడిన నేవీ మాజీ అధికారులు దేశానికి సురక్షితంగా తిరిగి రావడం భారత్ దౌత్యపరంగా సాధించి అతిగొప్ప విజయంగా చెప్పవచ్చు. ఈ క్రమంలో మోదీ ఖతార్ పర్యటన ఆసక్తిని కలిగిస్తోంది. రెండు దేశాల మధ్య అనేక అంశాల్లో ఒప్పందాలకు అవకాశం ఉంటుందని చెబుతున్నారు.
ఖతార్‌తోపాటు అనేక అరబ్ దేశాల్లో వేలాది మంది ప్రవాస భారతీయులు వివిధ హోదాల్లో, అనేక రంగాల్లో పనులు చేస్తున్నారు. వీరిని ఉద్ధేశించి ప్రధాని మోదీ ప్రసంగించే కార్యక్రమాన్ని అబుదాబిలో ఏర్పాటు చేయడం, ఇక్కడ ప్రధాని ప్రసంగించనుండడం పట్ల ప్రపంచ దేశాలు ఆసక్తిగా ఎదురు చూస్తున్నాయి. సదస్సు వెళ్లే ముందుకు ఎక్స్ వేదికగా తన మనసులోని మాటను ప్రధాని పంచుకున్నారు.