Wayanad Landslide: అర్ధరాత్రి ఇల్లంతా ఒక్కసారిగా ఊగిపోయింది, సాయం కోసం కేకలు వేశాను - వయనాడ్ బాధితురాలు
Wayanad: వయనాడ్‌లో కొండ చరియలు విరిగి పడి ఇళ్లన్నీ ధ్వంసమవుతున్నాయి. 150 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. కొంత మంది బాధితులు తృటిలో ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నారు.
Massive Landslides in Wayanad: కేరళలోని వయనాడ్‌లో వరదలు (Wayanad Landslides News) ముంచెత్తుతున్నాయి. ఇప్పటికే 160 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. బాధితులను రెస్క్యూ టీమ్స్ సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నాయి. పదుల సంఖ్యలో బాధితులు గల్లంతయ్యారు. వాళ్ల ఆచూకీ కనుగొనేందుకు ప్రత్యేక బృందాలు రంగంలోకి దిగాయి. చాలా చోట్ల కొండ చరియలు విరిగిపడుతున్నాయి. రాకపోకలు ఎక్కడికక్కడే నిలిచిపోయాయి. టీఎస్టేట్‌లన్నీ వరద నీళ్లలో ధ్వంసమయ్యాయి. తేయాకు తోటలు చెల్లాచెదురయ్యాయి. ఈ టీ ఎస్టేట్‌లలో పని చేసే కార్మికులకు ఈ వరదలు నరకం చూపిస్తున్నాయి. దాదాపు 550 కుటుంబాలు వరదల్లో చిక్కుకున్నాయి. ఇళ్లన్నీ ధ్వంసమై నిరాశ్రయులయ్యారు. నిద్రలో ఉండగానే ఒక్కసారిగా కొండ చరియలు విరిగి పడి వరదలు వచ్చి ముంచెత్తాయి. ఏం జరుగుతోందో తెలుసుకునే లోపే అంతా మునిగిపోయింది. ఈ క్రమంలోనే వరదల నుంచి క్షేమంగా బయటపడ్డ బాధితులు ఆ సమయంలో ఏం జరిగిందో వివరించారు. కొందరు కన్నీళ్లు పెట్టుకుంటూ వరద నీళ్లు ముంచెత్తిన క్షణాల గురించి చెబుతున్నారు. ఓ మహిళ నిద్రలో ఉండగానే ఇల్లంతా ధ్వంసమైంది. ఏం చేయాలో అర్థం కాక గట్టిగా కేకలు వేసింది. సాయం కోసం చాలా సేపు ఎదురు చూసింది. తలుపు బద్దలు కొట్టి బయట పడేందుకు ప్రయత్నించినా తన వల్ల కాలేదు. చివరకు ఇరుగు పొరుగు వాళ్ల సాయంతో క్షేమంగా బయటకు వచ్చినట్టు చెప్పింది.
"ఇంట్లో నేను ఒక్కదాన్నే ఉంటాను. రాత్రి ఉన్నట్టుండి ఇల్లంతా ఊగిపోయింది. భారీ శబ్దాలు వినిపించాయి. పక్కింటి వాళ్లకి కాల్ చేశాను. కానీ ఎవరూ కాల్ అటెండ్ చేయలేదు. కోయంబత్తూర్‌లో ఉన్న నా కొడుకుకి కాల్ చేశాను. ఎలాగాలో ఇంటికి పైకి ఎక్కి ఉండాలని చెప్పాడు. కానీ ఎంతకీ తలుపు తెరుచుకోలేదు. సాయం కోసం గట్టిగా కేకలు వేశాను. కాసేపటికి ఎవరో వచ్చి తలుపులు బద్దలు కొట్టి నన్ను కాపాడారు. కొండ చరియలు విరిగి పడడం వల్ల ఇల్లంతా ధ్వంసమైపోయింది. ముందక్కైలో ఉండే మా బంధువులంతా చనిపోయారు. ఇప్పుడు నాకంటూ ఓ ఇల్లు లేకుండా పోయింది. ఇల్లు కట్టుకునే స్తోమత కూడా లేదు. ఏం చేయాలో అర్థం కావడం లేదు"
- బాధితురాలు
Kerala | A victim of Wayanad landslide says, “ I stay alone at my home, at night I felt like my bed is shaking and heard loud noises…I tried to call my neighbours but nobody picked up the phone…I called my son who stays in Coimbatore and he asked me to climb on top of the house… pic.twitter.com/5fzaU1vven
— ANI (@ANI) July 31, 2024
టీ ఎస్టేట్‌లలో పని చేసే వాళ్ల కోసం కట్టించిన ఇళ్లు నామరూపాల్లేకుండా పోయాయి. చాలా మంది కార్మికులు వాటి శిథిలాల కిందే చిక్కుకుని విలవిలలాడి మృతి చెందారు. శిథిలాల కింద ఉన్న వాళ్లను బయటకు తీయడం రెస్క్యూ టీమ్స్‌కి కూడా సవాల్‌గా మారింది. కొన్ని చోట్ల వంతెనలు కూలిపోయాయి. తాత్కాలికంగా వంతెనలు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం భావిస్తోంది.