Kerala nurse Nimisha Priya: కేరళ నర్సుకు స్వల్ప ఊరట.. నిమిషా ప్రియా ఉరిశిక్ష వాయిదా వేసిన యెమెన్ ప్రభుత్వం
Kerala Nurse News | కేరళ నర్సు నిమిషా ప్రియా మరణశిక్ష అమలు తాత్కాలికంగా వాయిదా పడింది. భారత్ ప్రయత్నాలతో ఆమె ఉరిశిక్షను యెమెన్ అధికారులు నిలిపివేశారు.

Nimisha Priya execution postponed | కేరళ నర్సు నిమిషా ప్రియ ఉరిశిక్షకు సంబంధించి మరో అప్‌డేట్ వచ్చింది. భారత్ ప్రభుత్వం జరుపుతున్న చర్చలు కొలిక్కి వస్తున్నట్లు కనిపిస్తోంది. కేరళ నర్సు నిమిషా ప్రియ మరణశిక్ష అమలును యెమెన్ ప్రభుత్వం తాత్కాలికంగా వాయిదా వేసింది. ఒక నివేదిక ప్రకారం, నిమిషాకు షెడ్యూల్ ప్రకారం విధించనున్న ఉరిశిక్షను ప్రస్తుతం వాయిదా వేశారు.
జూలై 16న యెమెన్ అధికారులు నిమిషా ప్రియకు ఉరిశిక్ష అమలు చేయాల్సి ఉంది. ఈ కేసు విషయంలో భారత ప్రభుత్వం రంగంలోకి దిగి కేరళ నర్సు ప్రాణాలు కాపాడేందుకు చర్చలు జరుపుతోంది. దాంతో ప్రాథమికంగా నిమిషా ప్రియ ఉరిశిక్ష వాయిదా వేస్తూ యెమెన్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఆమె 2017 నుండి యెమెన్ జైలులో ఉన్నారని తెలిసిందే. యెమెన్ కోర్టు నర్సు నిమిషా ప్రియను హత్య కేసులో దోషిగా నిర్ధారించి ఉరిశిక్ష విధిస్తూ తీర్పునిచ్చింది.
బెడిసికొట్టిన అనస్థీషియా ఇంజెక్షన్
తమ దేశానికి చెందిన పౌరుడు తలాల్ అబ్దో మహదీని హత్య చేసినట్లు నిమిషా ప్రియపై యెమెన్ లో ఆరోపణలు ఉన్నాయి. ఈ కేసులో విచారణ పూర్తయి చివరకు ఆమె దోషిగా తేలింది. తన పాస్‌పోర్ట్‌ను తన వద్ద నుంచి తిరిగి తీసుకోవడానికి అబ్దో మహదీకి అనస్థీషియా ఇంజెక్ట్ చేసింది.అయితే అధిక మోతాదులో మందు డోసేజ్ ఇవ్వడం వల్ల అతను మరణించాడని ఆరోపణలున్నాయి. అనస్థీషియా ఇచ్చింది నర్సు నిమిషా ప్రియ కావడంతో ఈ కేసులో ఆమెకు యెమెన్ కోర్టు మరణశిక్ష విధించింది. అయితే, నిమిషా ఉరిశిక్షను అక్కడి ప్రభుత్వం ప్రస్తుతానికి వాయిదా వేసింది.
STORY | Nimisha Priya's execution postponed
— Press Trust of India (@PTI_News) July 15, 2025
READ: https://t.co/u8elOlQIGU pic.twitter.com/9k64DrnHRW
నిమిషా ప్రియను ఏ చట్టం కింద శిక్షించారు?
యెమెన్‌లో షరియా చట్టం అమలు చేస్తున్నారు. కాబట్టి, ఈ చట్టం కింద నిమిషా ప్రియకు మరణశిక్ష విధించారు ఈ చట్టంలో క్షమాపణకు కూడా ఒక నిబంధన ఉంది. బ్లడ్ మనీ అనే విధానం ద్వారా అది సాధ్యం. దీని ద్వారా హత్యకు పాల్పడిన నిందితులకు క్షమాబిక్ష ప్రసాదిస్తారు. కానీ దీని కోసం అతను మరణించిన వ్యక్తి కుటుంబానికి పరిహారంగా భారీ మొత్తాన్ని చెల్లించాల్సి ఉంటుంది. అక్కడి షరియా చట్టం ప్రకారం నిమిషా ప్రియ కూడా ఉరిశిక్ష తప్పించుకుని జైలు నుంచి విడుదల చేయవచ్చు. కానీ దీని గురించి భారత ప్రభుత్వం చర్యలు చేపట్టింది.
తన భర్త, కుమార్తె భారత్‌కు తిరిగి వచ్చిన తర్వాత నిమిషా ప్రియ యెమెన్‌లో చిక్కుకుంది. ఆమె కేరళలోని పాలక్కాడ్ కు చెందిన మహిళ. నిమిషా ప్రియ దాదాపు 2 దశాబ్దాల కిందట తన భర్త, కూతురితో కలిసి యెమెన్‌కు వెళ్లింది. ఆమె ఇక్కడే పనిచేస్తోంది. యెమెన్‌లో అంతర్యుద్ధం వల్ల 2016లో దేశం విడిచి వెళ్లడంపై నిషేధం విధించారు. అంతకు ముందుగానే ఆమె భర్త, కుమార్తె 2014లోనే భారత్ కు తిరిగొచ్చారు. నిమిషా ప్రియా తిరిగి రాలేక యెమెన్‌లోనే చిక్కుకుపోయింది. ఈ క్రమంలో ఆమెపై 2017లో హత్య ఆరోపణలు వచ్చాయి. చివరికి దోషిగా తేలడంతో కోర్టు మరణశిక్ష విధిస్తూ తీర్పునిచ్చింది.






















