సెల్ఫ్ డిఫెన్స్ పేరు చెప్పి ఇజ్రాయేల్ హద్దులు దాటుతోంది, యుద్ధంపై చైనా అసహనం
Hamas Palestine Attack: సెల్ఫ్ డిఫెన్స్ అని చెప్పి ఇజ్రాయేల్ గాజాలో విధ్వంసం సృష్టిస్తోందని చైనా మండి పడింది.
Hamas Palestine Attack:
చైనా విదేశాంగ మంత్రి వ్యాఖ్యలు..
ఇజ్రాయేల్, హమాస్ యుద్ధంపై (Israel Hamas War) చైనా స్పందించింది. సెల్ఫ్ డిఫెన్స్ పేరు చెప్పుకున ఇజ్రాయేల్ గాజాలో ఎన్నో దారుణాలకు పాల్పడుతోందని మండి పడింది. ఆత్మరక్షణ అని బయటకి చెబుతూ గాజాలోని ప్రజలకి శిక్ష వేస్తోందని అసహనం వ్యక్తం చేసింది. ఇప్పటికిప్పుడు యుద్ధాన్ని ఆపేయాలని స్పష్టం చేసింది. చైనా విదేశాంగమంత్రి వాంగ్ యీ (Wang Yi ) ఈ వ్యాఖ్యలు చేశారు. ఇటీవలే అమెరికా సెక్రటరీ ఆఫ్ స్టేట్ ఆంటోని బ్లింకెన్ వాంగ్ యీతో ఫోన్‌లో మాట్లాడారు. ఇజ్రాయేల్, హమాస్ మధ్య జరుగుతున్న ఈ యుద్ధాన్ని నిలువరించేందుకు చొరవ చూపించాలని కోరారు. సౌదీ అరేబియా విదేశాంగ మంత్రి ఫైజల్ బిన్‌తోనూ సంప్రదింపులు జరిగాయి. ఈ యుద్ధంలో ఏ దేశమూ తలదూర్చి మరింత కవ్వించకూడదని, చర్చల ద్వారానే ఈ సమస్యని పరిష్కరించే విధంగా అందరూ ఒక్కటవ్వాలని సూచించారు వాంగ్ యీ. చైనా మీడియా కథనాల ప్రకారం..వచ్చే వారం చైనా దౌత్యవేత్త ఝాయ్ జున్ మధ్యప్రాచ్య దేశాల్లో పర్యటించనున్నారు. ఇజ్రాయేల్, హమాస్ మధ్య ఉద్రిక్తతలు తగ్గించేందుకు అవసరమైన మద్దతుని కూడగట్టనున్నారు. అయితే...ఈ సమస్యకి ఒకటే పరిష్కారం అని స్పష్టం చేశారు వాంగ్ యీ. పాలస్తీనాకి స్వతంత్ర హోదా ఇవ్వాలని అన్నారు. ఐక్యరాజ్య సమితి కూడా ఈ వ్యవహారంలో జోక్యం చేసుకోవాల్సిన అవసరముందని అభిప్రాయపడ్డారు. గత వారం కూడా చైనా ఇదే ప్రకటన చేసింది. తన స్టాండ్ ఏంటో స్పష్టంగా చెప్పింది. వీలైనంత త్వరగా శాంతియుత వాతావరణం నెలకొల్పాలని, అప్పుడే అక్కడి ప్రజల ప్రాణాలకు భద్రత ఉంటుందని చైనా సూచించింది. అటు ఇజ్రాయేల్ మాత్రం చైనాపై అసహనంగా ఉంది. హమాస్ ఉగ్రదాడుల విషయంలో చైనా ఎటు వైపు నిలబడుతుందో అర్థం కావడం లేదని ఆగ్రహం వ్యక్తం చేసింది.
ఇజ్రాయేల్ దౌత్యవేత్తపై దాడి..
చైనాలో ఇజ్రాయేల్ దౌత్యవేత్తపై దాడి జరిగింది. ఓ గుర్తు తెలియని వ్యక్తిని ఉన్నట్టుండి వచ్చి కత్తితో పొడిచాడు. ఇజ్రాయేల్ విదేశాంగ శాఖ ఈ విషయం వెల్లడించింది. ప్రస్తుతానికి బాధితుడికి మెరుగైన వైద్యం అందిస్తున్నట్టు స్పష్టం చేసింది. ఆరోగ్యం నిలకడగా ఉందని తెలిపింది. ఇప్పటికే ఇజ్రాయేల్, పాలస్తీనా మధ్య ఉద్రిక్తతలు పెరుగుతున్నాయి. ఇలాంటి కీలక తరుణంలో ఇజ్రాయేల్ దౌత్యవేత్తపై దాడి జరగడం సంచలనమైంది. ఇప్పటికే ప్రపంచదేశాల్లో ఉన్న ఇజ్రాయేల్ పౌరులను, జూదులను అప్రమత్తం చేశారు. దాడులు జరిగే ప్రమాదముందని హెచ్చరించారు. ఇప్పుడు ఇజ్రాయేల్ దౌత్యవేత్తపై జరిగిన దాడిని టెర్రర్ అటాక్‌గానే భావిస్తున్నారు. ఈ ఘటన తరవాత ఇజ్రాయేల్, చైనా మధ్య ఉద్రిక్తతలు మరింత పెరిగాయి. బీజింగ్‌లోని ఇజ్రాయేల్ దౌత్య కార్యాలయం తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. హమాస్ దాడులను ఖండించకపోగా..ఇలా దాడులు జరుగుతున్నా చైనా పట్టించుకోవడం లేదని మండి పడుతోంది. డ్రాగన్ చాలా ఉదాసీనంగా వ్యవహరించడంపై ఇప్పటికే ఇజ్రాయేల్ ఆగ్రహం వ్యక్తం చేసింది.
Also Read: ఇది కేవలం ముస్లింల సమస్య కాదు, మోదీ సాబ్ కాస్త ఆలోచించండి - పాలస్తీనా వివాదంపై ఒవైసీ