Kim Jong To Russia: రష్యా వెళ్లిన కిమ్, పుతిన్‌తో భేటీ - అసలు అజెండా ఇదీ!
Kim Jong To Russia: రష్యా వెళ్లిన ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్. కొవిడ్ తర్వాత కిమ్ తొలి విదేశీ పర్యటన ఇది.
ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ తన ప్రత్యేక రైలులో సుదీర్ఘ సమయం ప్రయాణించి రష్యా చేరుకున్నారు. కొవిడ్ వ్యాప్తి జరిగిన తర్వాత కిమ్ తొలి విదేశీ ప్రయాణం ఇది. కరోనా వచ్చినప్పటి నుంచి ఆయన దేశం దాటి బయటకు వెళ్లలేదు. దాదాపు నాలుగేళ్ల పాటు ఆయన స్వదేశంలోనే ఉన్నారు. ఇప్పుడు రష్యా పర్యటనకు వెళ్లడంతో ప్రపంచ దేశాల దృష్టి రష్యా అధ్యక్షుడు పుతిన్, కిమ్ భేటీపై పడింది. ఇరు దేశాల మధ్య సంబంధాలకు ఇది వ్యూహాత్మకంగా చాలా ముఖ్యమైన భేటీ అని ఉత్తర కొరియా మీడియా సంస్థ పేర్కొంది. అయితే ఇరువురు నేతలు ఎక్కడ భేటీ అవుతారనే విషయాన్ని రహస్యంగా ఉంచుతున్నారు.
రష్యా, ఉత్తర కొరియా రెండు దేశాలపై అమెరికా, ఐక్యరాజ్య సమితి పలు ఆంక్షలు విధించిన నేపథ్యంలో ఇరు దేశాధినేతలు పరస్పరం కలవడంతో వీరి భేటీపై ప్రాముఖ్యత సంతరించుకుంది. ఈ రెండు దేశాలు కూడా అమెరికా సహా పలు పాశ్చాత్య దేశాలను వ్యతిరేకిస్తున్న సంగతి తెలిసిందే. పుతిన్‌తో జరిగే భేటీలో ఆయుధాల విక్రయం గురించి చర్చించనున్నట్లు సమాచారం. ఉత్తర కొరియా నుంచి ఆయుధాలు కొనాలని రష్యా భావిస్తోంది. ఉక్రెయిన్‌తో యుద్ధం నేపథ్యంలో రష్యాకు ఆయుధాలు కొనడం అనివార్యంగా మారింది. తాను రష్యా పర్యటనకు వెళ్లడం ఉత్తరకొరియా- రష్యాల మధ్య వ్యూహాత్మక సంబంధాల ప్రాముఖ్యతకు ప్రాధాన్యమివ్వడం అని కిమ్ జోంగ్ వెల్లడించారు. ఈ పర్యటన ఇరు దేశాల స్నేహం, సహకార సంబంధాలను మరింత పెంచుతుందని కిమ్ తెలిపినట్లు అక్కడి మీడియా వెల్లడించింది.
కిమ్, పుతిన్‌ల భేటీలో ఐరాస ఆంక్షలు, ఇతర దేశాల నుంచి వస్తున్న దౌత్యపరమైన సమస్యలపై చర్చించనున్నట్లు తెలుస్తోంది. కాగా ఉత్తర కొరియా రష్యాకు ఆయుధాలను విక్రయించకూడదని అమెరికా సహా కొన్ని దేశాలు చెప్తున్నాయి. రష్యాకు ఆయుధాలు విక్రయించొద్దనే మాటకు కట్టుబడి ఉండాలని అమెరికా అధ్యక్షనివాసం వైట్‌హౌజ్ నేషనల్ సెక్యురిటీ అధికారి వెల్లడించారు. వారి భేటీని పరిశీలిస్తున్నామని యూఎస్ విదేశీ వ్యవహారాల శాఖ స్పష్టంచేసింది. అయితే ఒకవేళ ఉత్తర కొరియా రష్యాకు ఆయుధాలు విక్రయిస్తే ఆ దేశాలపై ఇంకా ఆంక్షలు విధించేందుకు తాము సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు.
ఉత్తర కొరియా అధినేత కిమ్ జోంగ్ ఉన్ ప్రయాణించిన రైలు చాలా ప్రత్యేకమైనది. విలాసవంతమైనది. అందులో కిమ్‌కు కావాల్సిన విధంగా అన్నీ అమర్చి ఉంటాయి. ఈ రైలు కేవలం ఆయన ప్రయాణాల కోసం మాత్రమే రూపొందించారు. ఆయన దాదాపు 20 గంటలు ఆ రైలులో ప్రయాణించి మంగళవారం రోజు రష్యాకు చేరుకున్నారు. ఈ రైలుకు భారీగా కవచాలు అమర్చి ఉండడంతో గంటకు కేవలం 50 కిలోమీటర్ల వేగంతో మాత్రమే వెళ్లగలుగుతుంది. కాబట్టి ఎక్కువ సమయం ప్రయాణించాల్సి వచ్చింది. రైలు మంగళవారం ఉదయం రష్యాలోని సరిహద్దు పట్టణమైన ఖాసన్‌కు చేరుకున్నట్లు మీడియాలో వార్తలు వచ్చాయి. పలువురు సీనియర్ అధికారులు కిమ్‌కు స్వాగతం చెప్పినట్లు తెలుస్తోంది. రైలులో కిమ్‌తో పాటు ఆయన అధికారులు, ప్రతినిధులు, సెక్యురిటీ సిబ్బంది, కిమ్ అధికార పార్టీ నేతలు, సైనికాధికారులు రష్యాకు చేరుకున్నారు.