Viper Venom for Covid 19: ఇది విన్నారా? ఆ పాము విషంతో కరోనాకు చెక్!
ఓ పాములోని విషంలో ఉండే పదార్థం.. కరోనా వైరస్ ను నియంత్రిస్తుందని తాజా అధ్యయనంలో తేలింది. కోతుల్లో కరోనాను ఇది 75 శాతం నియంత్రించినట్లు శాస్త్రవేత్తలు గుర్తించారు.
పామును చూస్తేనే చాలా మందికి వణుకొస్తుంది. కానీ అలాంటి పాము విషాన్ని రకరకాల మందుల తయారీలో వినియోగిస్తారు. తాజాగా కొవిడ్ ను నివారించే శక్తి కూడా ఓ పాము విషానికి ఉందని తాజా అధ్యయనంలో తేలింది.
ఎక్కడంటే..?
బ్రెజిల్ అడవుల్లో ఎక్కువగా కనిపించే సర్పం 'జరారాకుసో' విషంతో కరోనాను అడ్డుకోవచ్చని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఈ పాము పొడవు 2 మీటర్ల వరకు ఉంటుంది. బొలీవియా, పరాగ్వే, అర్జెంటీనా దేశాల్లోనూ ఈ పాములు కన్పిస్తుంటాయి. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన అధ్యయనం సైంటిఫిక్ జర్నల్ మాలిక్యూల్స్‌లో ప్రచురితమైంది.
రక్తపింజరి జరారాకుసో విషంలో ఉండే అణువులు.. కొవిడ్ వైరస్ పునరుత్పత్తిని సమర్థవంతంగా అడ్డుకుంటున్నట్లు ఈ పరిశోధనలో గుర్తించారు. ఆ సర్ప విష అణువులు కోతుల్లో 75 శాతం కరోనా వైరస్ కణాల వృద్ధిని నియంత్రిస్తున్నట్లు శాస్త్రవేత్తలు తెలిపారు. సావో పౌలో యూనివర్సిటీ ప్రొఫెసర్ రఫేల్ గైడో దీనికి సంబంధించిన వివరాలు తెలిపారు.
Also Read: Dengue Fever in UP: యూపీలో మిస్టరీ ఫీవర్.. 40 మందికి పైగా మృతి
మానవులపై..
వైపర్ విషంలోని ఓ 'పెప్టైడ్'.. కరోనా వైరస్ పునరుత్పత్తిలో కీలక పాత్ర పోషించే 'పీఎల్‌ప్రో' అనే ఎంజైమ్‌కు అనుసంధానమవుతున్నట్లు ప్రొఫెసర్ గైడో తెలిపారు. అయితే ఇతర కణాలను ఈ పెప్టైడ్ హాని చేయట్లేదని వివరించారు. యాంటీబ్యాక్టీరియల్ గుణాలున్న ఈ పెప్టైడ్‌ను ప్రయోగశాలల్లోనూ ఉత్పత్తి చేయొచ్చని గైడో తెలిపారు. ఇందుకోసం పాముల్ని హింసించాల్సిన అవసరం లేదన్నారు. అయితే ఎంత డోసులో ఇస్తే ఆ పదార్థం ప్రభావవంతంగా పనిచేస్తుందో తెలియాల్సి ఉంది. జంతువులపై చేసే ఈ ప్రయోగాలన్నీ సఫలమైతే తర్వాతి దశలో మనుషులపై కూడా వీటిని పరీక్షిస్తామని పరిశోధకులు తెలిపారు.
భారత్ లో కరోనా కేసులు స్థిరంగా కొనసాగుతున్నాయి. దేశవ్యాప్తంగా కొత్తగా 41,965 కొవిడ్ పాజిటివ్ కేసులు నమోదైనట్లు కేంద్ర వైద్య, ఆరోగ్య శాఖ వెల్లడించింది. వీటితో కలిపి దేశంలో ఇప్పటి వరకు మొత్తం కేసుల సంఖ్య 3.28 కోట్లకు చేరింది. 460 మంది మరణించారు. దీంతో కొవిడ్ కారణంగా మరణించిన వారి సంఖ్య 4,39,020కి పెరిగింది. ఇక నిన్న ఒక్క రోజే 33,964 మంది వైరస్ నుంచి కోలుకున్నారు. దీంతో రికవరీల సంఖ్య 3.19 కోట్లకు చేరింది. ప్రస్తుతం దేశంలో రికవరీ రేటు 97.51 శాతానికి చేరినట్లు వైద్య, ఆరోగ్య శాఖ తెలిపింది.
Also Read: Al Qaeda on Taliban: తాలిబన్లకు అల్ ఖైదా అభినందనలు.. 'కశ్మీర్'పై కీలక వ్యాఖ్యలు