Global Temperature: వేసవిని తలపిస్తున్న వాతావరణం- వీళ్లకు పొంచి ఉన్న ముప్పు- గుండెపోటు కేసులు పెరిగే ప్రమాదం
Global Temperature: దేశంలో మరోసారి ఉష్ణోగ్రతలు గణనీయంగా పెరుగుతున్నాయి. దేశంలో శీతాకాలం సమీపిస్తున్నా ఉష్ణోగ్రతలు ఏమాత్రం తగ్గడం లేదు. ఇప్పటికీ వేసవిని తలపిస్తున్నాయి.
![Global Temperature: వేసవిని తలపిస్తున్న వాతావరణం- వీళ్లకు పొంచి ఉన్న ముప్పు- గుండెపోటు కేసులు పెరిగే ప్రమాదం 220 crore people in India, Pakistan to face deadly heat if global temperature rises by 2 deg C Research Global Temperature: వేసవిని తలపిస్తున్న వాతావరణం- వీళ్లకు పొంచి ఉన్న ముప్పు- గుండెపోటు కేసులు పెరిగే ప్రమాదం](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/10/10/fabcfa475efc63081c717944180d12691696911316894798_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Global Temperature: దేశంలో మరోసారి ఉష్ణోగ్రతలు గణనీయంగా పెరుగుతున్నాయి. దేశంలో శీతాకాలం సమీపిస్తున్నా ఉష్ణోగ్రతలు ఏమాత్రం తగ్గడం లేదు. ఇప్పటికీ వేసవిని తలపిస్తున్నాయి. ప్రజలు ఉక్కపోత, వేడిని తట్టుకోలేకపోతున్నారు. తాజాగా దేశంలో ఉష్ణోగ్రతల పెరుగుదలపై ఓ నివేదిక సంచలన, ఆసక్తికర విషయాలను వెల్లడించింది. తాజా వాతావరణ మార్పులు గ్లోబల్ వార్మింగ్‌కు దారితీస్తాయని, దీని ప్రభావం భారతదేశం, సింధు లోయతో సహా ప్రపంచంలోని అత్యంత జనాభా కలిగిన కొన్ని ప్రాంతాలపై ఉంటుందని నివేదిక అంచానా వేసింది. అంతేకాదు ఆయా ప్రాంతాల ప్రజలు గుండెపోటు, వడ దెబ్బ బారిన పడే ప్రమాదం ఉందని తెలిపింది.
పెన్ స్టేట్ కాలేజ్ ఆఫ్ హెల్త్ అండ్ హ్యూమన్ డెవలప్‌మెంట్, పర్డ్యూ యూనివర్శిటీ కాలేజ్ ఆఫ్ సైన్సెస్ పర్డ్యూ ఇన్‌స్టిట్యూట్ ఫర్ ఎ సస్టైనబుల్ ఫ్యూచర్ సంస్థలు ‘ప్రొసీడింగ్స్ ఆఫ్ ది నేషనల్ అకాడమీ ఆఫ్ సైన్సెస్’లో ఈ పరిశోధనాత్మక కథనాన్ని ప్రచురించాయి. భూగ్రహం ఉష్ణోగ్రత 1.5 డిగ్రీల సెల్సియస్‌కు మించి వేడెక్కుతున్నట్లు సూచించింది. మానవ శరీరాలు నిర్ధిష్ట ఉష్ణోగ్రత, తేమలను మాత్రమే తట్టుకోగలవని, వాటి స్థాయిని దాటితో గుండె పోటు, హీట్ స్ట్రోక్ వచ్చే ప్రమాదం ఉందని పేర్కొంది.
