Vizianagaram Protest: సర్వజన ఆసుపత్రిలో వృద్ధురాలి మృతి, వైద్యుల నిర్లక్ష్యం వల్లే అంటూ ఆందోళన
Vizianagaram Protest: వైద్యుల నిర్లక్ష్యం వల్లే తమ కుటుంబ పెద్ద రాములమ్మ కన్నుమూసిందంటూ కుటుంబ సభ్యులు, బంధువులు మృతదేహంతో సర్వజన ఆస్పత్రి ఎదుట ఆందోళన చేపట్టారు.
Vizianagaram Protest: విజయనగరం జిల్లా సర్వజన ఆస్పత్రిలో వైద్యుల నిర్లక్ష్యం వల్లే వృద్ధురాలు మృతి చెందిందంటూ ఆమె బంధువులు సోమవారం ఆందోళన చేపట్టారు. సరైన చికిత్స అందించలేదని, అడిగితే సిబ్బంది దురుసుగా ప్రవర్తించారని వాపోయారు. దీనిపై ఆస్పత్రి సూపరింటెండెంట్ స్పందించి అదలేం లేదని వయసు ప్రభావం, ఆరోగ్య సమస్యల వల్లే వైద్యం చేసినా ఆమె శరీరం స్పందించ లేదని తెలిపారు. అందువల్లే ఆ వృద్ధురాలు ప్రాణాలు కోల్పోయిందని వివరించారు.
అసలేం జరిగిందంటే..?
విజయనగరం జిల్లా ఎస్.కోటకు చెందిన కోరాడ రాములమ్మ(73)కు ఆదివారం ఉదయం మూత్రం బ్లాక్ అవ్వడంతో తీవ్ర అస్వస్థతకు గురైంది. వెంటనే ఆమెను కుటుంబ సభ్యులు సమీప ఆసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడ చికిత్స చేసిన వైద్యులు పరిస్థితి విషమంగా ఉందని.. మెరుగైన చికత్స కోసం మరో ఆస్పత్రికి తీసుకెళ్లాలని సూచించారు. దీంతో కుటుంబ సభ్యులు రాములన్నను ఆదివారం మధ్యాహ్నం విజయనగరంలోని ప్రభుత్వ సర్వజన ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ఆమె సోమవారం ఉదయం తొమ్మిది గంటల సమయంలో మృతి చెందింది. సరైన చికిత్స అందించ లేదని, వైద్యుల నిర్లక్ష్యమే ఆమె మృతికి కారణమని ఆరోపిస్తూ బంధువులు ఆసుపత్రి ఎదుట మృతదేహంతో ఆందోళన చేపట్టారు.
మృతురాలి మనవడు వంశీ మాట్లాడుతూ.. తీవ్ర మధుమేహ సమస్యతో యూరిన్ బ్లాక్ అయ్యిందని, ప్రభుత్వ సర్వజన ఆసుపత్రికి ఆమెను తీసుకొచ్చామని చెప్పాడు. మూత్రం సాఫీగా రావడానికి సరైన చికిత్స చేయలేదని ఆరోపించాడు. సాధారణ వైద్యం మాత్రమే అందించారని వాపోయాడు. దీనివల్లే తన అమ్మమ్మ రాములమ్మ మృతి చెందిందన్నాడు. దీనిపై వైద్యులను, సిబ్బందిని ప్రశ్నిస్తే దురుసుగా ప్రవర్తించారని ఆవేదన వ్యక్తం చేశాడు. తాము పేదవారమని, ఎటువంటి సపోర్టు లేకపోవడం వల్లే నిర్లక్ష్యంగా వ్యహరించారని వాపోయాడు. ఇదే విషయంపై ఆసుపత్రి సూపరింటెండెంట్ అప్పల నాయుడు వద్ద మీడియా ప్రస్తావించగా.. చికిత్సలో ఎటువంటి లోపమూ జరగలేదని, వైద్యుల నిర్లక్ష్యం ఏమీ లేదని తెలిపారు. ఆమెకు తీవ్రమైన మధుమేహం, వయస్సు ప్రభావంతో సకాలంలో చికిత్స చేసినప్పటికీ శరీరం సహకరించలేదని చెప్పారు. రోగులతో వైద్యులు, వైద్యసిబ్బంది దురుసుగా ప్రవర్తించరాదని, ఇప్పటికే ఈ విషయంపై వైద్యులతో మాట్లాడామని తెలిపారు.
మూడు నెలల క్రితం గుంటూరులో వైద్యుల నిర్లక్ష్యం!
ప్రభుత్వ ఆస్పత్రులపై ప్రజలకు అపనమ్మకం కలిగే ఓ ఘటన తాజాగా జరిగింది. గర్భిణీకి పురుడు పోసిన అనంతరం అప్పుడే పుట్టిన శిశువుకు బొడ్డు తాడు కట్ చేయడంలో పెద్ద తప్పిదం చేశారు. ఆంధ్రప్రదేశ్ లోని పల్నాడు జిల్లా మాచర్ల ప్రభుత్వ ఆస్పత్రిలో ఈ ఘటన చోటు చేసుకుంది. బొడ్డు కోయబోయి ఏకంగా బిడ్డ వేలు కోసేశారు.. వైద్య సిబ్బంది. మాచర్ల ప్రభుత్వ ఆసుపత్రిలో జరిగిన ఈ ఘటన చాలా ఆలస్యంగా వెలుగు చూసింది.
బాధితుల కుటుంబ సభ్యులు, పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం.. స్వరూప అనే మహిళ గత ఏడాది సెప్టెంబరు 30న మాచర్ల ప్రభుత్వ ఆసుపత్రిలో చేరింది. తొలి కాన్పులో భాగంగా ఓ మగ బిడ్డకు జన్మ ఇచ్చింది. అయితే, పురుడు పోసిన అనంతరం ఆమె స్పృహలోకి రాక ముందే బిడ్డకు ఉన్న బొడ్డు తాడు కోసే క్రమంలో వైద్య సిబ్బంది శిశువు కుడి చేతి చిటికెన వేలు కోసేశారు. దీంతో వెంటనే తమ తప్పును తెలుసుకొని తల్లీ, బిడ్డ ఇద్దర్నీ గుంటూరులోని ప్రభుత్వ ఆస్పత్రి జీజీహెచ్ కి తరలించారు. అక్కడ వైద్య పరీక్షించిన అనంతరం ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. బాబు చిటికెన వేలు చివర్లో తెగిందని, ఆపరేషన్ చేసి ఆ తెగిన వేలును అతికిస్తామని ప్రైవేటు ఆస్పత్రి డాక్లర్లు తెలిపారు. అయితే, ఈ విషయం బయట పడకుండా ప్రభుత్వ ఆస్పత్రి డాక్టర్లు జాగ్రత్త పడ్డారు.