Mariya Ahmed Didi: భారత్ మన ఫ్రెండ్, మాల్దీవుల ప్రభుత్వంపై మాజీ మంత్రి ఫైర్
Maldives Ex Defence Minister: భారత్‌తో విభేదాలపై మాల్దీవులు మాజీ రక్షణ మంత్రి మరియా అహ్మద్ దీదీ స్పందించారు. ప్రధాని నరేంద్ర మోదీపై మాల్దీవుల ప్రభుత్వ ప్రతినిధులు చేసిన వ్యాఖ్యలపై ఆమె మండిపడ్డారు.
Maldives Ex Defence Minister Mariya Ahmed Didi: భారత్‌తో విభేదాలపై మాల్దీవులు మాజీ రక్షణ మంత్రి మరియా అహ్మద్ దీదీ (Mariya Ahmed Didi) స్పందించారు. సోమవారం ఆమె మాట్లాడుతూ.. భారత ప్రధాని నరేంద్ర మోదీ (Narendra Modi)పై మాల్దీవుల ప్రభుత్వ ప్రతినిధులు అవమానకరమైన వ్యాఖ్యలు చేయడంపై ఆమె మండిపడ్డారు. భారత్ నమ్మకమైన మిత్రదేశమని, రక్షణతో సహా వివిధ రంగాలలో సహాయం అందిస్తోందని చెప్పారు. భారతదేశాన్ని "911 కాల్"గా అభివర్ణించారు. భారత్ ఎల్లప్పుడూ అవసరమైన సమయాల్లో రక్షించడానికి వస్తారని అన్నారు. అవమానకరమైన వ్యాఖ్యలపై ఆమె నిరాశ వ్యక్తం చేశారు.
మోదీపై వ్యాఖ్యలు ప్రస్తుత పాలకుల సంకుచిత మనస్తత్వాలకు నిదర్శనమని, తమని అందరితో స్నేహం చేసే చిన్న దేశమని చెప్పారు. భారత్‌తో సరిహద్దులను పంచుకోవడాన్ని తిరస్కరించలేమని, ఇండియా ఎల్లప్పుడూ తమకు సహాయం చేస్తుందన్నారు. రక్షణ రంగంలో సామర్థ్యం పెంపొందించడం, పరికరాలను అందించడం, మమ్మల్ని మరింత స్వయం సమృద్ధిగా మార్చడానికి భారత్ ప్రయత్నిస్తోందని మరియా అహ్మద్ దీదీ చెప్పారు.
అంతర్జాతీయ కట్టుబాట్లు నిలబెట్టుకోవాలి
ప్రజాస్వామ్యం, మానవ హక్కులపై మాల్దీవులు, భారతదేశం ఒకే ఆలోచనతో ఉన్నాయని ఆమె అన్నారు. భారత్‌తో తమకు ఎప్పటి నుంచో ఉన్న పాత సంబంధాన్ని కొనసాగించకుండా ఉండేందుకు మాల్దీవులు ప్రయత్నించడం నిజంగా అవమానకరంగా చూస్తున్నారంటూ అని ఆమె అన్నారు. భారతదేశంతో పురాతన, స్నేహ సంబంధాన్ని కొనసాగించాల్సిన ప్రాముఖ్యతను ఆమె నొక్కిచెప్పారు. రెండు దేశాల మధ్య స్నేహంపై ఇటువంటి వ్యాఖ్యలు ప్రతికూల ప్రభావం చూపే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. మాల్దీవులు అంతర్జాతీయ కట్టుబాట్లను నిలబెట్టుకోవడం చాలా అవసరమని అన్నారు.
ఇండియానే ఫస్ట్
చారిత్రాత్మకమైన "ఇండియా ఫస్ట్" విధానం గురించి మాట్లాడుతూ.. అవసరమైన సమయాల్లో మాల్దీవులకు మద్దతునిచ్చే సమీప పొరుగు దేశం భారత్ అన్నారు. అంతర్జాతీయ కట్టుబాట్లను మాల్దీవుల ప్రభుత్వం గౌరవించాలని, అందరితో స్నేహంగా ఉండాలనే సాంప్రదాయ విదేశాంగ విధానాన్ని కొనసాగించాలని అన్నారు. మాల్దీవులు ఎల్లప్పుడూ ఇండియా ఫస్ట్ విధానాన్ని అనుసరిస్తుందని దానిని పాటించాల్సిన అవసరం ఉందన్నారు. మాల్దీవుల ప్రజలకు అవసరం వచ్చినప్పుడు భారత్ అండగా ఉంటోందని, మాల్దీవులకు ఇండియా అత్యంత సన్నిహిత దేశమని గుర్తించాలని ప్రస్తుత ప్రభుత్వానికి చురకలంటించారు.
కోవిడ్ సాయం మర్చిపోయారా?
మాల్దీవుల ప్రజల మనోభావాలను ప్రస్తుత ప్రభుత్వవం గుర్తించాలని ఆమె కోరారు. భారతదేశంలో వైద్య చికిత్సను కోసం ఎంతో మంది వెళ్తారని, కోవిడ్ సమయంలో భారత్ అందించిన సాయం, కోవిడ్-19 వ్యాక్సిన్‌లను అందించిన సందర్భాలను ఆమె ఉదహరించారు. మాల్దీవులలో వైద్య సదుపాయం అందనప్పుడు, కోవిడ్ ఉన్నప్పుడు భారత్ నుంచి టీకాలు కూడా పొందామని, రెండు దేశాల మధ్య సహకారం ఉండాలని అన్నారు. భారత్ స్థానంలో మరే ఇతర పొరుగువారిని భర్తీ చేయలేమని, అది సాధ్యం కాదని చెప్పారు.
మనం అడిగితేనే వాళ్లు వచ్చారు
మాల్దీవుల్లో భారత సైనికుల ఉనికి గురించి మాట్లాడుతూ.. భారత సైనికులు తమ ప్రభుత్వ అభ్యర్థన మేరకు సహాయం చేయడానికి ఇక్కడకు వచ్చారని అన్నారు. ఇది తమ పౌరులను సురక్షితంగా ఉంచడంలో సహాయపడుతోందని, కానీ దానిని ప్రస్తుత ప్రభుత్వం ఆ కోణంలో చూడకపోవడం విచారకరం అన్నారు. ప్రజలను ద్వీపాల నుంచి మాలేకు తీసుకురావడానికి భారత్ తమకు పూర్తిగా మానవతా ప్రాతిపదికన సాంకేతిక సహాయాన్ని అందించిందని చెప్పారు. మాల్దీవుల్లో హెలికాప్టర్లు. మాల్దీవుల జాతీయ రక్షణ దళం ఆధీనంలో ఉన్నాయని వివరించారు.