US President Election: వాడివేడిగా అమెరికా అధ్యక్ష ఎన్నికలు, కమలా హారిస్ పై ట్రంప్ తీవ్ర విమర్శలు
Donald Trump: రిపబ్లిక్ పార్టీ అధ్యక్ష అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ కమలా హారిస్ పై విరుచుకు పడ్డారు. ఒకవేళ ఆమె ఎన్నికల్లో గెలిస్తే అతివాద అధ్యక్షురాలిగా చరిత్రలో మిగిలిపోతారని ధ్వజమెత్తారు.

US President Election : అమెరికాలో ఈ ఏడాది చివరలో జరగనున్న అధ్యక్ష ఎన్నికల నుంచి జో బిడెన్ వైదొలిగిన విషయం తెలిసిందే. ఆ తర్వాత డొనాల్డ్ ట్రంప్, కమలా హారిస్ మధ్య పోటీ ఖాయమైంది. ఈ పోటీలో అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ఎవరు గెలుస్తారనే దానిపై అనేక వాదనలు వినిపిస్తున్నాయి. కమలా హారిస్, ట్రంప్ మధ్య పోటీపై పలు అభిప్రాయ సేకరణలు వెలువడ్డాయి. నవంబర్ 5న అమెరికాలో అధ్యక్ష ఎన్నికలు జరగనున్నాయి. రిపబ్లికన్ పార్టీ తరఫున డొనాల్డ్ ట్రంప్, డెమొక్రాట్‌ల తరఫున కమలా హారిస్ బరిలో నిలిచారు. ప్రత్యర్థులిద్దరూ పరస్పరం దాడులు చేసుకుంటూనే ఉన్నారు. ఈ క్రమంలో మాజీ అధ్యక్షుడు ట్రంప్ వైస్ ప్రెసిడెంట్ కమలా హారిస్ పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. కమలా హారిస్ అధికారంలోకి వస్తే దేశ చరిత్రలోనే అతివాద అధ్యక్షురాలిగా మిగిలిపోతారంటూ వ్యాఖ్యానించారు.
ఆమె ఓ ఫెయిల్యూర్
ఫ్లోరిడాలో జరిగిన ‘ది బిలీవర్స్ సమ్మిట్’ లో ట్రంప్ ప్రసంగించారు. ఇమ్మిగ్రేషన్, అబార్షన్ సమస్యలపై అతివాదిగా ట్రంప్ అభివర్ణించారు. ఆయన మాట్లాడుతూ.. ‘కమలా హారిస్ కు ప్రజాదరణ పూర్తిగా తగ్గిపోయింది. ఒకవేళ ఆమె గెలిస్తే అత్యంత తీవ్రమైన అతివాద అధ్యక్షురాలిగా అమెరికా చరిత్రలో మిగిలిపోతారు. దేశ ఉపాధ్యక్షురాలిగా ఆమె తన బాధ్యతలను సరిగ్గా నిర్వహించలేదు. దేశంలోకి ఎంతోమంది అక్రమ వలసదారులు ప్రవేశించారు. వారిని హారిస్ అడ్డుకోలేకపోయారు. ఉపాధ్యక్షురాలిగా ఆమె ఒక ఫెయిల్యూర్’ అంటూ ఆమెపై ఆరోపణలు గుప్పించారు.
హారిస్ ను ఓడించడమే లక్ష్యం
ఎన్నికల్లో కమలా హారిస్‌ను ఏకపక్షంగా ఓడించాలని, లేకుంటే ఆమె వామపక్ష భావజాలాన్ని వ్యాప్తి చేస్తారని ఆరోపించారు. కమలా హారిస్‌కు ఓటేయడమంటే అవినీతి, అసమర్థత, బలహీనతకు మద్దతిచ్చినట్లే అవుతుందని ట్రంప్ పేర్కొన్నారు. ఆమె తీవ్రమైన వామపక్ష ఉన్మాది. అధికారంలోకి వస్తే ఆమె ఈ దేశాన్ని సర్వనాశనం చేస్తారు. అత్యంత వామపక్ష డెమోక్రాట్ల సెనేటర్ జాబితాలో కమలా హారిస్ మొదటి స్థానంలో ఉంటారు. వామపక్ష భావజాలాన్ని అమెరికన్లపై బలవంతంగా రుద్దేందుకు వందలాది మంది వామపక్ష న్యాయమూర్తులను నియమిస్తారని ఆయన ఆరోపించారు.
సోషలిజం, మార్క్సిజం, కమ్యూనిజం, మతోన్మాదులు, నేరస్థులు, మానవ అక్రమ రవాణాదారులు, మహిళల అక్రమ రవాణాను నిరోధించడం మన ముందున్న లక్ష్యం అన్నారు. కమలా హారిస్‌ను భారీ మెజార్టీతో ఓడించాలన్నారు. ఈ నవంబర్‌లో భారీ ఓట్ల తేడాతో గెలవాలన్నారు. దేశంలో నెలకొన్న సమస్యలన్నింటిని పరిష్కరిస్తానని ట్రంప్ పేర్కొన్నారు. "హంతకులను, బాల నేరస్తులను మరియు మాదకద్రవ్యాల వ్యాపారులను ప్రతిరోజూ వేలాది మంది మన సరిహద్దులను దాటడానికి హారిస్ అనుమతిస్తారు" అని ట్రంప్ ఆరోపించారు. హంతకులు, నేరస్థులు, అక్రమ చొరబాటుదారులు, ముఠా సభ్యులను దేశం నుండి తరిమివేస్తానని ట్రంప్ హామీ ఇచ్చారు.
ఎన్నికల రేసు నుంచి తప్పుకున్న బైడెన్
కొన్ని రోజుల క్రితం 81 ఏళ్ల జో బిడెన్ ఎన్నికల రేసు నుండి నిష్క్రమిస్తున్నట్లు ప్రకటించి అందరినీ ఆశ్చర్యపరిచారు. అయితే, అధ్యక్షుడు బైడెన్ కమలా హారిస్‌కు తన మద్దతును ప్రకటించారు. జూలై 26న అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా కూడా ఆమెకు మద్దతు పలికారు.
Also Read: Donald Trump: అమెరికా ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్ అభ్యర్థిత్వానికి మద్దతుగా ఒంటరి పురుషులు
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