ప్రపంచ ఉష్ణోగ్రతలు ప్రీ ఇండస్ట్రియల్ ఉష్ణోగ్రతలతో పోలిస్తే 2 డిగ్రీల సెల్సియస్ పెరిగితే ముప్పు తప్పదని నివేదిక హెచ్చరించింది. పాకిస్తాన్, భారతదేశంలోని సింధు నది లోయలోని 2.2 బిలియన్ల మంది, తూర్పు చైనాలో 1 బిలియన్ మంది, సబ్-సహారా ఆఫ్రికాలో 800 మిలియన్ల మంది ప్రజలు ఈ వేడిని అనుభవిస్తారని అధ్యయనం వెల్లడించింది. ఈ వేడి గాలులను భరించే నగరాలలో ఢిల్లీ, కోల్‌కతా, షాంఘై, ముల్తాన్, నాన్జింగ్ వుహాన్ ఉన్నాయి. ఈ ప్రాంతాల్లో ప్రజలకు తక్కువ, మధ్య తరగతి ఆదాయం ఉన్నవారు ఎక్కువ మంది ఉన్నారని, వారు ఏసీలు, కూలర్లు కొనుగోలు చేసే పరిస్థితి ఉండకపోవచ్చని పేర్కొంది.
గ్లోబల్ వార్మింగ్ ప్రీ ఇండస్ట్రియల్ ఉష్ణోగ్రతలతో పోలిస్తే 3 డిగ్రీల సెల్సియస్ పెరిగితే దాని ప్రభావం తూర్పు సముద్ర తీరం, యునైటెడ్ స్టేట్స్‌లో - ఫ్లోరిడా నుంచి న్యూయార్క్ వరకు, హ్యూస్టన్ నుంచి చికాగో వరకు ఉంటుందని అంచనా వేసింది. దక్షిణ అమెరికా, ఆస్ట్రేలియా కూడా విపరీతమైన వేడి బారిన పడుతున్నట్టు పరిశోధనలో తేలింది. అభివృద్ధి చెందుతున్న దేశాల కంటే అభివృద్ధి చెందిన దేశాలలోని ప్రజలపై దీని ప్రభావం ఉంటుందని, వృద్ధులు, అనారోగ్యంతో బాధపడేవారు ప్రాణాలు కోల్పోయే ప్రమాదం ఉందన్నారు. ఆర్థికంగా సంపన్నంగా లేని ప్రాంతాల్లో వచ్చే దశాబ్ధాల్లో జనాభ విపరీతంగా పెరుగుతుందని, ఫలితంగా వేడి గాలులు, వాటి ప్రభావం ఎక్కువగా ఉంటుందని పరిశోధనా పత్రం సహ రచయిత, పర్డ్యూ విశ్వవిద్యాలయంలో భూమి, వాతావరణం, గ్రహ శాస్త్రాల ప్రొఫెసర్ మాథ్యూ హుబెర్ అన్నారు.
సంపన్న దేశాల కంటే ఈ దేశాలు చాలా తక్కువ గ్రీన్హౌస్ వాయు ఉద్గారాలను ఉత్పత్తి చేస్తున్నా, ఈ ఉష్ణోగ్రతల పెరుగుదల ప్రభావం బిలియన్ల మంది పేదలపై పడుతుందన్నారు. అనేక మంది బాధలు పడాల్సి వస్తుందని, చాలా మంది చనిపోవచ్చని ఆయన అభిప్రాయపడ్డారు. సంపన్న దేశాలు సైతం ఈ వేడికి గురవుతాయని, ప్రతి ఒక్కరూ ఏదో ఒక విధంగా ప్రభావితమవుతారని ఆయన అన్నారు. ఉష్ణోగ్రతలు పెరగకుండా నిరోధించడానికి, గ్రీన్‌హౌస్ వాయువుల ఉద్గారాలను, ముఖ్యంగా శిలాజ ఇంధనాలను కాల్చడం ద్వారా విడుదలయ్యే కార్బన్ డయాక్సైడ్‌ను తగ్గించాలని పరిశోధకులు తెలిపారు. మార్పులు చేయకపోతే మధ్యతరగతి, అల్పాదాయ దేశాలు ఎక్కువగా నష్టపోతాయని హెచ్చరించారు.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)