Bangladesh Crime News: బంగ్లాదేశ్‌లో మరో హిందూ యువకుడి హత్య, తీవ్ర గాయాలతో మృతదేహం లభ్యం
Bangladesh Hindu youth Murder | బంగ్లాదేశ్‌లో మైనారిటీగా ఉన్న హిందువులపై హింస కొనసాగుతోంది. సమీర్ కుమార్ దాస్ అనే ఆటో డ్రైవర్‌ను కొందరు గుర్తుతెలియని దుండగులు హత్య చేశారు.

పొరుగుదేశం బంగ్లాదేశ్‌లో హిందువులపై దారుణాలు ఆగడం లేదు. బంగ్లాదేశ్‌లో మరో హిందూ యువకుడు హత్యకు గురయ్యాడు. పోలీసులు, స్థానికలు తెలిపిన సమాచారం ప్రకారం.. సమీర్ దాస్ అనే ఆటో డ్రైవర్‌ను కొందరు గుర్తుతెలియని దుండగులు కొట్టి చంపారు. సమీర్ దాస్‌ను హత్య చేసిన తర్వాత, నిందితులు అతడి ఆటోను తీసుకుని పరారయ్యారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
రక్తపు మడుగులో సమీర్ మృతదేహం
సమీర్ కుమార్ దాస్ చాలా కాలం నుంచి బ్యాటరీతో నడిచే ఆటో రిక్షా నడుపుతూ జీవనం సాగిస్తున్నాడు. సమీర్ ఆదివారం (జనవరి 11, 2026) రాత్రి ఇంటికి తిరిగి రాకపోవడంతో కుటుంబసభ్యులు, బంధువులు అతని కోసం వివిధ ప్రాంతాల్లో వెతికినా ప్రయోజనం లేకపోయిందా. దాంతో వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆటో డ్రైవర్‌గా చేస్తున్న సమీర్ కుమార్ దాస్ కనిపించడం లేదని, తమకు అనుమానంగా ఉందని పోలీసులకు చెప్పారు. ఈ క్రమంలో రాత్రి 2 గంటల సమయంలో, స్థానికులు దక్షిణ కరీమ్‌పూర్ సమీపంలోని ముహురి బాడి దగ్గర తీవ్ర రక్తపు గాయాలతో ఉన్న మృతదేహాన్ని చూశారు. స్థానికుల నుంచి సమాచారం అందుకున్న పోలీసులు ముహురి బాడి వద్దకు చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం కోసం ఫెనీ జనరల్ ఆసుపత్రికి తరలించారు.
కేసు దర్యాప్తు చేస్తున్న స్థానిక పోలీసులు
దాగన్‌భుయాన్ పోలీస్ స్టేషన్ ఇన్‌ఛార్జ్ అధికారి (ఓసి) మహ్మద్ ఫైజుల్ అజీమ్ ఈ ఘటనపై స్పందించారు. ఈ ఘటనకు గల అసలు కారణాన్ని తెలుసుకోవడానికి పోలీసులు కృషి చేస్తున్నారని చెప్పారు. ఆటోరిక్షాను దోచుకోవాలనే ఉద్దేశంతో ఈ హత్య జరిగిందా లేదా మరేదైనా కారణం ఉందా అనే కోణంలో దర్యాప్తు చేపట్టారు. ఈ కేసులో మృతుడి కుటుంబ సభ్యులు ఇప్పటికే ఫిర్యాదు చేశారు.
బంగ్లాదేశ్‌లో హిందువులపై పెరిగిన దాడులు, హత్యలు
బంగ్లాదేశ్ 2024 తిరుగుబాటు తర్వాత అస్థిరతను ఎదుర్కొంటోంది. దేశంలో హిందువులపై మతోన్మాదుల దాడులు ప్రపంచవ్యాప్తంగా ఆందోళనను పెంచుతున్నాయి. బంగ్లాదేశ్ హిందూ బౌద్ధ క్రైస్తవ ఐక్యతా పరిషత్ దేశవ్యాప్తంగా మైనారిటీలపై పెరుగుతున్న దాడులపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. ఫిబ్రవరిలో జరగనున్న ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ బంగ్లాదేశ్‌లో మతపరమైన హింస ప్రమాదకర స్థాయిలో పెరుగుతోందని ఆ సంఘం ఆరోపించింది.
హిందువులపై జరుగుతున్న దాడులపై భారత్ ఆందోళన
మహ్మద్ యూనస్ నేతృత్వంలోని మధ్యంతర ప్రభుత్వం హయాంలో బంగ్లాదేశ్‌లో హిందువులపై దాడులు పెరిగాయి. ఈ దాడులపై భారత్ గత వారం తీవ్రంగా స్పందించింది. విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ మాట్లాడుతూ.. బంగ్లాదేశ్‌లో మైనారిటీలపై, వారి ఇళ్లు, వ్యాపారాలపై కొందరు పదేపదే దాడులు చేయడం ఆందోళన కలిగిస్తోంది. ఇటువంటి మతపరమైన సంఘటనలను యూనస్ ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలి. హిందువులపై జరుగుతున్న దాడులపై కఠిన చర్యలు తీసుకుని ఆ హత్యల్ని నివారించాలని సూచించారు. ఇలాంటి వాటిని పట్టించుకోకపోవడం వల్ల నేరస్థులకు ధైర్యం వస్తుందని, అదే సమయంలో మైనారిటీలలో భయం, అభద్రతా భావం పెరుగుతుంది అని అన్నారు. వరుస హత్యలతో బంగ్లాదేశ్‌లో హిందువులకు రక్షణ కరువైందని భారత్ ఆరోపించినా అక్కడి ప్రభుత్వం చర్యలు తీసుకోవడం లేదు.






















