Britain Fuel Crisis: పెట్రోల్ బంకుల ముందు భారీ క్యూలు.. రంగంలోకి సైన్యం.. బ్రిటన్‌కు ఏమైంది?
బ్రిటన్‌లో ఇంధన కొరత తీవ్రంగా ఉంది. పెట్రోల్ బంకుల ముందు వాహనదారులు బారులు తీరుతున్నారు. ఈ సమస్యకు కారణమేంటి?
ప్రెట్రోల్ బంకుల ఎదురుగా బారులు తీరిన జనాలు, పెట్రోల్ కోసం వేచి ఉన్న కార్లు, ట్రక్కు డ్రైవర్ల లోటు.. ఇది ప్రస్తుతం బ్రిటన్‌లో పరిస్థితి. యూకే వ్యాప్తంగా ప్రస్తుతం ఇంధన లోటు భారీగా ఉంది. పెట్రోల్ బంకుల బయట గంటలకొద్ది వేచి ఉన్న ప్రజలు గొడవకు దిగుతున్నారు. ఈ పరిస్థితిని అదుపుచేసేందుకు ఏకంగా సైన్యాన్నే రంగంలోకి దింపింది ప్రభుత్వం.
అయితే కరోనా వైరస్, బ్రెగ్జిట్, ట్రక్కు డ్రైవర్ల కొరత వంటి సమస్యల వల్లే ఈ పరిస్థితి ఏర్పడినట్లు పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి.
నో స్టాక్ బోర్డులు..
యూకేలో దాదాపు అన్ని పెట్రోల్ బంకుల ముందు 'నో స్టాక్' బోర్డులు కనిపిస్తున్నాయి. ఇంధనం కోసం వాహనదారులు గంటలకొద్దీ పడిగాపులు కాస్తున్నారు. చాలామంది సహనం కోల్పోయి తగువులకు దిగుతున్నారు.
రంగలోకి సైన్యం..
బంకుల వద్ద నెలకొన్న రద్దీని నియంత్రించేందుకు సైన్యాన్ని రంగంలోకి దింపింది ప్రభుత్వం. అంతేకాదు రిఫైనరీల నుంచి ట్రక్కులను పెంట్రోల్ బంకులకు తరలించేందుకు సైన్యాన్ని వినియోగించనున్నట్లు సమాచారం. పౌరులెవరూ ఇంధనాన్ని నిల్వ చేసుకోవద్దని ఈ సందర్భంగా ప్రభుత్వం కోరింది.
ట్రక్కు డ్రైవర్ల కొరత..
బ్రిటన్ వ్యాప్తంగా దాదాపు లక్ష మంది ఆపరేటర్ల కొరత ఉందని పరిశ్రమ వర్గాలు గుర్తించాయి. గత ఏడాది ఐరోపా సమాఖ్య నుంచి దాదాపు 25,000 మంది హెవీ గూడ్స్ వెహికల్ డ్రైవర్లు వెళ్లిపోయారు.
మరోవైపు దేశంలో హెవీ గూడ్స్ వెహికల్ డ్రైవర్ల పరీక్షల కోసం 40,000 మంది ఎదురుచూస్తున్నారని నివేదికలు చెబుతున్నాయి. యూకేలో ట్రక్ డ్రైవర్ల సగటు వయస్సు 57 సంవత్సరాలు. ప్రస్తుతం వీరు ఎక్కువగా రిటైర్ అవుతుండటం కూడా ఓ కారణంగా మారింది.
దివ్యాంగుల వ్యథ..
కిలోమీటర్ల కొద్ది వాహనాలు పెంట్రోల్ బంకుల వద్ద నిలిచిపోవడం వల్ల దివ్యాంగుల పరిస్థితి దారుణంగా ఉంది. వాళ్లు బుక్ చేసుకున్న క్యాబ్‌లు, వాహనాల్లోనే గంటలకొద్దీ వేచి ఉండాల్సి వస్తోంది. అయిన పెట్రోల్ దొరకడం లేదని వాపోతున్నారు. వెంటనే ఈ సమస్యను పరిష్కరించాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు.
Also Read:China Power Crisis: చీకట్లో చైనా.. పరిశ్రమలకు చిక్కులు.. ఇక ప్రపంచానికి చుక్కలు!
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి