Joe Biden: బీచ్ హౌస్‌లో బిడెన్ ఫ్యామిలీ ఎంజాయ్, ఇంతలో షాకింగ్ సీన్ - హుటాహుటిన అధ్యక్షుడి తరలింపు
వైట్ హౌస్ విడుదల చేసిన ఒక ప్రకటనలో, వెకేషన్ హోమ్ పైన ఉన్న నిషేధిత గగనతలంలోకి ఒక చిన్న విమానం వచ్చి నిబంధనలు ఉల్లంఘించిందని పేర్కొన్నారు.
Plane on Joe Biden Vacation Home: అమెరికన్ ప్రెసిడెంట్ జో బిడెన్ (Joe Biden) భద్రత విషయంలో భారీ పొరపాటు జరిగిన విషయం వెలుగులోకి వచ్చింది. అక్కడి వార్తా పత్రికలు తెలిపిన వివరాల ప్రకారం.. రెహోబోత్ బీచ్ ప్రాంతంలో అకస్మాత్తుగా ఓ చిన్న విమానం నో ఫ్లై జోన్‌లోకి వచ్చింది. జో బిడెన్ డెలావేర్‌లోని రెహోబోత్ బీచ్‌లో తన భార్యతో కలిసి విహార యాత్రలో ఉన్నారు. అదే సమయంలో బిడెన్ వెకేషన్‌లో ఆ ఇంటిపై గుర్తు తెలియని ఓ విమానం కనిపించింది. ఈ ఘటనతో భద్రతా వర్గాలు అప్రమత్తమయ్యాయి. ఆ వెంటనే సీక్రెట్ సర్వీస్ అధికారులు జో బిడెన్‌ను ముందుజాగ్రత్తగా సేఫ్ హౌస్‌కు తరలించారు.
ప్రెసిడెంట్ బిడెన్ భద్రత విషయంలో జరిగిన లోపానికి సంబంధించి వైట్ హౌస్ కూడా ఒక ప్రకటన విడుదల చేసింది. వైట్ హౌస్ విడుదల చేసిన ఒక ప్రకటనలో, వెకేషన్ హోమ్ పైన ఉన్న నిషేధిత గగనతలంలోకి ఒక చిన్న విమానం వచ్చి నిబంధనలు ఉల్లంఘించిందని ప్రకటనలో పేర్కొన్నారు. ఈ ఘటనలో అధ్యక్షుడికి లేదా ఆయన కుటుంబానికి ఎలాంటి ముప్పు వాటిల్లలేదని అన్నారు.
డెలావేర్‌లోని రెహోబోత్ బీచ్‌లో జరిగిన ఘటన గురించి వైట్‌హౌస్ అధికారి ఒకరు మాట్లాడుతూ.. అధ్యక్షుడు బిడెన్, ప్రథమ మహిళ బిల్ బిడెన్ సురక్షితంగా ఉన్నారని వారికి ఎటువంటి హానీ జరగలేదని చెప్పారు.
US Secret Service సీక్రెట్ సర్వీస్ ఏం చెప్పింది?
ప్రెసిడెంట్ జో బిడెన్ భద్రతకు సంబంధించి, సీక్రెట్ సర్వీస్ విడుదల చేసిన ప్రకటన వివరాలు ఇలా ఉన్నాయి. ఆ విమానం నిబంధనలు ఉల్లంఘించి నిషేధిత గగన తలంలోకి ప్రవేశించిందని, తాము వెంటనే స్పందించిన దాన్ని పరిధులు దాటేలా చేశామని యూఎస్ సీక్రెట్ సర్వీస్ ప్రతినిధి ఆంథోనీ గుగ్లీల్మీ తెలిపారు. పైలట్ సరైన రేడియో ఛానెల్‌లో లేరని ప్రాథమిక పరిశోధనలు సూచిస్తున్నట్లు చెప్పారు. పైలట్ NOTAMS (ఎయిర్‌మెన్‌లకు నోటీసు)కి అనుగుణంగా లేడని.. జారీ చేసిన విమాన మార్గదర్శకాలను కూడా పైలట్ పాటించలేదని అన్నారు.
విచారణ జరుపుతున్న ఫెడరల్ ఏజెన్సీ
నిబంధనల ప్రకారం, పైలట్ టేకాఫ్ తీసుకునే ముందు తన రూట్‌లో నో ఫ్లై జోన్ గురించి తెలుసుకోవాలి. ప్రస్తుతం, ఫెడరల్ ఏజెన్సీ ఆ పైలట్‌ను విచారణ చేస్తోంది. వాస్తవానికి, అమెరికా అధ్యక్షుడి ఇల్లు ఎల్లప్పుడూ విమాన నిషేధిత ప్రాంతం. ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ అమెరికా అధ్యక్షుడి వైమానిక భద్రతను నిర్వహిస్తుంటుంది.