Weather Latest Update: మోచా తుఫాను ముప్పు తప్పినట్టే, ఊపిరి పీల్చుకుంటున్న ఏపీ, తెలంగాణ
Weather Latest Update: బంగాళాఖాతంలో ఏర్పడ్డ అల్ప పీడనం నేడు వాయుగుండంగా మారబోతుంది. బంగ్లాదేశ్, మయన్మార్ వైపు దూసుకెళ్తున్నట్టు వాతావరణ శాఖ అంచనా వేస్తోంది.
Weather Latest Update: అండమాన్ నికోబార్ దీవులకు సమీపంలో సోమవారం ఏర్పడిన అల్పపీడం నేడు వాయుగుండంగా మారుబోతోంది. ఉపరితలం ఆవర్తనం కొనసాగడంతో అల్పపీడనం వాయుగుండంగా మారి.. ఆ తర్వాత తూర్పు మధ్య బంగాళాఖాతానికి ఆనుకొని ఉన్న ఆగ్నేయ బంగాళాఖాతంలో ఈనెల 10వ తేదీకి తుఫానుగా బలపడనుంది. ఆపై తుఫాను మొదట్లో 11వ తేదీ వరకు ఉత్తర, వాయువ్య దిశగా కదులుతుంది. తుఫానుగా మారి బంగ్లాదేశ్, మయన్మార్ వైపు దూసుకెళ్లే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ వెల్లడించింది. అయితే ఈ తుఫాను ప్రభావం ఉండబోదని స్పష్టం చేసింది. అయితే బంగాళాఖాతంలో తుఫాను ఏర్పడనున్న నేపథ్యంలో మత్స్యకారులు చేపల వేటకు వెళ్లకూడదని ఐఎండీ హెచ్చరించింది.
మళ్లీ పెరగనున్న ఎండలు..
మోచా తుపాను ప్రభావంతో రాష్ట్రంలో వర్షం కురిసి చల్లగా ఉంటుందని అంతా భావించారు. కానీ అందుకు భిన్నంగా తుఫాను ప్రభావం రాష్ట్రంపై పడట్లేదని తెలిసినప్పటి నుంచి ప్రజలు టెన్షన్ పడుతున్నారు. విపరీతమైన ఎండల్లో మళ్లీ మగ్గిపోవాల్సిందేని అని బాధపడుతున్నారు. నైరుతి బంగాళాఖాతం, ఉత్తర తమిళనాడు పరిసర ప్రాంతాల్లో ఉపరితల ఆవర్తనం కొనసాగుతుంది. ఇది ఉపరితల ద్రోణి, అల్పపీడనంతో అనుసంధానమై ఉంది. ఫలితంగా రానున్న మూడు రోజులు కోస్తాంధ్ర, రాయలసీమల్లో అక్కడక్కడా తేలిక పాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని ఐఎండీ తెలిపింది. మరోవైపు రాష్ట్రంలో గరిష్ట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 2, 4 డిగ్రీలు అధికంగా నమోదు అవుతాయని పేర్కొంది. ఫలితంగా రాష్ట్రంలో మళ్లీ ఎండలు పెరగనున్నాయి.
మోచా తుపాను(Mocha Cyclone ) బలమైన అల్పపీడనంగా ఉందని... 9వ తేదీ నాటికి తీవ్ర వాయగుండంగా మారుతుంది. 10 తేదీ నాటికి తుపానుగా మారే అవకాశం ఉంది. 11, 12 నాటికి తీవ్ర తుపానుగా మారుతుంది. దీని ప్రభావం అండమాన్ నికోబార్‌పై ఎక్కువగా ఉంటుంది. అయితే తుపానుగా మారే నాటికి మయన్మార్ వైపు వెళ్లిపోనుందీ మోచా. 14వ తేదీ నాటికి అతి పెను తుపానుగా మారుబోతోంది. తుపాను ఈ వారంలో పశ్చిమ బెంగాల్‌కు సమీపంలో తీరం దాటే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) తెలిపింది. ఆగ్నేయ బంగాళాఖాతం, దానిని ఆనుకుని ఉన్న దక్షిణ అండమాన్ సముద్రంలో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందని వాతావరణ శాఖ తెలిపింది. దక్షిణ బెంగాల్‌పై ప్రభావం చూపే అవకాశం ఉంది.
11వ తేదీ తర్వాత తెలుగు రాష్ట్రాల్లో పరిస్థితి దారుణంగా ఉంటుందని ఆంధ్రప్రదేశ్ వెదర్ మ్యాన్ చెప్పారు. 10 వతేదీ నాటికి వర్షాలు తగ్గుముఖం పడతాయని చెప్పారు. 11 తర్వాత విపరీతమైన వడగాల్పులు ప్రజలను ఊపిరి ఆడనీయకుండా చేస్తాయట. థార్ ఎడారి నుంచి వచ్చే గాలులు ప్రభావం తెలుగు రాష్ట్రాలపై విపరీతంగా ఉండబోతోంది. దీని వల్ల ఉష్ణోగ్రతలు ఒక్కసారిగా పెరిగిపోనున్నాయి. కొన్ని ప్రాంతాల్లో 46 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు రికార్డు అయ్యే ఛాన్స్ ఉంది. ఐఎండీ హెచ్చరికతో దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాలు అప్రమత్తమయ్యాయి. 'మోచా' తుపానుకు సంబంధించి ఒడిశాలోని 18 జిల్లాల్లో వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. తుపాను, పిడుగుల హెచ్చరికలతో 9 జిల్లాల్లో ఎల్లో అలర్ట్ జారీ చేశారు.