సమాధుల్ని తవ్వి మృతదేహాలతో సెల్ఫీ- ఇండోనేషియాలో వింత ఆచారం
ఏటా ఆగస్టు నెల చివర్లో జరిపే ఈ ఉత్సవంలో టోర్జా తెగ వారు మృతదేహాలకు కొత్త దుస్తులు తొడిగి, అవసరమైతే సిగరెట్ లాంటివి కూడా అందించి, ఫోటోలు తీసుకుంటారు.
చావుబతుకులు రెండు కూడా ఒక మహా ప్రయాణంలో భాగమనేది ఆ తెగవారి నమ్మకం. అందువల్ల ఆత్మీయుల మరణం అనేదానిని వారు ఓ విషాదంగా భావించరు. ఈ క్రమంలోనే కనీవినీ ఎరుగని అరుదైన ఆచారాన్ని ఇండోనేషియాలోని టోర్జా తెగ వారు ఏటా పాటిస్తారు. గతంలో మరణించిన తమ ఆత్మీయుల మృతదేహాలను సమాధి నుంచి వెలికితీసి, అలంకరించి పండగ జరుపుకుంటారు.
జీన్స్, టీషర్టులతో మృతదేహాలకు ముస్తాబు
ఏటా ఆగస్టు నెల చివర్లో జరిపే ఈ ఉత్సవంలో టోర్జా తెగ వారు మృతదేహాలకు కొత్త దుస్తులు తొడిగి, అవసరమైతే సిగరెట్ లాంటివి కూడా అందించి, ఫోటోలు తీసుకుంటారు. అలంకరించడం మాత్రమే కాదు, వారితో మాట్లాడుతున్నట్లుగా, ఆహారం తినిపిస్తున్నట్లుగా నటిస్తూ ఆనందపడతారు. "మా నెనె" గా పిలిచే ఈ ఆచారాన్ని టోర్జా తెగవారు కుటుంబ సభ్యులందరితో కలిపి జరుపుకుంటారు.
మరణించిన వారితో మాటామంతీ
ఈ ఉత్సవం ఏదో ఒక్కరోజుతో ముగిసిపోదు. రోజుల తరబడి తమ ఆత్మీయుల మృతదేహాలను టోర్జా తెగవారు ఇంట్లోనే ఉంచుకుంటారు. కొన్నిసార్లు నెలలపాటు కూడా అలాగే కాలం గడుపుతారు. ఈ కాలంలో వారితో బతికున్న వారితో వ్యవహరించినట్లుగానే ఉంటారు. భోజనం తినిపిస్తారు. కుటుంబ సమావేశాల్లో తమపక్కనే కూర్చోబెట్టుకొని కలిసి మాట్లాడుకుంటారు.
తండోపతండాలుగా పర్యాటకులు
మా నెనె అంటే పూర్వీకుల సంరక్షణ అని అర్థం. సమాధుల నుంచి వెలికితీసిన మృతదేహాలు అంత సులువుగా పాడవ్వవు. ఎందుకంటే... వాటిని ఫార్మలిన్ ద్రావణంలో భద్రపరుస్తారు. 3 రోజుల పాటు జరిగే ఈ ఉత్సవం సందర్భంగా, రంగురంగుల ఆధునిక దుస్తుల్లో ముస్తాబైన మృతదేహాలను చూసేందుకు అనేక దేశాల నుంచి పర్యాటకులు తరలివస్తారు. ఇండొనేషియా ఆధునికతను సంతరించుకుంటున్నప్పటికీ... సులవేసి ప్రాంతంలో మాత్రం ఈ ఆచారం శతాబ్దాలుగా కొనసాగుతోంది. ఈ ఆచారాన్ని పాటించే టోరజాన్స్ తెగ జనాభా 11లక్షలు ఉంటుంది. టోరజాన్స్ అనే పదానికి స్థానిక బుగినీస్ భాషలో ఎగువ ప్రాంతాల్లో ఉండేవారని అర్థం.