Modi-Biden Meet: మోదీ-బైడెన్ భేటీకి ముహూర్తం ఫిక్స్, క్వాడ్ దేశాల భేటీ కూడా.. వైట్ హౌస్ ప్రకటన
సెప్టెంబరు 22న మోదీ వాషింగ్టన్ డీసీకి చేరుకుంటారు. ఆ తర్వాతి రోజు.. అమెరికాలోని ప్రముఖ కంపెనీల సీఈఓలతో సమావేశం అవుతారు.
ప్రధాని మోదీ అమెరికా పర్యటన తేదీలు ఖరారయ్యాయి. ఈ పర్యటనలో భాగంగా ఆ దేశ అధ్యక్షుడు జో బైడెన్‌తో మోదీ ఈ నెల 24న భేటీ కానున్నారు. వీరి సమావేశంపై తేదీ ఖరారు చేసినట్లుగా వైట్ హౌస్ ఓ ప్రకటన విడుదల చేసింది. జో బైడెన్ అమెరికాకు అధ్యక్షుడయ్యాక మోదీ తొలిసారి ఆయనతో భేటీ అవుతున్నారు. ఈ ఇద్దరు దిగ్గజ నేతల భేటీ ద్వారా రెండు దేశాల మైత్రి మరింత బలపడుతుందని వైట్ హౌస్ విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నారు. క్వాడ్బృందాన్ని బలోపేతం చేస్తుందని అభిప్రాయపడ్డారు.
కమలా హ్యారిస్‌తోనూ భేటీ..
అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హ్యారిస్‌తోనూ మోదీ భేటీ కానున్నారు. బైడెన్‌ను కలిసే ఒక రోజు ముందు.. అంటే సెప్టెంబర్ 23న.. మోదీ-హ్యారిస్ సమావేశం జరుగుతుంది. వీరిద్దరి మధ్య కూడా ఇదే తొలి భేటీ కావడం విశేషం. అమెరికా ఉపాధ్యక్ష బాధ్యతలు చేపట్టిన తొలి భారత సంతతి మహిళగా కమలా హ్యారిస్ చరిత్ర సృష్టించిన సంగతి తెలిసిందే.
మోదీ అమెరికా పర్యటన షెడ్యూల్ ఇలా..
సెప్టెంబరు 22న మోదీ వాషింగ్టన్ డీసీకి చేరుకుంటారు. ఆ తర్వాతి రోజు.. అమెరికాలోని ప్రముఖ కంపెనీల సీఈఓలతో సమావేశం అవుతారు. వీరిలో యాపిల్ సీఈఓ టిమ్ కుక్ కూడా ఉంటారని తెలుస్తోంది. మోదీ వాషింగ్టన్‌లో ఉండే సమయానికే.. బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ కూడా అక్కడ పర్యటించనున్నారు. కాబట్టి, వారిద్దరి మధ్య కూడా భేటీ జరిగే అవకాశం ఉంది. 23న సాయంత్రం వాషింగ్టన్ నుంచి ప్రధాని న్యూయర్క్వెళ్లి.. అక్కడ ఐక్యరాజ్య సమితి జనరల్ అసెంబ్లీలో కీలక ప్రసంగం చేయనున్నారు.
24న మోదీ-బైడెన్ మధ్య సమావేశం జరగనుంది. అనంతరం బైడెన్ అధ్యక్షతన క్వాడ్ భేటీ కానుంది. ఇందులో మోదీతో పాటు ఆస్ట్రేలియా ప్రధాని స్కాట్ మారిసన్, జపాన్ప్రధాని యోషి హిదే సుగా పాల్గొననున్నారు. క్వాడ్ దేశాధినేతలు ముఖాముఖిగా సదస్సులో పాల్గొనడం ఇదే తొలిసారి. ఈ ఏడాది మార్చిలో క్వాడ్ నేతల మధ్య తొలి సదస్సు జరిగినా కరోనా కారణంగా ఈ నలుగురు నేతలు వర్చువల్‌గా సమావేశమయ్యారు.
Also Read: కదులుతున్న ట్రైన్‌ని ఎక్కబోయి జారిన మహిళ... చివరికి ఏమైందో చూడండి
Also Read: ఇండియా, ఇండోనేషియా నౌకదళ సంయుక్త విన్యాసాలు... సముద్ర శక్తి పేరిట విన్యాసాల నిర్వహణ