US Visa Hike: స్టూడెంట్ వీసాల ప్రాసెసింగ్ ఫీ పెంచిన అమెరికా, అప్పటి నుంచే అమల్లోకి
US Visa Hike: స్టూడెంట్ వీసాల ప్రాసెసింగ్ ఫీ పెంచుతున్నట్టు అమెరికా ప్రకటించింది.
US Visa Fee Hike:
25 డాలర్ల పెంపు..
విద్యార్థులకు అమెరికా బ్యాడ్ న్యూస్ చెప్పింది. స్టూడెంట్ వీసాల ప్రాసెసింగ్ ఫీ పెంచుతున్నట్టు ప్రకటించింది. యూఎస్ స్టేట్ డిపార్ట్‌మెంట్ అధికారికంగా వెల్లడించింది. నాన్ ఇమిగ్రెంట్ వీసాల అప్లికేషన్ ఫీజు పెంచడం వల్ల అమెరికాకు వెళ్లాలనుకునే వారికి ఆ మేరకు ఖర్చు పెరగనుంది. ఈ ఏడాది మే 30 నుంచి పెంచిన ప్రాసెసింగ్ ఫీ అమల్లోకి వస్తుందని వెల్లడించింది అగ్రరాజ్యం. విజిటర్, టూరిస్ట్, బిజినెస్, స్టూడెంట్, ఎక్స్‌ఛేంజ్ విజిటర్ వీసాలన్నింటికీ ఇది అమలు కానుంది.
"ఈ ఏడాది మే 30 నుంచి విజిటర్ వీసాలు, బిజినెస్/టూరిజం వీసాలతో (B1/B2)పాటు స్టూడెంట్, ఎక్స్‌చేంజ్ విజిటర్ వీసాల ఫీ పెరగనుంది. ప్రస్తుతం ఈ రుసుము 160 డాలర్లుగా ఉంది. దీన్ని 185 డాలర్లకు పెంచుతున్నాం"
- యూఎస్ స్టేట్ డిపార్ట్‌మెంట్
ఎక్స్‌ఛేంజ్ విజిటర్ వీసాలకు సంబంధించిన రెండేళ్ల రెసిడెన్సీ ఫీ సహా ఇతర కాన్సులర్ ఫీలలో ఎలాంటి మార్పులు లేవని స్పష్టం చేసింది. 2022 అక్టోబర్ 1 నుంచి వీసా అప్లికేషన్ పెట్టుకున్న వాళ్లందరికీ ఈ పెంచిన ఫీలు అమలవుతాయని వెల్లడించింది. ఈ ఏడాది సెప్టెంబర్ 30వ తేదీ వరకూ ఇది అమలు కానుంది. పిటిషన్ బేస్డ్ నాన్ ఇమిగ్రెంట్ వీసాల ప్రాసెసింగ్ ఫీ కూడా పెరగనుంది.
"తాత్కాలిక ఉద్యోగులు అప్లై చేసుకునే పిటిషన్ బేస్డ్ నాన్ ఇమిగ్రెంట్ వీసాల (H,L,O,P,Q) ప్రాసెసింగ్ ఫీ ప్రస్తుతం 190 డాలర్లుగా ఉంది. దీన్ని 205 డాలర్లకు పెంచుతున్నాం. E కేటగిరీలోని ట్రీటీ ట్రేడర్, ట్రీటీ ఇన్వెస్టర్, ట్రీటీ అప్లికెంట్స్ వీసాల ఫీ 205 డాలర్ల నుంచి 315 డాలర్లకు పెంచుతున్నాం"
- యూఎస్ స్టేట్ డిపార్ట్‌మెంట్
వాళ్లకు ఊరట..
విదేశాల్లో ఉన్న భారతీయుల్లో గుబులు మొదలైంది. జాబ్ సెక్యూరిటీ విషయంలో కంగారు పడిపోతున్నారు. ఈ క్రమంలోనే అమెరికా కీలక నిర్ణయం తీసుకునే అవకాశాలున్నాయి. ఉద్యోగాలు కోల్పోయిన వాళ్లకు కాస్తంత ఊరట కలగనుంది. H1B Visaతో అమెరికాలో ఉన్న ఉద్యోగులు...జాబ్ పోయాక 60 రోజుల్లోగా మరో కంపెనీలో చేరాలి. మళ్లీ ఆ కంపెనీ వీసాతో మరి కొన్నాళ్ల పాటు అక్కడ పని చేసుకునేందుకు వీలుంటుంది. అయితే...ఈ గడువుని 60 రోజుల నుంచి 180 రోజులకు పెంచింది. ప్రెసిడెన్షియల్ అడ్వైజరీ సబ్ కమిటీ ప్రభుత్వానికి ఇదే విషయాన్ని సూచించింది. వేలాది మంది H1B వర్కర్లకు ఇది ఊరట కలిగిస్తుందని తెలిపింది. 180 రోజుల గడువు ఉంటే వాళ్లు మరో ఉద్యోగం చూసుకునేందుకు అవకాశముంటుందని వివరించింది. H-1B అనేది నాన్ ఇమిగ్రెంట్ వీసా. అమెరికా కంపెనీలు విదేశాల నుంచి ఉద్యోగులను రప్పించుకుని పని చేయించుకునేందుకు ఈ వీసాలు వీలు కల్పిస్తాయి. అయితే...ఈ మధ్య కాలంలో భారీ ఎత్తున లేఆఫ్‌లు జరుగుతున్నాయి. అంతకు ముందు నిబంధన ప్రకారం 60 రోజుల్లోనే మరో ఉద్యోగం చూసుకోవడం కష్టమైపోతోంది. అందుకే ఈ గడువుని పెంచాలని కమిటీ సూచించింది. ఈ వీసాపై వచ్చిన వాళ్లంతా నిపుణులే. అలాంటి వాళ్లను కోల్పోవడానికి బదులుగా కొన్ని మినహాయింపులు ఇవ్వడం మంచిదనే ఆలోచనలో ఉంది బైడెన్ యంత్రాంగం.
Also Read: Covid-19 Cases Spike: కరోనా కేసులు పెరగడానికి కారణాలివే, వివరించిన నిపుణులు