China Covid Deaths: షాకింగ్ - చైనాలో నెల రోజుల్లో 60 వేల కరోనా మరణాలు
చైనాలో కేవలం ఒక నెలలో కోవిడ్ కారణంగా దాదాపు 60,000 మంది చనిపోయారని చైనా ఆరోగ్య అధికారులు తెలిపారు.
చైనాలో కరోనా కేసులు విపరీతంగా పెరిగిపోతుంటే అధికారులు మాత్రం ఆంక్షలు విధించడానికి బదులుగా, నిబంధనలు సడలిస్తున్నారు. దాని ప్రభావం కొవిడ్19 మరణాల రూపంలో కనిపించిందని నిపుణులు చెబుతున్నారు. గత నెలలో చైనా జీరో కొవిడ్ విధానాన్ని తొలగించింది. దాంతో కేవలం నెల రోజుల వ్యవధిలో COVID-19 తో దాదాపు 60,000 మంది మరణించారని చైనా తెలిపింది. గతంలో చైనా వెల్లడించిన గణాంకాల కంటే ఈ మరణాలు భారీ పెరుగుదల అని అంతర్జాతీయ మీడియా రిపోర్ట్ చేసింది.
కేవలం ఒక నెలలో కోవిడ్ కారణంగా దాదాపు 60,000 మంది చనిపోయారని చైనా ఆరోగ్య అధికారులు శనివారం (జనవరి 14) ఓ ప్రకటనలో తెలిపారు. గత డిసెంబర్‌లో చైనా ప్రభుత్వం కరోనా ఆంక్షల్ని సడలించింది. అప్పటి నుండి కేవలం 5 వారాల వ్యవధిలో కరోనా మరణాలు వేలాదిగా నమోదు కావడం గమనార్హం. డిసెంబర్ 8, 2022 నుంచి ఈ సంవత్సరం జనవరి 12 తేదీల మధ్య చైనాలో కోవిడ్ సంబంధిత మరణాలు 59,938 నమోదయ్యాయని చైనా నేషనల్ హెల్త్ కమిషన్ మెడికల్ అడ్మినిస్ట్రేషన్ బ్యూరో అధిపతి జియావో యాహుయ్ మీడియాకు తెలిపారు. ఇవన్నీ కేవలం ఆసుపత్రులలో సంభవించిన మరణాలు అని, అనధికారికంగా ఈ సంఖ్య మరింత ఎక్కువగా ఉంటుందని ఆరోగ్య శాఖ నిపుణులు చెబుతున్నారు.
China said nearly 60,000 people with COVID-19 had died in hospital since it abandoned its zero-COVID policy last month, a huge increase from previously reported figures, Reuters reported
— ANI (@ANI) January 14, 2023
అంతర్జాతీయ ప్రయాణికులు ఎవరు చైనా వచ్చినా..ఇకపై క్వారంటైన్‌లో ఉండాల్సిన పని లేదు. నేరుగా వెళ్లిపోయే వెసులుబాటు కల్పించింది. ప్రపంచవ్యాప్తంగా చైనా పరిస్థితులపై ఆందోళన వ్యక్తమవుతున్న తరుణంలో ఆ ప్రభుత్వం ఇలాంటి నిర్ణయం తీసుకోవడం సంచలనమవుతోంది. అటు మిగతా దేశాలు మాత్రం చైనా నుంచి వచ్చే వాళ్లు కచ్చితంగా కొవిడ్ నెగటివ్ రిపోర్ట్ చూపించాల్సిందేనని నిబంధన విధిస్తున్నాయి. నెదర్లాండ్స్, పోర్చుగల్ కూడా ఈ దేశాల జాబితాలో చేరిపోయాయి. చైనాలో విదేశీ ప్రయాణికులపై దాదాపు మూడేళ్లుగా ఆంక్షలు విధిస్తున్నారు. జీరో కొవిడ్ పాలసీలో భాగంగా...తప్పనిసరిగా క్వారంటైన్ చేశారు. కానీ...ఇప్పుడు ఆ రూల్‌ని పక్కన పెట్టేసి అందరికీ వెల్‌కమ్ చెబుతోంది చైనా.
గత నెల జీరో కొవిడ్ పాలసీని ఎత్తేసినప్పటి నుంచి కేసులు దారుణంగా పెరుగుతూ వస్తున్నాయి. ఆసుపత్రుల్లో బెడ్స్ సరిపోవడం లేదు. రోజుల పాటు వెయిట్ చేస్తే తప్ప ఆసుత్రిలో చికిత్స అందని దుస్థితి. ఇక కొవిడ్‌తో మృతి చెందిన వారి అంత్యక్రియలు చేయాలన్నా రోజుల తరబడి ఎదురు చూడాల్సి వస్తోంది. కొవిడ్ మందులకూ కొరత ఏర్పడింది. కొందరు మెడికల్‌షాప్ వాళ్లతో ముందుగానే మాట్లాడుకుని ఒకేసారి పెద్దమొత్తంలో మందులు కొనుగోలు చేస్తున్నారు. ఫలితంగా...మిగతా వాళ్లకు అందక ఇబ్బందులు పడుతున్నారు. అయితే...చైనా మరో వ్యాక్సిన్‌ను సిద్ధం చేస్తోంది. mRNA టీకా టెస్టింగ్ దశలో ఉంది. బూస్టర్ డోస్ కింద ఈ టీకాను అందించనున్నారు. CS-2034 వ్యాక్సిన్ ప్రత్యేకించి ఒమిక్రాన్ సబ్ వేరియంట్స్‌ను అంతం చేసేందుకేనని చైనా చెబుతోంది. ప్రస్తుతం అక్కడ ఈ వేరియంట్స్‌తోనే కేసులు అధికంగా నమోదవుతున్నాయి.